సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికరమైన విమర్శలు చేశారు. తనపై ఉన్న అవినీతి కేసులపై మాట్లాడేందుకే ఢిల్లీకి వెళ్లారని, అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు.
ఢిల్లీలో జగన్‌కు ఇది రెండో పరాభవమన్నారు. సిఎం ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్లినా తన సొంత కేసులు, డిశ్చార్జ్ పిటిషన్లు, కోర్టు హాజరీ మినహాయింపుల గురించే అడుగుతున్నారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఫెమా, మనీ లాండరింగ్‌పై సీబీఐ, ఈడి కేసులలో మెడలోతు జగన్ కూరుకుపోయారన్నారు.
శిక్షపడే సమయం దగ్గర పడిందని..ట్రయల్స్ వేగవంతం కావడంతో జగన్‌కు భయం పట్టుకుందని యనమల అన్నారు. సీఎం జగన్ ప్రతి శుక్రవారం ఏదో ఒక పర్యటన పెట్టుకునేది కోర్టు వాయిదా ఎగ్గొట్టేందుకేనని యనమల విమర్శించారు. మూడు శుక్రవారాలు ఏదో ఒక వంకతో కోర్టు హాజరుకు డుమ్మా కొట్టారన్నారు.