42.2 C
Hyderabad
May 3, 2024 18: 07 PM
Slider ప్రత్యేకం

ఉన్నతాధికారులే జెడ్ పి సమావేశాలకు రావాలి

#nagarkurnoolzpmeeting

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు విధిగా హాజరవ్వాలని కింది స్థాయి ఉద్యోగులను పంపవద్దని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి ఆదేశించారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం లోని పాలిటెక్నీక్ కళాశాల ఆడిటోరియం లో నిర్వహించిన జిల్లా పరిషత్ 10వ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. 

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధుల సమక్షంలో అర్థవంతమైన సమీక్షలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు.  అత్యంత ప్రాముఖ్యం కలిగిన మైన్స్ అండ్ జువాలజి, రోడ్లు భవనాలు, పంచాయతి, వైద్య ఆరోగ్యం, మిషన్ భగీరథ, ఇరిగేషన్, గ్రామీణాభివృద్ధి,  తదితర శాఖల పై సమీక్ష నిర్వహించారు. 

కొన్ని శాఖల తరపున  సమావేశానికి జిల్లా ఉన్నతా ధికారులు కాకుండా వారి కిందిస్థాయి ఉద్యోగులను సమావేశానికి పంపించడం సబబు కాదని తెలిపారు.  ఇక నుండి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని లేనిపక్షంలో చర్యలు తీసుకునేందుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. 

అచ్ఛంపేట శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ సమావేశంలో ముఖ్యమైన అంశాల పై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా మండల పరిషత్ సమావేశాలను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.  మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలను సమీక్షించి ఫలితాలు రాబట్టే విధంగా చూడాలన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఉన్నతాధికారులు మాత్రమే హాజరు అవ్వాలని మండల పరిషత్ సమావేశాలకు సైతం సంబంధిత అధికారులు విధిగా హాజరయ్యేవిధంగా ఆదేశాలు జారిచేస్తామని తెలిపారు. అతిముఖ్యమైన మైన్స్ శాఖ సమీక్ష సందర్బంగా ఏ.డి సభకు రాకపోవడం పై ఈ రోజు జీతం ఎందుకు రద్దు చర్యకూడదో షోకాజ్ నోటీసు జారిచేయనున్నట్లు తెలిపారు. 

మైన్స్ అండ్ జువాలజీ పై సమీక్ష సందర్బంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా నిర్మాణ రంగానికి సంబంధించిన ఇసుక ప్రజలకు అందుబాటులో సరిగ్గా లేదని దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఇసుక దొరక్క పనులు ఆగిపోకుండా చూడాలన్నారు.  అక్రమ ఇసుక బ్రహ్మాండంగా నడుస్తుందని, మన ఇసుక వాహనం ద్వారా ఇసుక అడిగితే మాత్రం సకాలంలో దొరకడం లేదన్నారు.  ఇసుక వాగుకు దగ్గర్లో ఉన్న గ్రామ ప్రజలకు ఇసుక తీసుకునేవిధంగా వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ ను కోరారు.

కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ

దుందుభి వాగు నుండి చాలా ఇసుక అక్రమంగా తరలించుకుపోతున్నారని ఆరోపించారు.  ప్రభుత్వ పనులకు ఆర్ అండ్ బి., పి.ఆర్ ఇంజనీరింగ్ అధికారులు ఇసుక ఎంతకావాలో ధ్రువీకరణ పత్రం ఇస్తే సంబంధిత తహసిల్దార్ అనుమతి పత్రం తో ఇసుక తీసుకునే విధంగా చూడాలని సూచించారు.  ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టివారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

ఇసుక అంశం పై కల్వకుర్తి   జడ్పిటిసి భరత్ ప్రసాద్,  ఉప్పునుంతల జడ్పిటిసి అనంత ప్రతాప్ రెడ్డి, అచ్ఛంపేట  జడ్పిటిసి మంత్ర్య నాయక్   సైతం మాట్లాడారు.  మన ఇసుక వాహనం సరిగ్గా నడవడం లేదని ఇసుక కొరకు చాలాన్ కట్టిన 40 రోజులకు సైతం రావడం లేదని ఆరోపించారు.  ఇసుక దొరకని కారణంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు పూర్తి చేయలేకపోతున్నామని అన్నారు.  ముందుగా రీచ్ లకు దారులు క్లియర్ చేయాలని మరికొన్ని రీచ్ లను గుర్తించి అవసరమైన వారందరికీ ఇసుక అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆర్ అండ్ బి రోడ్డు శాఖ సమీక్ష సందర్బంగా పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ భవనం ఎప్పటి పూర్తి చేస్తారని అన్ని జిల్లాల్లో ప్రారంభోత్సవాలు జరుగుచున్నాయి మన జిల్లాలో అలస్యం  అయ్యిందన్నారు.  స్పందించిన అధికారి జులై చివరి నాటికీ పూర్తి చేస్తామని తెలిపారు.  ఎంపీ మాట్లాడుతూ  చారగొండ నుండి శ్రీశైలం వెళుతున్న  రహదారి పనులు చారగొండ వద్ద ఆగిపోయిందని సమస్య పూర్తి చేసి రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు.  అదేవిధంగా కల్వకుర్తి నుండి కొల్లాపూర్ సోమశిల నంద్యాల రోడ్డు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందని ప్రశ్నించారు.  కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ  రోడ్డుపై గుంతలు పడిన చోట మరమ్మతులు చేపట్టాలని  సూచించారు. 

పదర జడ్పిటిసి రాంబాబు మాట్లాడుతూ మండలము నుండి జిల్లాకు, గ్రామాల నుండి మండలానికి వచ్చే రోడ్లు కొన్ని గుంతల మయమయ్యిందని, తద్వారా గర్భిణీలు స్త్రీలు సిజేరియన్ కావాల్సిన వారు నార్మల్ డెలివరీ లు అయిపోతున్నాయని వాపోయారు.  

పధర నుండి వంకేశ్వరం వెళ్లే రోడ్డుకు కోటి రూపాయలు మంజూరు అయ్యాయని వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగ కోరారు. జడ్పిటిసి భారత్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు మరమ్మతులు జరుగుచున్న ప్రాంతంలో  వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే సూచిక బోర్డు పెట్టడం లేదని తద్వారా ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందన్నారు.  సూచిక బోర్డులు పెట్టాల్సిందిగా సూచించారు. 

పంచాయతిరాజ్ శాఖ సమీక్ష సందర్బంగా  గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ గ్రంథాలయ శాఖకు నిధుల కొరత ఉందని, గ్రామ పంచాయతీ ద్వారా వసూలు చేసే ట్యాక్స్ నుండి గ్రంథాలయ సంస్థకు రావాల్సిన 0.8 శాతం ట్యాక్స్ ను గ్రంధాలయ అకౌంట్ కు జమ చేయాలని కోరారు. 

ఎంపీ రాములు మాట్లాడుతూ

హరితహారం లో నాటిన మొక్కలను నీరు పోసి మొక్కలను బతికించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని గ్రామాల్లో సర్పంచుకు ఉప సర్పంచు మధ్య సయోధ్య లేదని వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలియజేసారు.  

గ్రామాల్లో ఇంటింటికి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కొళాయిలకు పంచాయతి సెక్రెటరీలు  బిల్లులు వసూలు చేస్తున్నారని ఉచితంగా ఇస్తున్న మిషన్ భగీరథ నీటికి బిల్లు ఎలా వసూలు చేస్తారని డి.పి.ఓ ను ప్రశ్నించారు.  స్పందించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ మిషన్ భగీరథ తాగు నీటిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఎక్కడ కూడా బిల్లు వసూలు చేయడానికి వీలు లేదని తెలిపారు. 

కల్వకుర్తి జడ్పిటిసి భరత్ మాట్లాడుతూ పేపర్లో వచ్చిన వార్తలకు స్పందించి సంజాయిషీ తీసుకోకుండానే పంచాయతీ సెక్రెటరీలను సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. నోటీస్ ఇచ్చి  సంజాయిషీ తీసుకున్న తర్వాతనే చర్యలు తీసుకోవాలని సభాముఖంగా డి.పి.ఓ ను సూచించారు. 

వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష సందర్బంగా వైద్య సిబ్బంది పనితీరు పై ప్రజాప్రతినిధులు తమ అసంతృప్తిని తెలిపారు.  రాత్రిపూట ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీలు చేయరని ఆ డాక్టర్లే నర్సింగ్ హోమ్ లలో సర్జరీలు చేస్తారని ఆరోపించారు.  భరత్ ప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని సభా దృష్టికి తీసుకువచ్చారు.  పి.హెచ్.సి ల్లో జరిగే మండల స్థాయి సమావేశానికి  జడ్పిటిసి అయిన తనను పిలువకుండానే బడ్జెట్ బిల్లు ఎలా పాస్ చేసుకుంటారని ఆక్షేపించారు. 

జడ్పిటిసి అమ్రాబాద్ అనురాధ మాట్లాడుతూ పి.హెచ్.సి లో సరైన వైద్య సిబ్బంది లేరని మరో డాక్టరును నియమించాల్సిందిగా కోరారు. జిల్లా మినరల్ ఫండ్ నుండి కేటాయించిన నిధులతో (3) 108 వాహనాలు వెంటనే కొనాల్సిందిగా తెలియజేసారు. 

విద్యా శాఖపై సైతం విస్తృతంగా చర్చించారు.  మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించిందని జడ్పిటిసి భరత్ ప్రసాద్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఆరోపించారు.  మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలలకు వెంటనే ఇంజనీరింగ్ అధికారుల ద్వారా బడ్జెట్ అంచనాలు రూపొందించాలని విద్యా శాఖాధికారిని సూచించారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, జడ్పి సి.ఈ.ఓ  ఉషారాణి, జడ్పి టీసీలు, ఎంపిపి లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

వనపర్తి మున్సిపాలిటి అవినీతి ఆక్రమాలపై కలెక్టర్ కు పిర్యాదు 

Satyam NEWS

చిరు చినుకుల మధ్యనే విజయనగరం ఎస్ పి విధినిర్వహణ

Satyam NEWS

విశాఖ ఉక్కు ఉద్యమంలో ఇక చురుకుగా జనసేన పార్టీ

Satyam NEWS

Leave a Comment