38.2 C
Hyderabad
May 5, 2024 21: 50 PM
Slider ప్రత్యేకం

రాజ్యసభ ఎంపికల్లో బిజెపి మతలబు ఏమిటి?

#ilayaraja

రాజ్యసభకు దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ప్రముఖులను కేంద్రం ఎంపికచేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో విభిన్న చర్చలకు దారితీసింది. దక్షిణాది రాష్ట్రాలలో పట్టు పెంచుకొని కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పన్నిన వ్యూహంగా ఒక వర్గం మీడియా భాష్యం చెబుతోంది.

కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు  ఎగువ సభలో ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలలో  ఇతోధిక బలం పెంచుకున్న బీజేపీ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చాకచక్యంగా వినియోగించుకుంటోంది. అందులో భాగంగానే కేరళనుంచి ప్రముఖ అథ్లెట్ పీటీ ఉష, తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, కర్ణాటక నుంచి సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్ర ప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత,దర్శకుడు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ ను రాష్ట్రపతి కోటాలో పార్లమెంట్  ఎగువసభకు నామినేట్ చేసింది.

అయితే…ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంది. కేవలం ఎంపికచేసిన రాష్ట్రాలకు చెందిన ముఖులను రాజ్యసభకు నామినేట్ చేస్తేనే  ఆయా రాష్ట్రాలలో బిజెపి బలం గణనీయంగా పెరగడానికి దోహదపడుతుందని ఆశించడం దురాశ కాగలదు. ఉదాహరణకు గతంలో  ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను రాజ్యసభకు ఎంపిక చేసినందువల్ల మహారాష్ట్రలో ఏమైనా రాజకీయ లబ్ది లభించిందా అంటే ఏమీ లేదనే చెప్పాలి.

హిందూత్వానికి మద్దతు తెలిపినందుకేనా ఎంపిక?

కానీ…ఈ నలుగురు ప్రముఖుల  ఎంపిక వెనుక ఉన్న ప్రత్యేకత పట్ల భాజపాకి పూర్తి స్పష్టత ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదేమిటంటే..హిందుత్వ భావనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతా భావంతో ఇళయ రాజా, విజయేంద్ర ప్రసాద్ లకు ఎగువసభకు నామినేట్ చేసినట్లు తటస్థ మీడియాలో వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ భావాలకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మద్దతు ఇస్తూ, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఇళయరాజా ఇటీవల ఒక పుస్తకానికి రాసిన ముందు మాటకు విపరీతమైన ప్రచారం వచ్చింది. సినీ సంగీత సామ్రాజ్యంలో రారాజుగా వెలుగుతున్న ఇళయరాజా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించడంతో ఆయనను రాజ్యసభ పదవి వరించిందని రాజకీయ,సీనీ వర్గాలలో వినిపిస్తోంది.  

ఇప్పటికే భారత ప్రభుత్వం  ఇళయరాజాను పద్మ భూషణ్ (2010), పద్మ విభూషణ్ (2018) పురస్కారాలతో సత్కరించడం విశేషం. ప్రస్తుతం ఆయనను రాజ్యసభ పదవికి ఎంపికచేయడం అంతకు మించిన గౌరవం. అలాగే…సీనీ రంగానికే  చెందిన కే.వి. విజయేంద్ర ప్రసాద్ ఎంపికకు ప్రధాన కారణం…ఆయన తన సినిమా కథలలో అంతర్లీనంగా, బలంగా చూపిస్తున్న హిందుత్వ భావజాలం అని విమర్శకులు అంటున్నారు.

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ సినిమా’ బజరంగీ భాయీ జాన్ లో హిందుత్వం గురించి గొప్పగా చెప్పడం విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. అదే విధంగా.. ఆయన కుమారుడు , ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సీక్వెల్స్, ఆర్ ఆర్ ఆర్ సినిమాలకు అందించిన కథలలో కూడా హిందుత్వ ఆత్మ బలంగా ఆవిష్కృతం అయినట్లు సీనీ పండితుల అభిప్రాయం. ఇదొక్కటే  విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు ఎంపిక చేయడానికి ఉన్న ఏకైక కారణం అని పరిశ్రమ వర్గాలలో సైతం వినిపిస్తోంది.

ఇక…ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పయ్యోలి తెవర పరంపిల్ ఉష ( పీటీ. ఉష) సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984 లో ‘ అర్జున అవార్డు’ తో పాటు ‘ పద్మశ్రీ ‘ పురస్కారాన్ని అందజేసింది. నాలుగో ప్రముఖ వ్యక్తిగా రాజ్యసభకు వెళ్ళనున్న డాక్టర్ వీరేంద్ర హెగ్గడే ను కూడా 2015 లో కేంద్ర ప్రభుత్వం ‘ పద్మ విభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. వీరేంద్ర హెగ్గడే, పీటీ.ఉషల ఎంపికలో రాజకీయకోణం ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు.

రాజ్యసభకు ఎంపికైన వారు తమ వాణిని అవసరమైన సందర్భాలలో అత్యున్నత వేదికగా వినిపిస్తారని ఆశిద్దాం. మొత్తమ్మీద దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ప్రముఖులను ఎగువ సభకు పంపినంత మాత్రాన బీజేపీకి కొత్తగా వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు అని విమర్శకులు వ్యాఖ్యానించడం అర్థవంతమే.

రాజకీయ పార్టీలు ఏ కార్యాచరణకు పూనుకోన్నా..అంతిమంగా  ప్రయోజనం ఆశించే అనేది అనేక సార్లు రుజువైంది. బీజేపీ కూడా అందుకు మినహాయింపు కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు

Related posts

పారిశుద్ధ్య కార్మికులకు డెటాల్ సబ్బుల పంపిణీ

Satyam NEWS

మౌళిక సదుపాయాల అభివృద్ధికి  సి‌ఎస్‌ఆర్ నిధులు

Murali Krishna

భాగ్య‌న‌గ‌రంలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి

Sub Editor

Leave a Comment