29.7 C
Hyderabad
April 29, 2024 07: 03 AM
Slider ప్రత్యేకం

ఎన్నికల ఆరాటం లో మొదలైన పోరాటం

#Telangana CM KCR

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దిల్లీ కేంద్రంగా తిరుగుతున్నాయి. తెలంగాణా కు చెందిన కాంగ్రెస్ ఇటీవల పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన సందర్భంలో … తెరాసతో గానీ..ఇతర పార్టీలతో గానీ కాంగ్రెస్ కు పొత్తు ఉండబోదని చెప్పడం,అలాగే… పార్టీలో అభిప్రాయభేదాలు ఉంటే మనలో మనం కూర్చొని పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఒక వైపు తెరాస, మరోవైపు భాజపాతో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పార్టీనేతలకు దిశానిర్దేశం చేశారు. తెరాస ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేయాలని రాహుల్ గాంధీ పార్టీ వర్గాలకు సూచించారు.

ప్రజాభీష్టం మేరకు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీపట్ల ఇప్పటికీ ప్రజాదరణ ఉందని, దానిని ఎన్నికలలో ఓట్లుగా మలచుకోవాలని ఆయన తెలిపారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేస్తున్న మోసాలనుంచి అమాయక రైతులను ఆదుకావాలని, త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని ఆయన కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. టీ.కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మిగిలిన సీనియర్ నాయకులకు ఉన్న భేదాభిప్రాయాలు విడిచి అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతీయ జనతాపార్టీ విషయానికి వస్తే… అగ్రనేత అమిత్ షా రంగంలోకి దిగినట్లు సమాచారం. అటు తెరాస, ఇటు కాంగ్రెస్ తో తట్టుకొని పోటీలో నిలబడాలంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కసరత్తు ప్రారం భించాలని అమిత్ షా తాజాగా తనను కలిసిన తెలంగాణ భాజపా శ్రేణులను
ఆదేశించారు.

పల్లేసీమల్లో భాజపాకు ఆదరణ పెరగాలని, కేంద్రం పలు పథకాలకు ఇస్తున్న నిధుల గురించి లబ్ధిదారులకు వివరించాలని ఆయన సూచించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యాగీని సమర్థవతంగా తిప్పికొట్టాలని అమిత్ షా పార్టీ వర్గాలకు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల జాబితాలో.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భాజపా నిలదొక్కుకునే అవకాశం ఎక్కువగా ఉందని, అందుకే రాబోయే ఎన్నికలనాటికి పార్టీ పునాదులను పటిష్టం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని భాజపా అగ్రనేత తెలిపారు.

మరోవైపు…గవర్నర్ దిల్లీ పయనం రాజకీయ పరిశీలకులలో ఆసక్తి కలిగించింది. గత కొద్ది కాలంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య దూరం పెరిగింది. రాజకీయ నిర్ణయాలలో రాజ్ భవన్ జోక్యం తగదని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శించడం, దానికి అంతే ధీటుగా గవర్నర్ స్పందించడం వంటి అనేక కారణాలు అతి ముఖ్యమైన రెండు ప్రజాస్వామిక వ్యవస్థల మధ్య
ఉండాల్సిన సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీశాయి.

రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన సందర్భాలలో సైతం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని గుర్తించడం లేదని రాజ్ భవన్ వర్గాలు అంటున్నాయి.

తాజాగా నిర్వహించిన బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిపించడం,రాజ్ భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎవరూ హాజరు కాకపోవడం వంటి విషయాలు రాజ్ భవన్ తో రాష్ట్ర ప్రభుత్వం తెగతెంపులు చేసుకున్నట్లుగా ఉందని పరిశీలకుల అభిప్రాయం.

ఒకనాటి భాజపా నేతను తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తెరాస మొదటినుంచీ సందేహిస్తూనే ఉంది.ప్రజా దర్బార్ నిర్వహించడం, ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శించడం, ఎమ్ఎల్సీ అభ్యర్థిగా ప్రభుత్వం సిఫార్సు చేసిన కౌశిక్ రెడ్డి కి ఆమోదం తెలపకపోవడం వంటి అనేక విషయాలలో తెరాస,గవర్నర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.

ఇటీవలి గవర్నర్ పర్యటనలలో ప్రోటోకాల్ పాటించక పోవడంతో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వ్యక్తిగా తనకు మర్యాద ఇవ్వకపోయినా ఫర్వాలేదు..కానీ గవర్నర్ స్థానానికి కనీస గౌరవం ఇవ్వక పోవడం బాధాకరం అని రాష్ట్ర ప్రథమ పౌరురాలు అనడం దిల్లీ స్థాయిలో ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందో నిరీక్షించక తప్పదు.

ఏది ఏమైనా… ఒకటి మాత్రం నిజం. తెరాస అధినేత పై ముప్పేట దాడికి అన్నివైపులా ఉచ్చు బిగిస్తోందని రాజకీయ విశ్లేషకుల భావన. చివరి అస్త్రంగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీ బీ ఐ, ఈ డీ లను రంగంలోకి దించినా ఆశ్చర్యం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు.

ఒక రాజనీతిజ్ఞుడు అన్నట్లు..”రాజకీయాలు ఒక అమానవీయ క్రీడగా మారిన నేటి రోజులలో రాజకీయ పార్టీల నైతికత ప్రశ్న గానే మిగులుతుంది.”

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

కెసిఆర్ కు పువ్వాడ జన్మదిన శుభాకాంక్షలు

Bhavani

విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

Satyam NEWS

బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

Satyam NEWS

Leave a Comment