ఓటరు జాబితాను వంద శాతం పారదర్శకంగా సిద్ధం చేయాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ తో కలిసి ఇఆర్ఓ, ఏఇఆర్ఓ లతో ఓటరు నమోదు ప్రక్రియ పై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడుతూ, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. 2023 ఓటరు జాబితాను సిద్ధం చేయడానికి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్ ప్రకారం పక్కాగా నిర్వహించాలన్నారు.
క్రొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు మాత్రమే సమయం ఉన్నందున అర్హత ఉన్నవారు ఏ ఒక్కరు మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటరు నమోదు విషయమై ముమ్మర ప్రచారం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించి, చైతన్య పరచాలని ఆమె అన్నారు. ఓటరు జాబితా లో లాజికల్, డేమోగ్రాఫిక్ పొరపాట్లు లేకుండా సవరించాలన్నారు. దరఖాస్తులు రాగానే వెంట వెంటనే పరిష్కరించాలన్నారు.
సమీక్ష లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నట్లు, ఇందులో ఖమ్మం, పాలేరు స్థానాలు జనరల్ కాగా, మధిర, సత్తుపల్లి స్థానాలు ఎస్సి కాగా, వైరా నియోజకవర్గం ఎస్టీ కేటగిరీలో ఉన్నాయన్నారు. 2వ స్పెషల్ సమ్మరి రివిజన్ ప్రక్రియ జరుగుతున్నట్లు, అక్టోబర్ 4న ఎలక్టోరోల్ ఫైనల్ పబ్లికేషన్ చేపడతామన్నారు.
జిల్లాలో 1439 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 64 లొకేషన్ మార్పు, 36 పేరు మార్పులు, 16 క్రొత్త పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించినట్లు, ప్రస్తుతం మొత్తం 1455 పోలింగ్ కేంద్రాలు 822 లోకేషన్లలో ఉన్నట్లు ఆయన తెలిపారు. గత పబ్లికేషన్ నుండి ఈ రివిజన్ వరకు 5850 మరణించిన, 2989 షిఫ్ట్ అయిన, 477 డబుల్ ఎంట్రీ, మొత్తం 9256 తొలగించినట్లు ఆయన అన్నారు. 6 గురి కంటే ఎక్కువ ఉన్న ఇంటి నెంబర్లకు తనిఖీ చేసి, 12428 ఓటర్ల ద్వారా ఫారం-8 తో దిద్దుబాట్లు చేపట్టనైనదన్నారు.
జిల్లా కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇవిఎం డిమానస్ట్రేషన్ కేంద్రాలు, ప్రతి నియోజకవర్గంలో 2 చొప్పున మొబైల్ డిమానస్ట్రేషన్ వాహనాల ద్వారా ఓటరు నమోదు, ఓటింగ్ పై అవగాహన కల్పించి, చైతన్యం కల్గిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటి ద్వారా ప్రజలకు తమ ఓటు ఉన్నది, లేనిది, ఎక్కడ ఉన్నది తెలుసుకోవడం, తద్వారా లేకుంటే వెంటనే నమోదు, మార్పులు చేర్పులకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అన్నారు.
అనంతరం నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఇవిఎం డిమానస్ట్రేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో ఓటర్లకు కల్పిస్తున్న అవగాహన, సదుపాయాల గురించి ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఆడిగి తెలుసుకున్నారు. నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పార్కింగ్ కమ్ సోలార్ పవర్ షెడ్ గురించి కలెక్టర్ ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ కు వివరించారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు బి.
సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవోలు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, తహశీల్దార్లు, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.