భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామమని ఐఐటి జెఇఇ ఫోరం కన్వీనర్ కె లలిత్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఈ రెండు పార్టీల కలయిక పరిష్కారం చూపిస్తుందని ఆయన అన్నారు. రాజధాని అమరావతిని తరలించడం అనేది ఏపి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అస్థిరత్వం వైపు దారితీస్తున్న ఈ సమయంలో బిజెపి జనసేన కలిసి పని చేయాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కులరాజకీయాలకు ఈ రెండు పార్టీల కలయిక పరిష్కారం చూపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో కలిసి విడిపోయే రాజకీయ సిద్ధాంతాలకు భిన్నంగా ముందు నుంచే ప్రజాక్షేత్రంలో కలిసి పని చేయడం నూతన రాజకీయ వ్యవస్థ ఆవిర్భవించేందుకు దోహదం చేస్తుందని లలిత్ కుమార్ వ్యాఖ్యానించారు.