28.7 C
Hyderabad
May 6, 2024 02: 38 AM
Slider ప్రత్యేకం

ఎమ్మెల్యే గంటా రాజీనామా వెనుక వ్యూహం ఏమిటి?

#GantaSrinivasarao

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేది సామెత. అయితే విశాఖపట్నం (ఉత్తరం) ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాతో రెండు మూడు పిట్టలు ఒకే సారి కొట్టాలనే వ్యూహం ఉన్నదనేది రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ.

తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉండటమే కాకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు విఫలయత్నం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకించడం, మంత్రి అవంతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి పూర్తి మద్దతు ఉండటంతో గంటా శ్రీనివాసరావు రంగ ప్రవేశం కుదరలేదు.

ఆ నాటి నుంచి గంటా రాజకీయాలకు దూరమైపోయారు. ఇప్పుడు అకస్మాత్తుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఆయనకు కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఉండలేకపోవడం, వైసీపీలో చేరలేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న గంటా విశాఖ స్టీల్ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడానికి ప్లాన్ వేసుకున్నారు.

తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా చేసేశారు. అయితే రాజీనామా స్పీకర్ ఫార్మేట్ లో లేదని తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని నిన్న స్పీకర్ ఫార్మేట్ లోకి మార్చి పంపారు.

పదవికి రాజీనామా చేసేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అనుమతి తీసుకున్నారా? తీసుకోలేదు. మరి ఎవరి కోసం రాజీనామా చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశం. వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ కు, విజయసాయిరెడ్డి కి చెక్ పెట్టాలంటే ఏం చేయాలని ఆలోచించిన గంటా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని అంటున్నారు.

తన రాజీనామాతో ఖాళీ అయ్యే అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీకి పూర్తి మద్దతు ఇచ్చేందుకు ఆయన వై ఎస్ జగన్ తో ఒప్పందానికి వచ్చారని అంటున్నారు. దీనివల్ల వైసీపీకి ఒక స్థానం పెరగడం, తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం తగ్గడం జరుగుతుంది.

ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా తీరని దెబ్బ. మంత్రి అవంతి, విజయసాయిరెడ్డిల కన్నా ఎక్కువ మార్కులు జగన్ వద్ద సంపాదించుకోవచ్చు. తద్వారా అధికారికంగా వైసీపీలో చేరి రాబోయే ద్వైవార్షిక ఎన్నికలలో రాజ్యసభకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు.

విశాఖ స్టీల్ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తిగా రికార్డుల్లో చిరస్థాయిగా ఉండిపోవచ్చు. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ తీయడం వరకూ జగన్ కు ఆనందం కలిగించేదే కాబట్టి ఆయన కూడా గంటాను రాజ్యసభకు పంపేందుకు సుముఖంగానే ఉన్నారని తెలిసింది.  

Related posts

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా టీచర్లను సత్కరించిన మంత్రి రోజా

Satyam NEWS

రాజకీయ పార్టీ దిశగా ‘జగనన్న వదిలిన బాణం’

Satyam NEWS

ప్రజల సమస్యల పరిష్కారమే టీడీపీ లక్ష్యం

Bhavani

Leave a Comment