ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీయస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నేడు కుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ సమాజంలో దళిత బలహీన వర్గాల మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఎలాంటి రక్షణ లేకుండా బయట పనులు చేసుకోవడానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉండే దళిత మహిళలపై దాడులు పెరిగిపోవడం సమాజానికి మంచిది కాదని ఆయన అన్నారు.
ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, ఇప్పటికే జరిగిన సంఘటనలలోని దోషులను వెంటనే శిక్షించాలని సమావేశం డిమాండ్ చేసింది. అందులో భాగంగా రేపు డీజీపీని, ఎల్లుండి మానవ హక్కుల కమిషనర్ ను తర్వాత రోజు గవర్నర్ ని కలిసి రెండు నెలలు లో నేరస్తులకు శిక్షలు విధించే లా చర్యలు తీసుకోవాలని కోరాలని నిర్ణయించారు.
ఈ నెల 20వ తేదీన ఇందిరాపార్క్ దగ్గర మహా దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత దండు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూర బాలరాజు బుడగ జంగాల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు సిరిగిరి మన్యం వివిధ కుల సంఘాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.