27.7 C
Hyderabad
April 30, 2024 07: 50 AM
Slider ముఖ్యంశాలు

ఒక పోలీసు చెప్పిన కథ: అన్నం శ్రమ జీవుల కష్టం

kamatipura 1

హైదరాబాద్ నగరం, కామటి పుర ఏరియాలో, స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర ఇతర రాష్ట్రాల వలస కార్మికులు  చాలా మంది గుంపులు గుంపులుగా వున్నారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. నేను, నా తో పాటు మా పోలీస్ స్టాఫ్ అక్కడకు వెళ్లాము.

గుంపులుగా ఉన్నవారిని లైన్ లో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. కరోనా వైరస్ ఉన్నదని అది దగ్గర దగ్గరా నిలబడితే వ్యాపిస్తుందని అందువల్ల భౌతిక దూరం పాటించాలని వాళ్లకు వివరించి చెబుతూ ఉన్నాం. చాలా మంది విన్నారు. లైన్ లో సర్దుకుంటున్నారు.

అక్కడ జరుగుతున్న ఈ హడావుడి,  అక్కడ వాళ్ళు ఎందుకు నిలబడి ఉన్నారో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది.  లాక్ డౌన్ దృష్టిలో  పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులకు ఒక్కరికీ, 12 కిలోల బియ్యం, రూ. 500 క్యాష్ రెవెన్యూ శాఖ ద్వారా ఇస్తున్నది.

అక్కడకు వచ్చిన కార్మికులలో 95%  మంది 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నారు. వారందరూ బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, యూపీ, బెంగాల్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు.  వారికి పనులు లేక, ఉన్న డబ్బులు అయిపోయి, ప్రభుత్వ సహయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఎర్రటి ఎండ ను లెక్క చేయటం లేదు.  ఎండ నుండి తప్పుకోవచ్చు, కానీ ఆకలి నుండి తప్పుకొలేం. నేను వలస కార్మికులను లైన్ లో నిల బెట్టే  పనిలో బిజీగా ఉండగా, అక్కడ  ఉన్న కార్మికుల మధ్య నుండి ఒక వ్యక్తి నా వైపు గా, నన్నే చూస్తూ వస్తున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి “కాకా బాగున్నావా” అంటూ నా దగ్గరకు వచ్చాడు.

ఆ వ్యక్తి ముఖానికి మాస్క్ ఉన్నది. అయినా నేను అతన్ని గుర్తుపట్టాను. వెంటనే నేను “విజయ్ కాక!, నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నావా? అని ఆశ్చర్యంతో అడిగాను. “ బాగున్నాను కాకా, ప్రస్తుతం GHMC లోని UCDW, (urban community development wing) లో C O (community organiser ) గా దూద్ బౌలి డివిజన్ ఇన్చార్జిగా ఉన్నాను అని ” బదులిచ్చాడు.

తనకు కేటాయించిన ఏరియాలో పేదవారు, బిచ్చగాళ్ళు, నిరాశ్రయులు, వలస కార్మికులు ఉంటే గుర్తించి వారికి ఆహార పొట్లాలు అందివ్వడం అతని విధి. ఆ పనిలో భాగంగా వలస కార్మికులు ఎక్కడ ఎక్కడ ఉన్నారు అనే విషయం గురించి సర్వే చేస్తున్నాడు.

2000 – 2003 సంవత్సరంలో నిజాం కాలేజ్, హైదరాబాద్ లో నేను, విజయ్ కుమార్ డిగ్రీ క్లాస్మేట్స్. నాది (B.A) రెండక్షరాల చదువు అయితే, తనది (B.Com) మూడు అక్షరాల చదువు. జీవన ప్రయాణంలో ఎక్కడెక్కడో తిరిగి, ఏవేవో ఉద్యోగాలు చేసి నేను ఎస్సైగా, తను  ఉస్మానియా యూనివర్సిటీ నుండి P.hd పూర్తి చేసి, ప్రస్తుతం తను C.Oగా స్థిరపడ్డాం.

ఈ 17 సంవత్సరాల సుదీర్ఘ జీవన ప్రయాణం తర్వాత కరోనా వైరస్ నిర్మూలన డ్యూటీ లో యాదృచ్ఛికంగా కలుసుకున్నాం. మేము అలా పాత రోజులు గుర్తుచేసుకొని ఆనందపడి, ప్రస్తుత పరిస్థితుల గురించి తలుచు కొని బాధ పడ్డాం.

మా పని ఒత్తిడి వల్ల మేం కొద్దిసేపు మాట్లాడుకొని, ఒకరి యోగ క్షేమాలు ఒకరం తెలుసుకొని, సోషల్ డిస్టెన్స్ లో భాగంగా ఒకరినొకరు చేతులు ‘‘కలుపుకోకుండా’’ నే అక్కడి నుండి వెళ్లిపోయాం. మరుసటి రోజు ఉదయం విజయ్ నాకు ఫోన్ చేసి “కాకా మన ఏరియాలో నీకు తెలిసి ఎవరైనా పేదవారు, వలస కార్మికులు ఇంకా ఇతరులు ఎవరైనా ఉంటే చెప్పు.

నేను వారికి ఫుడ్ (అన్నం) ప్యాకెట్స్ సప్లై చేస్తాను” అని అన్నాడు. అప్పుడు నేను మా ఏరియాలో ఉంటున్న అన్నం అవసరమైన వ్యక్తుల జాబితాను అతడికి తెలియజేశాను. నేను అతనితో మాట్లాడిన 15 నిమిషాలలో విజయ్ ఒక ఆటో నిండుగా ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని మా పోలీస్ స్టేషన్ కి వచ్చాడు.

ఇద్దరం కలిసి, పాలమూరు లేబర్స్ దాదాపు 30 మంది నివాసం ఉంటున్న వారి గుడిసెల దగ్గరకు వెళ్లి వారికి ఆహార పొట్లాలు అందించాం. ఆ తర్వాత కొద్ది దూరంలో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల వలస  కార్మికులకు దాదాపు 40 మంది (ఆడ, మగ, పిల్లలు) అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ అందిచ్చాం.

ఫుడ్ ప్యాకెట్స్ తీసుకున్న అన్నార్తులు అందరి మొహాల్లో ఆనందం. వారందరూ మాకు కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ రోజు నాకు ఫోన్ చేస్తాడు. “ఫుడ్ ప్యాకెట్స్ రెడీ అయ్యాయి. బండి (జీప్) పంపించు” అని. ఇలా రోజూ  నేను పోలీస్ బండి పంపించడం వచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ ను అన్నార్తులకు అందించడం చేస్తున్నాం.

రోజు రోజుకి అన్నార్తుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించారు.(ఈ నెల 30 వరకూ) నేను విజయ్ కి ఫోన్ చేసి, “కాకా ఈ ఫుడ్ సప్లై లాక్ డౌన్ వరకు ఉంటుందా?” అని అడిగా, “ ఉంటుంది. చెప్పు కాక!  మీ ఏరియాలో ఇప్పుడు ఉన్నవాళ్లు కాకుండా, ఇంకా ఎవరైనా ఉంటే చెప్పు,  ఎన్ని ఫుడ్ ప్యాకెట్స్ కావాలన్నా పంపుతాను” అని భరోసా ఇచ్చాడు.

ప్రతీ రోజూ ఫుడ్ పాకెట్స్ మధ్యాహ్నం, సాయంత్రం విజయ్ కాక ద్వారా వస్తే, వాటిని మేము అవసరం అయిన వారికి పంపిణీ చేస్తున్నాం. విజయ్ కాక చెప్పిన ఆ మాటలు చాలు మా ఏరియాలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పాలమూరు కూలీలు, పేదవారు, బిచ్చగాళ్లు అన్నం అవసరమైన వారికి తమ ఆకలి తీర్చుకుని జీవితంపై ఆశలు నిలుపుకోవడానికి.

కేశవ్, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కామాటిపురా పోలీస్ స్టేషన్, హైదరాబాద్ సిటీ

Related posts

స్కూలు విద్యార్ధుల కోసం టీవీ బహూకరణ

Satyam NEWS

అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి

Satyam NEWS

జాతీయ వినియోగదారు హక్కుల కమిషన్ కు అశోక్ నంద

Satyam NEWS

Leave a Comment