42.2 C
Hyderabad
April 26, 2024 18: 10 PM
Slider సంపాదకీయం

శాల్యూట్: పోలీసింగ్ కు కొత్త అర్ధం చెప్పిన కరోనా

Hyderabad Police

దేశవ్యాప్తంగా కరోనా సమయంలో విశేష సేవలు అందిస్తున్న వారిలో పోలీసులు ప్రధమ స్థానంలో ఉంటారు. ఆరోగ్య సమయంలో ప్రధమ ప్రాధాన్యత వైద్యులకు దక్కాలి. కానీ కరోనా సమయంలో పోలీసులు లేకపోతే వైద్యులు ఏం చేయలేని పరిస్థితి ఉంది.

అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ లో లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరుపై ప్రశంసల జల్లు కురిపించింది. 130 కోట్ల మంది జనాభాతో కిటకిటలాడే నగరాలతో, విశాలమైన సరిహద్దులతో ఉన్న మన దేశంలో లాక్ డౌన్ ఎలా అమలు అవుతున్నదో ప్రపంచంలోని చాలా దేశాలకు అర్ధం కావడం లేదు.

లాక్ డౌన్ సందర్భంగా దేశంలోని చాలా తక్కువ చోట్ల మాత్రమే పోలీసులపై ఫిర్యాదులు వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో కొడుతున్నారని వస్తున్న వార్తలు తప్ప మరే పెద్ద సమస్యలు పోలీసుల కారణంగా తలెత్తలేదు. దేశంలోని చాలా జిల్లాల్లో యువ ఐపిఎస్ లు తమ శక్తి యుక్తులను ఉపయోగించడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

సీనియర్ ఐపిఎస్ అధికారులు సలహాలకు పరిమితం కాగా వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న యువ ఐపిఎస్ లు వినూత్న విధానాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ బాట నడుస్తున్నారు. ఐపిఎస్ లు నిర్ణయాలు తీసుకునే కీలక ప్రదేశాలలో ఉండటం లేదు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం వారిదే పైచేయిగా ఉంటున్నది.

కేవలం శాంతి భద్రతలు కాపాడటమనే డ్యూటీకి భిన్నంగా ఇప్పుడు పోలీసులు ప్రజల ఆరోగ్య పరిరక్షకులుగా మారారు. కరోనా కాలంలో జరిగిన ఈ కీలకమైన మార్పు రాబోయే రోజుల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు గట్టి పునాది ఏర్పాటు చేసిందని ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి తెలిపారు. అంతే కాదు.

సమాజం వేరు తాము వేరు అని అనుకునే పాత కాలపు పోలీసుల ఆలోచనా ధోరణి కూడా కరోనా డ్యూటీ మార్చిందని ఆయన అన్నారు. కరోనా సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలలోని పోలీసులు మరీ ముఖ్యంగా ఐపిఎస్ అధికారులు వినూత్న రీతిలో కరోనా వైరస్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ గమనించి ప్రశంసించింది.

కేరళలోని విజయ్ సాక్రే అనే ఐపిఎస్ అధికారి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చిన పేషంట్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం వారిని డాక్టర్లతో టెలీమెడిసిన్ ద్వారా మందులు ఇప్పించడం చేశారు. ముంబయి పోలీస్ కమిషనర్ పరంవీర్ సింగ్ అయితే ఏకంగా 461 షెల్టర్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

కరోనా పేషంట్ల తో ఆయన రెగ్యులర్ గా టెలికాన్ఫరెన్సు లో మాట్లాడుతుంటారు. చెన్నై పోలీసులు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ లతో కొత్త ప్రయోగం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు సైబర్ పోలీసులు కొత్త అంశంపై దృష్టి కేంద్రీకరించారు. అదేమిటంటే కరోనా సహాయ నిధి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై నిఘా పెట్టారు.

ఆన్ లైన్ లో డొనేషన్లు అడుగుతున్న వారిని ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు చేశారు. కరోనాపై దేశంలో జరుగుతున్న పోరాటం కారణంగా దేశంలోని పోలీసులకు కూడా సామాజిక స్పృహ బాగాపెరిగింది. తాము తలచుకుంటే సమాజానికి ఏమి చేయగలమో పోలీసులకు తమ శక్తి తమకు తెలిసింది.

కరోనా తర్వాత దేశంలో పోలీసు వ్యవస్థ తనంతట తానుగా మారి మరింతగా ప్రజలతో స్నేహపూర్వకంగా మసలుతుంది. అందులో సందేహం లేదు.

Related posts

పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

వెలుగు పువ్వులు

Satyam NEWS

విజయనగరం రైల్వే స్టేషన్ అడ్డాగా మైనర్లతో గంజాయి అమ్మకం

Bhavani

Leave a Comment