37.2 C
Hyderabad
May 2, 2024 13: 19 PM
Slider మహబూబ్ నగర్

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

#sabitaindrareddy

ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రోత్సహిస్తున్నదని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సోమవారం వనపర్తి పట్టణంలో మంత్రులు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బి.సి.సంక్షేమ, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, ఎంపీ పోతుగంటి రాములుతో కలిసి మంత్రి జె.ఎన్.టి.యు. ఇంజనీరింగ్ కళాశాల, పాలమూరు యూనివర్సిటీ పి.జి. కళాశాల, ఐ.టి. ఐ. కళాశాల, బి.సి. రెసిడెన్షియల్ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవాలు, జె.ఎన్.టి.యు. వసతి గృహ నిర్మాణానికి శంకస్థాపనలు నిర్వహించినట్లు, భహిరంగ సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పి, రహదారుల విస్తరణ పనులు శర వేగంగా  జరుగుతున్నవని ఆయన అన్నారు. జిల్లా విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో 1030 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గురుకుల పాఠశాలను జూనియర్, డిగ్రీ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తూ, 16 జిల్లాలలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కోర్స్ ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని ఆయన అన్నారు. మహిళా బీసీ గురుకుల కళాశాలలో ప్రత్యేకంగా వ్యవసాయ విద్యను బోధించడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకుండా, ప్రతి ఒక్కరికీ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని, విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలలో స్థిర పడాలని ఆయన అన్నారు. వివిధ విద్యా సంస్థల ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి, బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా అభివృద్ధిని చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి చొరవతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాలలో వనపర్తిలోనే అభివృద్ధి ముందున్నదని ఆయన అన్నారు. ఎ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శమని ఆయన అన్నారు.

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో దూసుకపోతున్నదని, వనపర్తి ప్రజలు భవిష్యత్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని ఆమె అన్నారు. బీసీ మహిళా డిగ్రీ కళాశాలలో వ్యవసాయ కోర్సు ప్రవేశపెట్టడం అభినందనీయమని ఆమె అన్నారు. అందరి సమన్వయంతో పనిచేయడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతున్న దని ఆమె తెలిపారు. రాష్ట్రంలో 1153 జూనియర్ గురుకుల కళాశాలలు ఉన్నాయని, రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇచ్చి విద్యార్థులను చదివిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆమె వివరించారు. రూ.3500/- కోట్లతో మన ఊరు – మనబడి కార్యక్రమాలు జరుగుతున్నాయని, జే.ఎన్.టి.యు. ఇంజనీరింగ్ కళాశాలకు రూ.784.00 లక్షలు, ఐ.టి. ఐ. కళాశాలకు రూ.600.00 లక్షల తో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. సమాజంలో పోటీ పడాలంటే ఇంగ్లీషు విద్య తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తున్నదనీ ఆమె అన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశంలోనే తొలి బి.సి. మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు హర్షణీయం అని ఆయన అన్నారు. బి.సి. లు చదువు అందుబాటులో లేక కులవృత్తులలో ఉపాధి వెతుక్కున్నారనీ ఆయన అన్నారు. తెలంగాణకు  ముందు ఉన్నవి కేవలం 19 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవని ఆయన తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో తల్లితండ్రులు తమ బిడ్డలను ఉన్నత విద్యకు దూరం చేశారని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 310 బీసీ గురుకులాలు ఏర్పాటు చేశారనీ ఆయన తెలిపారు. భవిష్యత్ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కోర్సులను ఈ డిగ్రీ కళాశాలలలో ప్రవేశపెట్ట టం జరిగిందని ఆయన అన్నారు.

నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ త్వరలో వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల విద్యాసంస్థలు వనపర్తిలో ఏర్పాటు చేయడం శుభపరిణామం అని ఆయన అన్నారు. భవిష్యత్ లో ఇతర ప్రాంతాలకు వనపర్తి జిల్లా ఆదర్శంగా నిలుస్తుందనీ ఆయన తెలిపారు.

అనంతరం నిర్వహించిన బహిరంగసభలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ , ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జిల్లా ఎస్.పి. అపూర్వ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు, రిజిష్ట్రార్ సుధీర్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ వామాన్ గౌడ్ ,వనపర్తి మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా అదనపు కలెక్టర్ లు, జిల్లా అధికారులు, జెడ్. పి.టి.సి.లు, ఎం.పి.పి.లు,cఎం.పి.టి.సి.లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మాది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదు

Satyam NEWS

త్వరలో హీరోయిన్ గా మంత్రి రోజా కుమార్తె అన్షు

Satyam NEWS

జగన్ కు చుక్కలు చూపించేందుకు చంద్రబాబు సిద్ధం

Satyam NEWS

Leave a Comment