అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, తాలిబన్లు అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. తాలిబన్ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్‌జాదా మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. నిజానికి ఆయన నాయకత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకున్నారు.
యూఎస్‌తో శాంతి చర్చల్లో కీలకపాత్ర పోషించిన బరాదర్ ప్రధాని అవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పెద్దగా గుర్తింపులేని ముల్లా హసన్‌ను ప్రధానిగా ప్రకటించారు. దీంతో అసలు తాలిబన్ నేతలకు ఏమైందన్న ప్రశ్నలు ఉదయించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ద స్పెక్టేటర్ అనే పాశ్చాత్య మీడియాలో వెలువడిన కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. బరాదర్‌ను బందీ చేసి ఉంటారని, అఖుండ్‌జాదా చనిపోయి ఉంటారని ఈ కథనం పేర్కొంది. గతంలో గార్డియన్ సైతం ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాబూల్ అధ్యక్ష భవనంలో హక్కానీలకు, తాలిబన్లకు మధ్య గొడవ జరిగిందని, ఈ గొడవలో బరాదర్ తీవ్రంగా గాయపడ్డాడని కథనాలు వచ్చాయి. కానీ తాను బాగానే ఉన్నానంటూ బరాదర్ ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. అనంతరం కొందరితో కలిసి ఒక వీడియోను విడుదల చేశారు.
అయితే ఈ వీడియో చూస్తే అందులో బరాదర్‌ను బందీగా ఉంచినట్లు కనిపిస్తోందని మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి. అదేవిధంగా తాలిబన్ అగ్రనేత అఖుండ్‌జాదాను హతమార్చిఉండొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. లేకుంటే వీరిద్దరూ బయటి ప్రపంచానికి కనిపించేవారని, హక్కానీ నెట్‌వర్క్ వీరిని మాయం చేసిందని చాలామంది భావిస్తున్నట్లు స్పెక్టేటర్ కథనం పేర్కొంది.