38.2 C
Hyderabad
May 5, 2024 20: 58 PM
Slider ప్రత్యేకం

Analysis: ఆగుతున్న శ్వాసను నిలబెట్టే ఆశ

#Corona Picture

యావత్తు సమాజాన్ని కకావికలం చేస్తున్న కరోనా కబంధహస్తాల నుండి బయటకు వచ్చే మంచి రోజులు కనుచూపు మేరలోనే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ లు కూడా ఆ దారిలోనే ఉన్నాయి. ఈ ఆగస్టు 15 నాటికే కరోనా వ్యాక్సిన్  అందుబాటులోకి వస్తోందన్న వార్త భారత ప్రజలకు వెయ్యేనుగుల బలాన్ని ఇస్తోంది.

భారత్ తో పాటు పలు దేశాలు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే చర్యల్లో పోటీపడి పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ వస్తే కానీ, ఈ సంక్షోభానికి తెరపడదు. ఈ భూమిపై ప్రస్తుతం జీవించి ఉన్న సుమారు నాలుగు తరాల మనుషులు ఇటువంటి గండాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు.

ఒక సూక్ష్మ జీవి ఆడుతున్న రాక్షస క్రీడ

ఎవ్వరూ కలలో, ఇలలో ఊహించని ఉపద్రవం ఇది. ఇది, వందల కోట్లమానవాళితో – కనిపించని ఒక సూక్ష్మజీవి ఆడుతున్న రాక్షస క్రీడ. దీనికి చరమగీతం పాడితేకానీ, సమాజం ముందుకు వెళ్ళలేదు.ఆగస్టు 15వ తేదీలోగా టీకా తీసుకురావాలని భారత వైద్య పరిశోధనా మండలి తీవ్రస్థాయిలో సన్నాహాలు చేస్తోంది.

సాధ్యాసాధ్యాలు చూడాలి. మానవులపై వివిధ దశలలో చేపట్టబోతున్న ప్రయోగాలు సత్వర  సత్పలితాలను ఇవ్వాలి. అవి సంపూర్ణంగా జయప్రదం కావాలని అందరం  మనసారా  కోరుకుందాం. మనదేశం సొంతంగా ఆవిష్కరించే తొలి టీకా ఇదే అవుతుంది.

భారత్ బయో టెక్ తయారు చేస్తున్న ఈ టీకాపేరు కొవాగ్జిన్. క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి హైదరాబాద్ నిమ్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జి హాస్పిటల్ సహా దేశవ్యాప్తంగా 12 హాస్పిటల్స్, సంస్థలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఇంకొక పక్క,  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) కరోనాను నయం చేసే ఔషధాలపై జరుగుతున్న ప్రయోగ ఫలితాలు రెండు వారాల్లోపే వెల్లడవుతాయని చెప్పడం మరో మంచి అడుగు.

ఎప్పుడు వస్తుందో వ్యాక్సిన్

రెమ్ డెసివిర్, హైడ్రోక్సో క్లోరోక్విన్, లోపినావిర్, ఇంటర్ ఫెరాన్ మొదలైన ఔషధాలు మనుషులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియడానికి ఈ ఏడాది చివరి వరకూ సమయం పట్టే అవకాశముందనీ, భారీస్థాయిలో ఉత్పత్తి చెయ్యడమే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, అనీ డబ్ల్యూ. హెచ్. ఓ అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైక్ ర్యాన్ వ్యాఖ్యానించారు.

ఇది కొంత ఆలోచించాల్సిన అంశం. వ్యాక్సిన్లు ఆగస్టు 15కల్లా సిద్ధమని భారత్, అక్టోబర్ -డిసెంబర్ లోపు,అని కొన్ని దేశాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో,  డబ్ల్యూ.హెచ్.ఓ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు శల్యసారథ్యాన్ని తలపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో, ఇప్పుడే అంచనా వెయ్యడం  తెలివితక్కువ పని అవుతుందని, మైక్ ర్యాన్ చేస్తున్న వ్యాఖ్యలు దీనికి అద్దంపడుతున్నాయి.

ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సీన్లు

ప్రపంచవ్యాప్తంగా 18 రకాల వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశకు చేరుకున్నాయి. భారతదేశంలో ఆగస్టు 15వ తేదీ నాటికి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను  అందుబాటులోకి తేవడానికి, భారత వైద్య పరిశోధన మండలి చర్యలను వేగవంతం చేస్తోంది. గత శతాబ్దంలో వచ్చిన అనేక రకాల వైరస్ లపై,  కనిపెట్టిన వ్యాక్సిన్లు సత్ఫలితాలనే ఇచ్చాయి.

చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపించే హిమోఫిలియస్ ఇన్ఫ్లూయెంజా బ్యాక్టీరియాపై 1977, 1990లో రెండు దశల్లో వ్యాక్సిన్లు తయారుచేశారు. ఈ వ్యాధిసోకినవారు 5శాతం మంది చనిపోతే, మిగిలినవారికి మెదడు దెబ్బతిని, వినికిడి శక్తిని కోల్పోయేవారు.

వ్యాక్సీన్ల పుట్టుపుర్వోత్తరాలు ఇవీ

కాలేయంపై దాడి చేసి, క్యాన్సర్ కూడా దారితీసే  హెపటైటిస్ బి వైరస్ కు 1981లో యూ.ఎస్ వ్యాక్సిన్ ను వినియోగంలోకి తెచ్చింది. గవదబిళ్ళలుకు 1948, 1960లో రెండు దశల్లో వ్యాక్సిన్ ను తెచ్చారు. ధనుర్వాతానికి 1890, 1924లో టెటానస్ వ్యాక్సిన్ కనుక్కొన్నారు.

పొంగువ్యాధికి 1969లో వ్యాక్సిన్ కనిపెట్టారు.ఆటలమ్మ (చికెన్ పాక్స్) కు 1984లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. పోలియోకు 1950లో వ్యాక్సిన్ కనిపెట్టారు. కొన్నేళ్ల తర్వాత ఓరల్ వ్యాక్సిన్ ను తయారుచేశారు.కోరింతదగ్గుకు 1926లో వ్యాక్సిన్ ను రూపొందించారు. ఫ్లూ వ్యాధికి  1930లో వ్యాక్సిన్ కనిపెట్టినా, 1945నాటికి అమెరికాకు, తర్వాత మిగిలిన దేశాలకు వాడకంలోకి వచ్చింది. ఒకరి నుండి మరొకరికి  వేగంగా వ్యాప్తిచెందే తట్టు అనే వ్యాధికి 1963లో వ్యాక్సిన్ వచ్చింది.

ఇలా, ప్రపంచ వ్యాప్తంగా, అనేక రకాల వైరస్ లు  ప్రజలకు వ్యాధులను అంటించాయి. వీటిని మట్టుపెట్టడానికి వివిధ దశల్లో అనేక రకాల వ్యాక్సిన్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి చాలావరకూ మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికీ ప్రపంచ ప్రయోగశాలలలో అధ్యయనాలు, ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి.

మానవ పరిణామ క్రమంలో, జీవ వైవిధ్యంలో, జీవుల పరిణామవికాసాల్లో ఎన్నో వైరస్ లు వస్తుంటాయి. పోతుంటాయి. కొన్ని మామూలుగా ఉంటాయి. మరికొన్ని ప్రమాదకారులుగా ఉంటాయి. ఇంకొన్ని మరింత ప్రమాదకారులుగా ఉంటాయి. ఈ వైరస్ ల సృష్టి తుదిలేని జీవనహేల.

ఆలోచనలు అలవాట్లు మారడం వల్లే…

ఈ శతాబ్దంలో ఆరోగ్యశాస్త్రం ఊహాతీతమైన అభివృద్ధి గడించింది. మనిషి సగటు జీవితకాలం బాగా పెరిగింది .జీవరసాయనశాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. ఆధునిక మానవాళిలో కొన్ని అనారోగ్యమైన అలవాట్లు,ఆలోచనలు  వచ్చి చేరాయి.పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని  ధ్వంసం చేసుకుంటూ ఉన్నాం. ఆ దుష్ఫలితాల ప్రభావమే ఈ కరోనా వంటి వైరస్ ల పరిణామం. అదే సమయంలో, ఆధునిక మానవుడిలో ఇప్పుడిప్పుడే ఆరోగ్యస్పృహ పెరుగుతోంది.

ఇది శుభ పరిణామం.కరోనా కొన్ని గుణపాఠాలు నేర్పుతోంది.కొత్త అనుభవాలను అందిస్తోంది.జీవన దృక్పథం మారడానికి కరోనా తప్పకుండా ఒక పారామీటర్ అవుతుంది. ఈ యుగపు మానవుని నడక కరోనా ముందు -కరోనా తర్వాత, అని  లిఖించవలసి వస్తుంది.

ఏది ఏమైనా, కరోనా నుండి మనల్ని రక్షించడానికి కొన్ని మందులు వచ్చాయి.  ఇంకా కొన్ని వస్తున్నాయి. త్వరలో వ్యాక్సిన్లు కూడా రాబోతున్నాయి. ఇది  ముందడుగు అని భావించాలి. ఈ ఔషధాలను కనిపెడుతున్న శాస్త్రవేత్తలకు, విశేషంగా కృషి చేస్తున్న తత్ సంబంధీకులకు  హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుదాం. ఆరోగ్యమస్తు. -మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

టిడ్కో ఇళ్ళల్లో 16న గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి

Satyam NEWS

ఎన్టీఆర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Bhavani

పల్లాకు మరోమారు ఎమ్మెల్సీ పదవిపై హర్షం

Satyam NEWS

Leave a Comment