26.7 C
Hyderabad
April 27, 2024 10: 48 AM
Slider ముఖ్యంశాలు

Tribute: రససిద్ధుడు మంగళంపల్లి బాలమురళి

#Mangalampally Bala murali krishna

గంధర్వులు,కిన్నరులు అనేవారు అసలు ఉన్నారో, లేరో, మనకు తెలియదు. పూర్వ మహా వాగ్గేయకారులను మనం చూడలేదు.మనకు తెలిసిన సంగీతమూర్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణ. వాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో, వారే బాలమురళిగా  వచ్చారేమో, అనిపిస్తుంది. సంగీతసరస్వతికి ఒక రూపం వస్తే, అదే  మంగళంపల్లి.

సుమారు ఎనిమిది దశాబ్దాల కాలప్రవాహంలో, సంగీతలోకం లో,మహామహుల మధ్యన నిలబడి, తన్ను తాను విభిన్నంగా, విశిష్టంగా  ఆవిష్కరించుకొని, కోట్లాదిమంది సంగీతప్రియుల హృదయాలు దోచుకున్న కృష్ణుడు బాలమురళీకృష్ణ.  శాస్త్రీయ సంగీతాన్ని పామరులకు కూడా దగ్గరికి చేర్చి, వారిని సైతం  ఆ సంప్రదాయ సాగరంలో ముంచెత్తిన ఏకైక  కళామూర్తి బాలమురళి.

సంప్రదాయ సంగీతాన్ని ప్రజల వద్దుకు చేర్చిన మహనీయుడు

విశృంఖలంగా గమకాలు వేస్తూ, పాడుతున్న ఆ కీర్తనల లోని పదాలు,దాని భావం, వినేవాడికి ఏమాత్రం అర్ధంకాకుండా, ఒక దేహప్రదర్శనలాగా పాడే గాయకుల వల్ల దూరమవుతున్న సంప్రదాయ సంగీతాన్ని, మళ్ళీ ప్రజల వద్దకు చేర్చిన మహనీయుడు ఈయనే. వాగ్గేయకారులు  రాసిన ప్రతి కీర్తనలోని ప్రతి అక్షరాన్ని అతి స్పష్టంగా పలికి,అర్ధవంతంగా,భావస్ఫోరకంగా  అందించి, రసాన్ని చిలికించినవారిలో అగ్రేసరుడు బాలమురళి.

ఈరోజు శాస్త్రీయ సంగీతం జనబాహుళ్యంలో చిరంజీవిగా మిగిలి ఉండడానికి  పునాదులు వేసిన నాదబ్రహ్మ ఆయన. జయదేవుడు,త్యాగయ్య, రామదాసు,అన్నమయ్య మొదలు సదాశివబ్రహ్మేంద్రులు  వరకూ మహనీయులైన ఎందరో  వాగ్గేయకారుల కీర్తనలను రసవంతంగా పాడి, లోకానికి కానుకగా అందించిన మహనీయుడు మంగళంపల్లి.

అసాధారణమైన ప్రతిభ (జీనియస్), దానికి తోడు అపురూపమైన సృజన (క్రియేటివిటీ),నవీనత (ఇన్నోవేటివ్), సుమధురమైన గాత్రం, అద్భుతమైన గానం ఆధునికకాలంలో కేవలం బాలమురళి సొత్తు.

కేవలం కొన్ని వేదికలకే పరిమితమైన శాస్త్రీయ సంగీతాన్ని బాహ్యప్రపంచంలోకి తెచ్చి, బహుళప్రాచుర్యం కల్పించిన ప్రజ్ఞాశాలి.అది లలిత సంగీతమైనా,భక్తి సంగీతమైనా, శాస్త్రీయ సంగీతమైనా… అన్నింటికీ సమన్యాయం చేసి, విస్తృతంగా విహరించాడు. భీమ్ సేన్ జోషి వంటి హిందుస్తానీ సంగీతశిఖరాలతో జుగల్బందీలు చేశాడు.

నువ్వా-నేనా అన్నట్లుగా పాడి, వారిని అమితాశ్చర్యంలో ముంచి, కోట్లాదిమందిని మంత్రముగ్ధులను చేసిన ప్రతిభాభారతి బాలమురళి. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. స్వరాలతో ఆడుకున్నాడు. తిల్లానాలకు రససృష్టి చేశాడు. బాలమురళి గాత్రం నుండి తిల్లానాలు వస్తూ ఉంటే, ఎవరైనా వడలు మరచి, నాట్యం చెయ్యాల్సిందే. తిల్లానాలకు విన్యాసాలు  అందించిన విన్నాణం కేవలం బాలమురళి సొత్తు.

సాహిత్యాన్ని సంగీతమయం చేసిన ఘనుడు

మనోధర్మానికి పెద్దపీట వేశాడు. కవి లేదా వాగ్గేయకారుడు రాసిన సాహిత్యాన్ని అమితంగా గౌరవించి, సాహిత్యానికే అగ్రతాబూలం ఇచ్చి, సంగీతమయం చేసి, ఆ సౌరభాలను మరింత వికసింపజేసినవారిలో బాలమురళిదే అగ్రస్థానం. వాగ్గేయకారుల కీర్తనలు పాడి ప్రాచుర్యం చెయ్యడమేకాక, తాను స్వయంగా ఎన్నో కీర్తనలు రాసి, ఆధునికకాలంలో వాగ్గేయకారుడిగా అవతారమెత్తిన మహనీయుడు మంగళంపల్లి.

మూడుస్థాయిలలోనూ ఒకే రీతిన పరమాద్భుతంగా పాడగలిగిన గాత్ర సంపదకలిగిన అరుదైన గాయకుడు. సంగీతశాస్త్రంలోని 72 మేళకర్తలకు స్వరరచన, పదరచన చేసిన ఏకైక విద్వాంసుడు. పూర్వం, ఎవరైనా ఉండి ఉండవచ్చు. ఈ శతాబ్దంలో మంగళంపల్లి తప్ప ఇంకొకరు లేరు. వైలెన్, మృదంగం, కంజీరా,వయోలా, వీణ మొదలైన సంగీత వాయిద్యాలను అవలీలగా అద్భుతంగా వాయించగలిగిన బహుముఖ సంగీతప్రజ్ఞ ఈయనకే సొంతం.

ఆయనే పాడి, ఆయనే వైలెన్, ఆయనే మృదంగం వాయించి రికార్డ్ చేసి, ఆకాశవాణిలో అనేకసార్లు వినిపించారు. ఈ రికార్డ్ కూడా ఈయనదే.అంతేకాదు, సమకాలీన మహాగాయకులకెందరికో వైలెన్ వాయించి, వాద్య సహకారం అందించిన ఘనత, ప్రత్యేకత కూడా బాలమురళిదే. లలితంగా, సుందర సుమధురంగా పాడడం ఈయన విశిష్టత. హడావిడి, హంగామా ప్రదర్శనలు ఉండవు.

సృజనాత్మకమైన, రసాత్మకమైన,వినూత్నమైన  ఆవిష్కరణలతోనే మంగళంపల్లి సంగీతజైత్రయాత్ర సాగింది. మంగళంపల్లిని అనుకరించడం, అనుసరించడం అసాధ్యం. ఆయనలాగా పాడడం అసంభవం. కొందరు అనుకరించే ప్రయత్నం చేస్తున్నా, ఆది కృత్రిమంగానే ఉంటుంది. బాలమురళి బాలమురళియే.

అలా పాడాలంటే, మళ్ళీ ఆయనే పాడాలి. నేడు ప్రముఖ హిందూస్థానీ కళాకారిణి  కౌషికీచక్రవర్తి బాలమురళి దగ్గర తిల్లానాలు నేర్చుకున్నారు. ఇలా కొందరు  శిష్యులు, ప్రశిష్యులు, ఏకలవ్య శిష్యులు ఉన్నా, అలా చెప్పుకున్నా బాలమురళి సంగీతానికి వారసులు కాలేరు.

బాలమురళిని ఎవ్వరూ అనుసరించలేరు

ఆయనకు ప్రత్యామ్నాయ సృష్టి లేదు. ఆయనే ఆయనగా మళ్ళీ రావాలి.ఎనిమిదేళ్ల వయస్సులోనే సంగీత యాత్ర ప్రారంభించి, ప్రపంచమంతా కొన్ని వేల ప్రదర్శనలిచ్చారు. మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతిమాధ్యమావతి, గణపతి, సిద్ధి, అనే ఎన్నో కొత్త రాగాలు సృష్టించారు.కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం అందించారు.

కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. కొన్ని సినిమాల్లో నారదుడిగా పాత్రపోషణ కూడా చేశారు. ఆయన పాడిన సలలితరాగ సుధారస సారం, పాడనా వాణి కల్యాణిగా, ఆది అనాదియు నీవే దేవా, మౌనమె నీ బాస ఓ మూగమనసా మొదలైనవి  బహుళ ప్రజాదరణ పొందాయి. ఆయన పాడని పాటలేదు. ఆయన చూడని ఊరు లేదు.

ఆయన పొందని బిరుదులు, పురస్కారాలు లేవు. ఆయన ఎక్కని ఎత్తులు లేవు. ఆయన ఎత్తుకు ఎవ్వరూ చేరలేరు. ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మూడూ పొందిన ఏకైక సంగీత విద్వాంసుడు బాలమురళి. ఫ్రెంచ్ ప్రభుత్వంవారి అత్యున్నత గౌరవం  చెవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్  కూడా గెలిచిన ఏకైక భారతీయ కళాకారుడు మంగళంపల్లి.

త్యాగయ్య శిష్యపరంపర

త్యాగరాజ శిష్యపరంపరలోని పారుపల్లి రామకృష్ణయ్య పంతులుకు ప్రియశిష్యుడు. ఆ విధంగా, త్యాగయ్య శిష్యపరంపరలోకి కూడా  వచ్చి చేరాడు. సంగీత కుటుంబంలో పుట్టి, సంగీతమే లోకంగా జీవించిన సంగీతమూర్తి. లౌకికంగా పెద్ద చదువులు చదువుకోలేదు. అలౌకికంగా,  భాగవతోత్తములను ఉపాసించాడు. సంగీత సరస్వతిని ఆరాధించాడు. చదువులలోని మర్మాలన్నీ గ్రహించాడు.

బహు భాషల్లో భాషించాడు. రచించాడు. ఆలపించాడు. అలరించాడు. భాసించాడు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తర్వాత, మళ్ళీ అన్నమయ్యను ప్రజలకు అందించినవాడు ఈయనే. “ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది” అనే కీర్తన విజయవాడ రేడియో ద్వారా పాడి, తాళ్ళపాక కవిని మళ్ళీ తలపుల్లోకి తెచ్చాడు.

త్యాగరాజ పంచరత్న కీర్తనలకు సాహిత్యమే ప్రాణం.తన గానంతో ప్రాణప్రతిష్ఠ చేశాడు. కాంభోజి, కల్యాణి, ఖరహరప్రియ వంటి పెద్దరాగాలను పాడి, లక్షలమందిని కూర్చోపెట్టి వినిపించడం అంత తేలికైన పనికాదు. సలలితరాగ సుధారసంగా పాడి, అందర్నీ ఆయన పాటకు కట్టిపడేశాడు. ఇది కేవలం ఆయనకే సాధ్యమయ్యింది.

మంగళంపల్లి రాగపురుషుడు, యోగపురుషుడు, యుగపురుషుడు.తన 86వ ఏట,  నిద్రలోనే సునాయాసంగా శరీరాన్ని వదిలి వెళ్లిన పుణ్యపురుషుడు. బాలమురళి  భౌతికంగా ఈ లోకం వదిలి వెళ్ళిపోయినా, ఆయన పాట, ఈ లోకం ఉన్నంతకాలం ఉంటుంది. జీవించి ఉంటే, నేటికి 90ఏళ్ళు నిండుతాయి. జరామరణాలకు అతీతుడైన ఈ రససిద్ధునికి అంజలి ఘటిద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్న అధికార పార్టీ

Satyam NEWS

ఎవరినైనా నొప్పిస్తే అన్యధా భావించవద్దు: కలెక్టర్ సూర్య కుమారి

Satyam NEWS

బీసీ నేతలపై బరితెగించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు

Bhavani

Leave a Comment