39.2 C
Hyderabad
May 3, 2024 11: 52 AM
Slider సంపాదకీయం

లాజిక్కులు మరచిపోతున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ

cbn 11

ఓటుకు నోటు కేసులో రెండు తెలుగు రాష్ట్రాలలో సిగ్గు పోయినా చంద్రబాబునాయుడికి మాత్రం బుద్ధి మారలేదు. బలం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని మళ్లీ రంగంలోకి దించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ కు ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలలో అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే లేదు. తెలుగుదేశం పార్టీకి కేవలం 23 మంది శాసనసభ్యులు గెలవగా అందులో ముగ్గురు ఇప్పటికే చేజారిపోయి వైసిపి పంచన చేరారు. అంటే తెలుగుదేశం పార్టీకి మిగిలింది 20 మంది ఎమ్మెల్యేలు. ఈ 20 మంది ఎమ్మెల్యేలలో కూడా దాదాపు సగం మంది జగన్ అనుమతిస్తే తెలుగుదేశం పార్టీని వీడిపోయి వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్ధిని రంగంలో దించుతున్నారు. చంద్రబాబునాయుడు బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్ధిని రంగంలో దించడం 2015లో తెలంగాణ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భాన్ని గుర్తు చేస్తున్నది.

ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం లేకపోయినా ఆనాడు అభ్యర్ధిని నిలబెట్టిన చంద్రబాబునాయుడు అండ్ కంపెనీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.  2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు జరిగిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్టీఫెన్‌సన్‌ మద్దతును అప్పటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రూ. 50 లక్షలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు.

ఈ మొత్తాన్ని స్టీఫెన్ సన్ వీడియో రికార్డింగ్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో స్టీఫెన్ సన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఫోన్ లో మాట్లాడిన మాటల ఆడియో బయటకు వచ్చింది. లంచం ఇవ్వబోతున్న రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆడియో టేప్ బయటకు రావడంతో ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని ఏసీబీ అభియోగం మోపింది. న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో చంద్రబాబు పేరును ప్రస్తావించింది.

ఈ కేసు అప్పట్లో రాజకీయంగా సంచలనమైంది. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లుగా చంద్రబాబునాయుడు హైదరాబాద్ ను వదిలి అమరావతికి మకాం మార్చారు. ఇవన్నీ మరువక ముందే ఇప్పుడు బలం లేకపోయినా రాజ్యసభ సీటకు పోటీ పడుతూ ఆనాటి ఓటుకు నోటు కేసును చంద్రబాబునాయుడు మళ్లీ గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు రాజ్యసభకు ఓటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు వైసిపి వారిని ప్రలోభ పెట్టినా లేక మరో పది మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా ఈ రెండింటిలో ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కి అదే ఆఖరి రోజు అవుతుంది.

రాజకీయంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఇలాంటి తప్పులు చేస్తుండటం వల్లే తెలుగుదేశం పార్టీకి అధికారం కోల్పోయి 9 నెలలు అయినా ప్రజల్లో సానుభూతి రాలేదు. పాలనా పరంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఎన్ని తప్పులు చేస్తున్నా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం లేదు.

Related posts

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంయుక్త కథనం క్షీరసాగర మథనం

Satyam NEWS

మున్సిపల్ సిబ్బంది పోషిస్తున్న పాత్ర కీలకమైంది

Satyam NEWS

వీడిన సస్పెన్స్:అమ్మాయి వెన్నెముకలో బుల్లెట్

Satyam NEWS

Leave a Comment