28.7 C
Hyderabad
May 5, 2024 09: 28 AM
Slider సంపాదకీయం

తెలంగాణలో బీజేపీ అసలు ప్లాన్ ఏమిటి?

#kishanreddy

తెలంగాణ లో బీజేపీ ఆడుతున్న గేమ్ ఎవరికి అర్ధం కావడం లేదు. తెలంగాణలో బీజేపీ సొంతంగా గెలువాలనుకుంటున్నదా? లేక కేసీఆర్ కు సాయం చేయాలనుకుంటున్నదా అనేది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ లో బీజేపీ ఒక దశలో తెలుగుదేశం పార్టీతో సఖ్యత కోసం ప్రయత్నించింది. అయితే అది ఏ కారణం వల్లనో కుదరలేదు. అప్పటిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ ఈ మేరకు పలు దఫాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సందేశాలు కూడా పంపారు. అప్పటిలో తెలంగాణలో బీజేపీ ఉవ్వెత్తున లేచింది. బీజేపీ అధికారంలోకి వస్తుందా…. అన్నంత బాగా ఆ పార్టీ నిర్మాణం జరిగింది.

అయితే ఆ తర్వాతి కాలంలో పార్టీ అధ్యక్షుడిని మార్చుకుని బీజేపీ ఘోరమైన తప్పిదం చేసింది. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా బీజేపీ.. కేసీఆర్ కు సాయపడే నిర్ణయాలే తీసుకుంటున్నది. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే చీలే ఓట్లతో కేసీఆర్ కు దెబ్బ తగులుతుంది. అందుకోసం అనూహ్యంగా ఆ ప్రస్తావన రాకుండా చూసుకున్నది.

ఇదే సందర్భంలో జనసేన పార్టీ తాను 32 స్థానాలలో ప్రకటిస్తున్నట్లు ప్రకటించేసింది. దాంతో ఈ ఉత్పాతాన్ని ఎలా ఆపాలా అని బీజేపీ ప్లాన్ బి సిద్ధం చేసుకున్నది. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. 22 నుంచి 30 సీట్లు జనసేన కోరింది. అయితే ఆ సంఖ్యను 6 నుంచి 10కి తగ్గించారు. ఇప్పుడు మరో కొత్త ప్లాన్ నడుస్తున్నది.

తెలంగాణలో జనసేన పార్టీ పోటీ వద్దని బీజేపీకి స్వచ్చంద మద్దతు ప్రకటించాలని .. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై బీజేపీ తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్ ఢిల్లీలో అమిత్ షాతో అరగంటకుపైగా సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో అమిత్ షా పరోక్షంగా… జనసేన పార్టీ మద్దతు గురించి మాట్లాడారు కానీ.. కలిసి పోటీ చేయడం గురించి మాట్లాడలేదని చెబుతున్నారు. జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు.. అనే అంశంపై అమిత్ షా అసలు మాట్లాడలేదని చెబుతున్నారు. కిషన్ రెడ్డి కూడా ఏ సీట్లిస్తారన్న అన్న విషయం చెప్పడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఒత్తిడి చేయించడం ద్వారా గ్రేటర్ ఎన్నికల్లోలా పవన్ కల్యాణ్ పోటీ చేయకుండా ప్రచారం చేయించుకునే ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

అయితే పవన్ కల్యాణ్.. బీజేపీకి ఈ విషయంలో ఎలాంటి చాయిస్ ఇవ్వకూడదన్న లక్ష్యంతో ఉన్నారు. పోటీ చేయకూడదన్న మాటే్ రాదని.. పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. అందుకే.. కనీసం ఇరవై స్థానాల్లో అయినా అభ్యర్థులను నిలబెడతామని.. పొత్తు కావాలంటే స్థానాలు కేటాయించాల్సిందేనని సంకేతాలు పంపుతున్నారు. దీనిపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది.

బీజేపీ ఉనికి లేని ఖమ్మం, నల్లగొండ వంటి చోట్ల సీట్లిచ్చేందుకు సిద్ధమవుతున్నా.. జనసేన మాత్రం.. తాము పోటీ చేస్తామని ప్రకటించిన 32 నియోజకవర్గాల నుంచే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ రెండో జాబితా ఒకటో తేదీ తర్వాతే రానుంది. అప్పటికి కొత్తగా ఎవరైనా వస్తే చేర్చుకుంటారు. జనసేనకు సీట్లివ్వాలా లేదా అన్నది అప్పుడు డిసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం బీజేపీ టార్గెట్.. జనసేనపై ఒత్తిడి చేసి అయినా పోటీ నుంచి తప్పించడమే.

Related posts

ఆన్ లైన్ క్లాసుల పేరుతో వేధిస్తున్న కార్పొరేట్ కాలేజీలు

Satyam NEWS

ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

Satyam NEWS

గృహ రుణాల మంజూరిలో రూ.5 ట్రిలియన్ మార్క్ దాటిన SBI

Satyam NEWS

Leave a Comment