38.2 C
Hyderabad
May 2, 2024 22: 37 PM
Slider జాతీయం

కుకీ-మైతేయ్‌ విద్వేషం వెనుక..!

#manipurviolence

మణిపుర్‌లో హింస రేపుతున్న జాతుల వైరం

రెండు నెలలుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ సమస్య అమానవీయంగా మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో మరోమారు భగ్గుమంది. దీంతో పాటు కుకీ, మైతేయ్‌ తెగల మధ్య వైరం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎవరీ కుకీలు, మైతేయ్‌లు? ఎందుకు వీరి మధ్య ఇంత విద్వేషం?

అసలేం జరిగిందంటే..:

దేశ ఈశాన్య భాగంలో ఉన్న మణిపుర్‌ను భారతీయ స్విట్జర్లాండ్‌గా పిలుస్తుంటారు. ఆహ్లాదకరమైన ప్రదేశాలతో కూడిన ఈ అందాల రాష్ట్రం కొద్దినెలలుగా అంతర్యుద్ధంలాంటి పరిస్థితులతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రాన్ని ఈ పరిస్థితిలోకి నెట్టింది కుకీ, మైతేయ్‌ల ఘర్షణ. ఇంత హింస చెలరేగటానికి ప్రధాన కారణం మైతేయ్‌ తెగను ఎస్టీలుగా గుర్తించాలన్న డిమాండ్‌. దీన్ని ఇతర ఆదివాసీ తెగలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మైతేయ్‌లను ఎస్టీల్లో చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ మే 3న మణిపుర్‌ అఖిల ఆదివాసీ విద్యార్థి సంఘం (ఏటీఎస్‌యూఎం) చురచంద్‌పుర్‌లో భారీ ఆందోళనకు పిలుపునివ్వటంతో ఈ గొడవ రగులుకుంది. ఇంతకూ ఈ మైతేయ్‌లు ఎవరు? వారు ఎస్టీ హోదా ఎందుకు కోరుకుంటున్నారు? దాన్ని ఇతర ఆదివాసీ తెగలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

జనాభాలో వీరు… భూమిలో వారు

మణిపుర్‌లో అతిపెద్ద వర్గం మైతేయ్‌లు. రాజధాని ఇంఫాల్‌లోనూ వారిదే ప్రాబల్యం. వీరినే మణిపురీలుగా కూడా పిలుస్తుంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వీరు 65 శాతం దాకా ఉంటారు. కానీ రాష్ట్రంలోని భూమిలో 10శాతం మాత్రమే వీరి చేతుల్లో ఉంది. వీరు కాకుండా నాగాలు, కుకీలు రాష్ట్రంలో బలమైన ఆదివాసీ తెగలు. 90శాతం మణిపుర్‌ భూమి వీరి చేతుల్లోనే ఉంది. మైతేయ్‌ల్లో చాలామటుకు హిందువులు. నాగాలు, కుకీ-జోమీలు క్రిస్టియన్లు. జనాభాలో మెజార్టీ వర్గీయులవటమే కాకుండా… మణిపుర్‌ అసెంబ్లీలో కూడా మైతేయ్‌ వర్గానికే పెద్దపీట. ఎందుకంటే 60 సీట్లున్న మణిపుర్‌ శాసనసభలో 40 సీట్లు వీరు అధికంగా ఉన్న ఇంఫాల్‌ లోయ ప్రాంతంలోనే ఉన్నాయి.

హైకోర్టు తీర్పుతో రాజుకుంది…

ప్రస్తుతం రాష్ట్రంలోని నాగా, కుకీ-జోమీ ఆదివాసీల్లోని 34 తెగలను ఎస్టీలుగా ప్రభుత్వం గుర్తించింది. మైతేయ్‌లు ఇందులో లేరు. కానీ బయటి నుంచి శరణార్థులు, ఇతర రూపాల్లో రాష్ట్రంలోకి భారీగా వస్తున్న వలసల నుంచి రక్షణకుగాను తమకు కూడా ఎస్టీ హోదా కల్పించాలని చాలాకాలంగా వీరు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. దేశంలోని ఎవ్వరైనా వచ్చి తాముంటున్న ఇంఫాల్‌ లోయ ప్రాంతంలో భూమి కొనొచ్చుగాని… తమకు మాత్రం పర్వత ప్రాంతాల్లో భూమి కొనుక్కోవటానికి వీలులేకుండా పోయిందన్నది మైతేయ్‌ల సంఘం వాదన. ఇలా చేయటం వల్ల కొన్ని సంవత్సరాల్లో తమ భూమిలోనే తాము మైనార్టీలుగా మారతామన్నది ఆందోళన. పైగా 1949లో భారత్‌లో కలవటానికి ముందు మైతేయ్‌లను ఆదివాసీ తెగగానే గుర్తించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆ హోదాను పునరుద్ధరించాలంటూ మైతేయ్‌ సంఘం మణిపుర్‌ హైకోర్టులో కేసు వేసింది. కేవలం రిజర్వేషన్ల కోసం కాకుండా… సంస్కృతిని, భాషను, భూమిని, తమ సంప్రదాయాలను కాపాడుకోవటం కోసం ఆదివాసీలుగా గుర్తింపును కోరుతున్నామని మైతేయ్‌ సంఘం వాదించింది. మణిపుర్‌ హైకోర్టు ఈ వాదనలతో ఏకీభవించింది. మైతేయ్‌ల డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎస్టీ హోదా ఇచ్చి, కేంద్ర ప్రభుత్వానికి ఆ సిఫార్సు పంపించాలని గత ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఇద్దరూ వ్యతిరేకంగా..

దీన్ని ఇతర ఆదివాసీలు ముఖ్యంగా కుకీలు, నాగాలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో మెజార్టీ వర్గంగా ఇప్పటికే మైతేయ్‌లదే రాజకీయంగా పైచేయిగా ఉందని వారు గుర్తుచేస్తున్నారు. పైగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో మణిపుర్‌ భాషను కూడా చేర్చారని, హిందువుల్లోని ఎస్సీ, ఓబీసీ హోదాలకున్న ప్రయోజనాలను మైతేయ్‌లు ఇప్పటికే అనుభవిస్తున్నారని, కాబట్టి వారికి ఎస్టీ హోదా ఇవ్వటం సరికాదని తమ నిరసన తెలుపుతున్నారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ… ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందోళనకు పిలుపు ఇవ్వటం… అది హింసాత్మకంగా మారటంతో… ఆందోళన మంటలు రాష్ట్రంలో రాజుకున్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో 150 మంది దాకా మరణించారు. 60వేల మంది నిరాశ్రయులయ్యారు. అనేక చర్చిలు, దేవాలయాలు బూడిదయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చి ఇరువర్గాలతో చర్చలు జరిపాక పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లు కన్పించినా… మళ్లీ నిప్పురాజుకుంది. తాజాగా మహిళలపై లైంగిక దాడులతో కొత్త మలుపు తిరుగుతోంది.

అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009

Related posts

రైలులో హోంగార్డును చంపేసిన ఒక పిచ్చోడు

Satyam NEWS

అట్టల ఫ్యాక్టరీ లో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS

పల్లెల సమగ్ర అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

Bhavani

Leave a Comment