రోడ్డు ప్రమాదంలో తల్లీ తండ్రి చనిపోయి ఇద్దరు పసిపిల్లలు బతికిన దారుణమైన సంఘటన నేడు జరిగింది. నిజామాబాద్ జిల్లా సదావనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో గాంధారి ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదం చూసిన వారికి కన్నీరు ఆగలేదు. గాంధారి మండలం పెద్ద పోతాంగల్ గ్రామానికి చెందిన గంగిరెద్దుల సాయిలు, భార్య సావిత్రి 10 నెలల ఇద్దరు కవల పిల్లలతో కలిసి కామారెడ్డి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది.
సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో గాంధారి రహదారిపై ముందు నుండి అతి వేగంగా అజాగ్రత్తగా వచ్చిన డీసీఎం టిఎస్ 07 యుఇ 6465 వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, వీరికి చెందిన 10 నెలల కవల పిల్లలు మాత్రం గాయాలతో బయట పడ్డారు. గాయపడ్డ పిల్లలను 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలో ఘటనను చూసిన వారు పిల్లలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.