టీటీడీ అధికారులు కోరుకుంటే ఆగమశాస్త్రాన్ని కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదా? శ్రీవారి ఆలయం నుంచి ఆగమశాస్త్ర విరుద్ధంగా ఒక్క పువ్వు కానీ ఆకు కానీ కూడా బయటకు రాకూడదు. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే టీటీడీ అధికారులు తలచుకుంటే ఏదైనా బయటికి తీసుకువచ్చేస్తారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ధనుర్మాసం లో జరిగే తిరుప్పావై పాశురాల సందర్భంగా మూల విరాట్ కు శంఖం ఎడమచేతి వద్ద ప్రతిరోజు గోదాదేవి జ్ఞాపకార్థంగా ధనుర్మాస చిలకను అలంకరిస్తారు.
పవిత్ర ఆకులతో తయారుచేసిన ఈ ధనుర్మాస చిలకను తిరుమల ఆలయం నుంచి బయటకు తెచ్చే వీలు లేదు. ఆగమ శాస్త్రంతో బాటు ఆలయాల చట్టంలో శ్రీ వారికి అలంకారం చేసిన పూలమాలలను బయటకు ఇవ్వకూడదు. పూల మాలే కాదు ఏదీ బయటకు రాకూడదు. అయితే చిలక బయటకు వచ్చేసింది. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి ఒక పవిత్ర ఆకుతో తయారు చేసిన చిలకను శ్రీవారి శంఖం వద్ద నుంచి తీసి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా ఒక అతి ముఖ్యమైన వ్యక్తికి ఆ చిలుకను ఇచ్చేశారు.
ఆ ముఖ్యమైన వ్యక్తి దేవాలయంలోకి వస్తే ఇవ్వడం కాదు. అలిపిరి వద్దకు తీసుకొచ్చి మరీ ఇచ్చారు. శ్రీవారి సన్నిధి దాటి గర్భాలయంలో ఉన్న చిలుకను అలిపిరి కి తీసుకొచ్చేందుకు ఎవరు అనుమతించారు? ఆలయ నిబంధనలకు ఇది విరుద్ధం కాదా? టీటీడీ ఉన్నతాధికారులు తలచుకుంటే శ్రీవారి ఆలయం నుంచి ఏదైనా బయటికి తీసుకురావచ్చా?
ఈ ప్రశ్నలకు సమాధానం కావాలని అడుగుతున్నారు శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీ అధికారులు చెబుతారా? ఇంతకీ ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే విశాఖ శారదా పీఠం అధిపతి స్వామీ స్వరూపానందదేంద్ర స్వామి. ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా