త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు ఎన్. చంద్రబాబునాయుడు నాయకులతో సమీక్ష నిర్వహించారు. జగన్ ఆరు నెలల పాలనలో సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ఉల్లి ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం అయిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు.
బీసీలను సీఎం జగన్ మోసం చేశారని, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని ఇలాంటి అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు. బిల్డ్ ఏపీ కాదు సేల్ ఏపీగా మారుస్తున్నారని, మీడియాపై ఆంక్షల విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళారులే స్వైర విహారం చేస్తున్నారన్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. టీడీపీ సింగపూర్ తరహా నిర్మాణాలు చేపడితే, వైసీపీ స్మశాన వాటికలపై దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ జగన్మాయలు..పథకాల ప్రకటనలే తప్ప అమలు చేయడంలేదని విమర్శించారు.
వీటన్నింటి గురించి రానున్న కౌన్సిల్ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. 6నెలల వైసీపీ వైఫల్యాలను సభలో ఎండగడతామని యనమల స్పష్టం చేశారు. ఈ నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.