రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. బార్ల పాలసీపై ముఖ్యమంత్రి నేడు సమీక్ష జరిపారు. అదే విధంగా స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించనున్నారు. ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని ముఖ్యమంత్రి తెలిపారు. అకస్మాత్తుగా కాకుండా విడతల వారీగా తగ్గిద్దామని అధికారులు సూచించగా సుదీర్ఘ చర్చ తర్వాత బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా బార్లలో మద్యం సరఫరా వేళలను కూడా కుదించాలని నిర్ణయించారు. బార్లలో మద్యం సరఫరా ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాత్రి 11 వరకూ ఆహారం సరఫరా చేసుకోవచ్చు. స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం సరఫరా చేసుకోవచ్చు. అంతే కాకుండా బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీనికి నాన్‌బెయిల్ బుల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.