40.2 C
Hyderabad
May 2, 2024 18: 42 PM
Slider ముఖ్యంశాలు

రూట్ మ్యాప్: ఇక రాబోతున్నది డిజిటల్ జీవితమే

#DigitalIndia

ఆన్ లైన్ విధానాలనే విస్తృతంగా వాడుకుంటూ డిజిటల్ ప్లాట్ ఫారం లపైనే  ముందుకెళ్లే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసినా, దశలవారీగా ఎత్తేసినా భవిష్యత్తులో మాత్రం సాంకేతికత ఆధారంగానే మనం జీవించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి.

విద్య, వృత్తి, వ్యాపారం, కమ్యూనికేషన్, మీడియా, వైద్యం, సరుకులు, వస్తువుల  కొనుగోళ్లు ఇక నుండి సాంకేతిక వ్యవస్థలోనే, వ్యవస్థ చుట్టూనే  సాగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో తాజాగా నిర్వహించిన సమావేశంలో ఇప్పటికే  ఆ సంకేతాలు ఇచ్చేశారు.

డిజిటల్, ఆన్ లైన్ విద్యావిధానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలి

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ లాక్ డౌన్ నేపథ్యంలో డిజిటల్, ఆన్ లైన్ విద్యావిధానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని చేసిన సూచనలు  ఈ అంశానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో అయన నిర్వహించిన వీడియో సమావేశం సాంకేతిక సద్వినియోగ అవసరాన్ని విశదపరిచింది.

 సాఫ్ట్ వేర్  రంగంలో కార్యకలాపాలకు ఉద్యోగుల ప్రవేశానికి 50 శాతం అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, ఆ దిశగా పనిచేయడానికి ఉద్యోగులు మొగ్గు చూపడంలేదు. 75శాతం తమ  ఉద్యోగులు ఇంటి నుండే సేవలు అందిస్తారని  ఐ టి సి ఇప్పటికే వెల్లడించింది.

కరోనా పూర్తిగా నెమ్మదించడానికి, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి తేలికగా 12 నుండి 18నెలలు పడుతుంది. అప్పటిదాకా వ్యవస్థలు ఆపుకొని ఎవ్వరూ ఇంట్లో కూర్చోలేరు. ఈ 40రోజుల నిర్బంధమే 400రోజుల నిర్బంధంగా అందరూ భావిస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఆలోచనలు ప్రస్తుత వధానం

తమ కార్యకలాపాలు, జీవనవిధానాలు వేగవంతం చెయ్యడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలూ ఒకే పడవలో నడుస్తున్నారు. ఐటీ కంపెనీల్లో ఇంటి నుండే పని మరింత జోరందుకుంటుంది.

భారతదేశంలో సుమారు 40లక్షల మంది ఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. ఖర్చులు తగ్గించుకోడానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే, చిన్న, మధ్య తరగతి కంపెనీలు కార్యాలయాలు తగ్గించుకొనే ప్రయత్నాలు  చేస్తాయి. కొత్తగా ప్రారంభించినవారు, భవిష్యత్తులో ఈ సేవలు అందించాలనుకునేవారు కార్యాలయాలు పరిమితంగా ఉంచుకొని, వర్క్ ఫ్రం హోమ్ విధానంలో సాగుతారు.

కార్ ల బుకింగ్ ఆల్ లైన్ లోనే ఇక నుంచి

డీలర్ దగ్గరకు వెళ్లకుండా కార్ ను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. ” హోండా ఫ్రం హోమ్ ” కింద నచ్చిన కారును, నచ్చిన డీలర్ ను ఎంపికచేసుకొని కార్ బుక్ చేసుకోవచ్చు. ఎక్కడి నుండైనా  24 గంటలపాటూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తాజాగా చేసిన ప్రకటన… ఆన్ లైన్ విధానం ఎంత వేగవంతం అవ్వబోతోందో అద్దం పడుతోంది.

ఫోక్స్ వ్యాగన్, బి ఎం డబ్ల్యూ, మెర్స్ డెస్ బెంజ్ మొదలైన కంపెనీలు కూడా ఈ విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు  మొన్న సోమవారమే వెల్లడించాయి. లాక్ డౌన్ అనంతరం రెస్టారెంట్లు కూడా చేతుల వాడకాన్ని తగ్గించడానికి, భౌతికసామీప్యం  తగ్గించడానికి కొత్త పద్ధతులు వెతుక్కొంటున్నాయి.

ఇక్కడ కూడా సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికలు జరుగుతున్నాయి. పే టి ఎం దీనికి శ్రీకారం చుట్టింది. రెస్టారెంట్లలో ఒక క్యూ ఆర్ కోడ్ ను ప్రదర్శనలో ఉంచుతారు. మొబైల్ లోని పే టి ఎం యాప్ తో స్కాన్ చెయ్యగానే… వినియోగదార్లకు మెను కనిపిస్తుంది.

హోటళ్ల వ్యవస్థ మారిపోతున్నది

ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం, బిల్లు కట్టడం దాని ద్వారా వెంటనే అక్కడికక్కడే చెయ్యవచ్చు. దీని వల్ల మెను కార్డును చేతితో పట్టుకొనవసరం లేదు. సర్వర్లతో ఎక్కువ సార్లు, ఎక్కువ సమయం గడపక్కర్లేదు. ఇదీ, పే టి ఎం చెబుతున్న సరికొత్త విధానం. జొమాటో సైతం ఇదే ఎంచుకుంటోంది.

థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితి కూడా ఇప్పుడప్పుడే రాదు. సినిమారంగానికి ప్రస్తుతం ఉన్న  ప్రత్యామ్నాయమార్గాలలో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ఒకటి. పెద్ద సినిమాలు ఈ వేదికను ప్రస్తుతానికి ఉపయోగించుకోక పోయినా, చిన్న, మధ్య స్థాయి సినిమాలు ఈ వేదికపైన ఇక నుండి ఆధారపడతాయి.

సినీ పరిశ్రమ ఇక వేరే విధంగా ఉంటుంది

అటు సినిమాలతోపాటు, ఇటు వినోద రంగాలకు ఓ టీ టీ ప్రత్యామ్నాయ ప్రధాన వేదిక అవుతుంది. ఓ టీ టీ అంటే, ఓవర్ టాప్ మీడియా సర్వీస్. కేబుల్, బ్రాడ్ కాస్ట్, శాటిలైట్ వ్యవస్థలతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ద్వారా ప్రేక్షకులకు నేరుగా వినోదాన్ని పంచే సాంకేతిక విప్లవం ఈ ఓ టి టి వేదిక.

ప్రేక్షకుడి డిమాండ్ మేరకు దృశ్యాలను అందించడమే ఇక్కడ దొరికే సేవలు. డిజిటల్ మీడియా ప్లేయర్స్ లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. విద్యారంగానికి వస్తే, ఇప్పటికే ఆన్ లైన్ లో కొన్ని కోర్సులకు  ప్రవేశం, బోధన, పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.

మారుతున్న భారత విద్యా విధానం

ఇక నుండి సాధ్యమైనంత వరకూ ఎక్కువ కోర్సులు ఈ విధానాన్నే ఎంపికచేసుకుంటాయి. భారతీయ విద్యా విధానంలో,  సాంకేతికత మరింత ఉరకలు వేస్తుంది. వైద్య రంగంలోనూ ఇది పెరుగునుంది. ఇప్పటికే డాక్టర్లు పేషంట్ తాలూకూ సర్వ వివరాలు కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తున్నారు.

ప్రిస్క్రిప్షన్, మందులు వాడుకోవాల్సిన విధానం ప్రోగ్రామింగ్ చేసి, రోగులకు మొబైల్ ద్వారా తెలియజేసే విధానం ఎప్పుడో అమలులోకి వచ్చింది. ఇది ఇంకా ఊపందుకుంటుంది. మందులు, సరుకులు ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేసుకొని, తెప్పించుకునే సేవలు చాలామంది వినియోగించుకుంటున్నారు.

ఈ పరిధి మరింత పెరుగుతుంది. పేపర్ లెస్ ఆఫీస్  అనే మాట ఒకప్పుడు చాలా కొత్తమాట. ప్రపంచంలో కంప్యూటరీకరణ పెరిగిన నేపథ్యంలో ఆన్ లైన్, డిజిటల్ రంగం రాజ్యమేలుతోంది. అది, మీడియాలోకీ ప్రవేశించింది. కరోనా ప్రభావంతో, లాక్ డౌన్ పరిస్థితుల్లో వార్తాపత్రికలు తెప్పించుకోవడం కాస్త  తగ్గుముఖం పట్టింది.

ఆన్ లైన్ పత్రికలే ఇక శరణ్యం

కొంతమంది ఆన్ లైన్ లోనే అన్ని వార్తా పత్రికలు చదువుకుంటున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఏదైనా ఆసక్తికరమైన వార్త పెట్టినా, దృశ్యం పెట్టినా ప్రేక్షకులు క్షణాల్లో లక్షల మంది కనెక్ట్ అవుతున్నారు. కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొచ్చాయి.

సంప్రదాయమైన ప్రింట్ మీడియా, శాటిలైట్ ఛానల్స్ నిర్వహించే సంస్థలు కూడా సమాంతరంగా డిజిటల్ మీడియాకు పెద్దపీట వేసి నడిపిస్తున్నాయి. ఈ ధోరణి ఇంకా పెరుగుతుంది. విద్య, వైద్యం, సేవలు, వినోదం, మీడియా, వ్యాపారం…. ఇలా ఆన్నీ  విస్తృతంగా  సాంకేతికమయమయ్యే  పరిణామాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.

కరోనా ప్రభావంతో  ఆన్ లైన్, డిజిటల్  రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వస్తాయి. ఇక అంతా సాంకేతికమయమే అవుతుందన్నది తథ్యం సుమతీ.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

భయంతో ఎమ్మెల్యేలు

Murali Krishna

ప్రధాని మోడీ పర్యటన లో మా ర్పు….!

Satyam NEWS

పంచాయతీ కార్మికులకు 11వ పీఆర్సీ అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment