38.2 C
Hyderabad
May 2, 2024 22: 45 PM
Slider ప్రపంచం

Analysis: సరిహద్దుల్లో చెత్త గేమ్ ఆడుతున్న చైనా

#China at Boarders

భారత్ చైనా సంబంధాల్లో చైనా డబుల్ గేమ్ ఆడుతూ  ద్వంద్వనీతినే ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో భారత భూభాగాలను ఆక్రమించుకోవడమే ప్రధాన లక్ష్యంగా, అలజళ్ళు, అల్లర్లు సృష్టిస్తూ భారత్ ను ఇబ్బంది పెడుతూ,  బలహీనపరచాలనే ఎజెండాతోనే ముందుకు వెళ్తోంది.

సరిహద్దుల్లో చైనా చేస్తున్న దమనకాండ, కుయుక్తులకు భారత్ విసిగి పోయింది. చైనాతో వాణిజ్య లావాదేవీలపై నిషేధం దిశగా భారత్ నిర్ణయాత్మకంగా ముందుకు నడుస్తోంది. స్వావలంబన సాధించాలని గుండె నిబ్బరంగా అడుగులు వేస్తోంది. అమెరికాతో భారత్ బంధాలు మరింత గట్టిపడుతున్నాయి.

విషం కక్కుతున్న చెత్త చైనా

ఈ రెండు దేశాలు కలిసి ప్రయాణం చేస్తే, ప్రపంచంలో తన అధిపత్యం తగ్గిపోతుందని చైనా భయపడుతోంది. అమెరికా సహకారంతో భారతదేశం తనని దాటి ముందుకు వెళ్తుందని కలవర పడుతోంది. భారత్ పై అడుగడుగునా విషం కక్కుతోంది. విలయం సృష్టించాలని చూస్తోంది.

ఏదో విధంగా భారత్ ను కట్టడి చేసి, తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది. వేదికలపై చైనా పెద్దలు  మాట్లాడే తీరు వేరు, సరిహద్దుల్లోనూ అంతర్జాతీయంగానూ మనతో ప్రవర్తిస్తున్న తీరు వేరు. చైనా వాక్కు రూపంలో యుద్ధాన్ని కాంక్షించకుండానే, క్రియా రూపంగా  యుద్ధ వాతావరణం కల్పిస్తోంది.

బెదిరింపులు పని చేయవు

రష్యా, ఇరాన్, శ్రీలంక, నేపాల్ మొదలైన దేశాలన్నింటినీ భారత్ కు దూరం చెయ్యడానికి తాను చేస్తున్న తీవ్ర ప్రయత్నాల్లో చాలా వరకూ విజయవంతమైంది. ఐరోపా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ వ్యాఖ్యల్లో ద్వంద్వ వైఖరి వినిపిస్తోంది.

ఆయన మాటల్లో బెదిరింపులు, హుంకరింపులు, అబద్ధాలు,వాణిజ్య స్వార్థం,  అతి లౌక్యం కనిపిస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దుల మధ్య విభజన సరిగ్గా జరగలేదని, అందులో కచ్చితత్వం లేదని వాంగ్ యీ మొదటి వాదన. ఈ వివాదాలు ఎప్పటికీ తేలవని, ఈ అలజళ్ళు రావణకాష్టమని తేల్చి చెప్పేశారు.

ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో సరిహద్దు వివాదాలను తప్పనిసరిగా చేర్చాలని, వీటికి పరిష్కారం చూపాలని అంటున్నారు. వారి దృష్టిలో పరిష్కారం అంటే, వారికి నచ్చినట్లుగా, కోరినట్లుగా భారత్ భూభాగాన్ని వారికి అప్పజెప్పమని సారాంశం.

అమెరికాతో చెలిమి వద్దంటున్నారా?

రెండు దేశాలు కలిసి మళ్ళీ వ్యాపారం చెయ్యాలని, వాణిజ్య బంధాలు కొనసాగాలని, తద్వారా మన ముక్కు పిండి డబ్బులు వసూలు చేసుకుని తాము  ఆర్ధిక ప్రయోజనాలు పొందాలని కవి హృదయం. అదే సమయంలో,  అమెరికాతో సంబంధాలు పెంచుకోకుండా, తెంచుకుని, తమతోనే భారత్ నడవాలనే చైనా విధానాన్ని,  ఆ దేశ విదేశాంగమంత్రి పరోక్షంగా తేటతెల్లం చేస్తున్నారు.

ఆయన చేసిన  తాజా  వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. లడాఖ్ లోని పాంగంగ్ సరస్సు దగ్గర పెంచుతున్న తమ సైనిక కదలికల అంశాన్ని దాటవేస్తూ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. భారత్ తో చైనా అవలంబిస్తున్న  ఘర్షణ వాతావరణంలో ఎటువంటి మార్పులు లేవని వాంగ్ ఈ వ్యాఖ్యలు, సరిహద్దుల్లో చైనా సైన్యం కదలికలు చెబుతూనే ఉన్నాయి.

తేనెపూసిన కత్తుల్లా చైనా మాటలు

విభేదాలు వివాదాలుగా మారకుండా, చర్చల ద్వారా పరిష్కరించుకుందాం, కలిసి వాణిజ్య వ్యాపారాలు చేసుకుందాం, అంటూ చైనా విదేశాంగ మంత్రి తేనె పూసిన కత్తి వంటి శాంతి వచనాలు పలుకుతున్నారు. భారత్ ను దెబ్బ కొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో, ఆన్నీ చైనా అవలంబిస్తూనే ఉంది.

నేపాల్, పాకిస్తాన్ లు ఇప్పటికే భారత్ పై రెచ్చిపోతున్నాయి. భారత్ బంధాల విషయంలో ఎటూ తేల్చుకోలేక రష్యా అటూ ఇటూ ఊగుతోంది. చైనా తాజాగా భారత్ సరిహద్దుల్లో,  అర్ధరాత్రి పూట దొంగ దెబ్బ కొట్టింది. ఇంతవరకూ ఎటువంటి వివాదం లేని ప్రాంతంలోనూ కొత్త వివాదానికి, అలజడికి పన్నాగం పన్నింది.

సైనిక ఒప్పందాన్ని ఉల్లంఘించిన చైనా

భారత్ భూభాగంలోకి రావడానికి చైనా సైన్యం తీవ్రంగా ప్రయత్నించింది. తూర్పు లడాఖ్ లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో ఈ ఆగస్టు 29అర్ధరాత్రి నాడు ఈ దుస్సాహసానికి చైనా ఒడికట్టింది. సైనిక,దౌత్య చర్చల్లో రెండు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి భిన్నంగా చైనా సైన్యం ప్రవర్తించింది.

సరిహద్దుల్లో యధాతథస్థితి నిర్ణయానికి తిలోదకాలు ఇచ్చింది. పాంగాంగ్ ఉత్తర తీరంలోనే భారత్ -చైనాల మధ్య ఇప్పటి దాకా వివాదం ఉంది. ఇప్పుడు దక్షిణ రేవుకు కూడా వివాదాన్ని విస్తరించే దురాగతానికి చైనా సిద్ధపడింది. వివాదాస్పద ప్రాంతాల్లో భద్రతా దళాల కదలికలు పగటిపూట మాత్రమే జరగాలి.

వెన్ను చూపి వెళ్లిపోయిన చైనా

అర్ధరాత్రి పూట చొచ్చుకు వచ్చి, ఆ ఉల్లంఘనను కూడా చైనా అతిక్రమించింది. చైనా సైనికులు పెద్ద ఎత్తున ఇటు వైపు వస్తున్నారని గమనించిన మన సైనికులు అప్రమత్తమై, వారిని అడ్డుకున్నారు. భారత్ గణనీయ స్థాయిలో సైనిక దళాలను మోహరించడంతో చైనా సైన్యాలు వెన్ను చూపించి వెళ్లిపోయాయి.

సరిహద్దు వివాదాలను విస్తరించే వ్యూహంలో ఉన్న చైనాతో,  భారత్ కు ఎప్పటికైనా ఇబ్బందేనని భావించాలి. జూన్ 15వ తేదీ నాటి గల్వానా దమనకాండ తర్వాత, తీవ్ర స్థాయిలో ఉద్రిక్తలు సృష్టించడానికి చైనా చేపట్టిన రెండవ అతి పెద్ద చర్య ఇదేనని చెప్పవచ్చు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.

సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత అప్రమత్తం చేసింది. బలగాలను పెంచుతోంది. రెండు దేశాల మధ్య ఈ యుద్ధ వాతావరణం కమ్ముకోడానికి కారణం చైనా దుందుడుకుతనం, సామ్రాజ్యకాంక్ష, స్వార్ధ వాణిజ్య ప్రయోజనాలు ప్రధానమైనవని చెప్పాలి. చైనా విషయంలో, వినాశకాలే విపరీత బుధ్ధి.. అంటే ఇదేనని చెప్పాలి.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

స్థితప్రఙ్ఞుడు

Satyam NEWS

కరోనా వైరస్ పై పోరాటం చేసి వ్యాధిని తరిమేద్దాం

Satyam NEWS

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి బంధువు?

Satyam NEWS

Leave a Comment