38.2 C
Hyderabad
April 29, 2024 19: 30 PM
Slider ప్రపంచం

దుష్ట చైనా కుట్ర: సరిహద్దుల్లో మళ్ళీ అలజడి!

చైనా -భారత్ సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ దగ్గర రెండు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ ( ఎల్ ఏ సీ ) వద్ద ఇది చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జరిగిన ఘర్షణలో ఇరువర్గాలవారికి గాయలైనట్లు తెలుస్తోంది.ప్రాణహాని జరుగకపోయినా ఈ ఆందోళనా వాతావరణం ఆహ్వానించదగినది కాదు.తూర్పు లడాక్ ఘర్షణ తర్వాత ఈ తరహా ఘటన జరగడం ఇదే ప్రధమంగా చెబుతున్నారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలను నెలకొల్పే దిశగా ఇరు దేశాల మధ్య ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈ హఠాత్ పరిణామం కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది.

ఈ ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించిన బలగాలను వెనక్కి రప్పించినట్లుగా సమాచారం. గతంలో సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో మన సైనికులు 20మంది ప్రాణాలు కోల్పోయారు.అదే ఘటనలో చైనాకు చెందిన 40మంది సైనికులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నట్లు చెప్పుకున్నారు.ఈ సంఘటనతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.నిజంగా చైనా – భారత్ మధ్య మళ్ళీ పెద్ద యుద్ధమే వస్తుందని అందరూ భయపడ్డారు. ఏ స్థాయిలోనైనా చైనాను తిప్పికొట్టడానికి భారత్ సర్వ విధాలా సిద్ధమైంది కూడా.

సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరిహద్దులకు వెళ్లి మన సైన్యానికి అచంచలమైన ధైర్యాన్ని ఇవ్వడమే కాక,చైనాకు గట్టి హెచ్చరిక కూడా చేశారు. సమాంతరంగా శాంతి స్థాపనకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరిగాయి.ఇరు దేశాల ప్రతినిధులు పలుమార్లు చర్చలు జరిపారు. సుదీర్ఘకాలం పాటు వరుస చర్చల తర్వాత రెండు దేశాలు తమ బలగాలను చాలా వరకూ వెనక్కు తీసుకున్నాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గి కొంత శాంతి వాతావరణం అలుముకుంది.

తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన సంఘటనతో సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఈ తరుణంలో మనం అప్రమత్తమైనప్పటికీ, అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో వుంది. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాల్లో చాలా వరకూ మన భూభాగాలను చైనా ఆక్రమించేసిందనే ఎక్కువమంది పరిశీలకుల వాదన.

ఏ కాలంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా?

ఈ ఆక్రమణల విషయాన్ని ఏ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా తమకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాయి.

ముఖ్యంగా జిన్ పింగ్ కాలంలో, భారత్ -చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే చెప్పాలి. అమెరికాను అధిగమించి అగ్రరాజ్యంగా అవతరించాలనే ఆకాంక్ష, సామ్రాజ్య విస్తరణ కాంక్ష బలంగా ఉన్న నాయకుడిగా జిన్ పింగ్ కు ప్రపంచ దేశాల్లో పేరుంది. భారత్ సరిహద్దు దేశాలన్నింటినీ ఇప్పటికే చైనా తన గుప్పిట్లో పెట్టుకుంది.ఆ యా దేశాలకు అన్ని రకాల ఆకర్షణలను కలిగించి, అందించాల్సిన కానుకలను విభిన్న రూపాల్లో సమర్పించి, మ,దాన,భేద,దండోపాయాలను ప్రయోగించి తనకు అనుకూలంగా, భారత్ కు వ్యతిరేకంగా వారిని మలచడంలో చైనా చాలా వరకూ విజయాన్ని సాధించింది.ఇప్పటికీ దుష్ట యత్నాలు చేస్తూనే వుంది.

ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే? అదంతా తమ భూభాగమనే భావనల్లోనే చైనా ఉంది. సరిహద్దులను కూడా దాటి చాలా గ్రామాలను తమ కనుసన్నల్లో నిలుపకుందనే పరిశీలకులు చెబుతున్నారు. గతంలో జరిగిన యుద్ధాలను గమనిస్తే దొంగదెబ్బలు తీయడం చైనా నైజంగా మనకు చేదు అనుభవాలు ఉన్నాయి. ఆ దేశం మన కంటే అనేక అంశాల్లో బలంగా ఉందన్నది కాదనలేని సత్యం.మనం ఆర్ధికంగా స్వయంసమృద్ధిని సాధించడం అత్యంత కీలకం.బలమైన దేశంగా మనం అవతరించకపోతే చైనా, అమెరికా వంటి పెద్ద దేశాలు మనతో ఆడుకుంటూనే ఉంటాయి.

సరిహద్దు దేశాలతో రాజనీతిని పాటిస్తూనే యుద్ధనీతిని మార్చుకోవడం అవసరం. చైనా మొదలు ప్రతి దేశం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండడం అంతే కీలకం.

మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్

Related posts

గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అదనపు కలెక్టర్

Satyam NEWS

స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు చేసిన అల్లూ అర్జున్

Satyam NEWS

మన దేశంలో ఇచ్నిదానికన్నా బయటకు పంపిదే ఎక్కువ

Satyam NEWS

Leave a Comment