38.2 C
Hyderabad
May 5, 2024 21: 39 PM
Slider జాతీయం

డ్రోన్ దెబ్బతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాశ్మీర్ సమస్య

#jummu

ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుందన్నది పాత సామెత. మనం వేసే ప్రతి అడుగులో వేగం పుంజుకోకపోతే, ఎంత వెనుకబడతామో, ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో భారత్ లోని పరిణామాలు చెబుతున్నాయి. కరోనా నుంచి కాశ్మీర్ దాకా అదే పరిస్థితి.

జమ్మూలో వరుసగా జరిగిన డ్రోన్ దాడులు మన డొల్లతనాన్ని బైటపెట్టడమేకాక, శత్రువులు ఎంత చురుకుగా, బలంగా ఉన్నారో తేటతెల్లమవుతోంది. ఏమరుపాటుగా ఉన్నప్పుడు దొంగదెబ్బ తీయడమే శతృవుల పని. అదే జరిగింది. దీని వెనకాల,అంతర్గత వ్యవస్థలోనూ ఎక్కడో లోపముంది. దాని పట్ల మరింత ఎరుక పెరగాలి.

మోడీ సమావేశాల వెనుక అంతర్జాతీయ వత్తిడులు?

స్వీయ లోపంబు ఎరుగుటే గొప్ప విద్య.. అన్నాడు అక్కినేని. జమ్మూ & కాశ్మీర్ లో శాంతి వెల్లివిరియాలి, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి, ప్రగతి వేగం పెరగాలి, పాలన ఊపందుకోవాలి అనే లక్ష్యాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐటీవలే సమావేశం నిర్వహించారు. దాని వెనకాల అంతర్జాతీయ ఒత్తిళ్ళు,రాజకీయ అవసరాలు ఉండిఉండవచ్చు గాక.

ఇది ప్రధాని మోదీ వేసిన మంచి అడుగు. కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపక్షాలతో ముచ్చటించి ముచ్చటగా మూడు రోజులు కాకముందే, జమ్మూలో డ్రోను దాడుల రూపంలో అలజడి జరిగింది. విధ్వంసం సృష్టించాలని, అల్లర్లు,అలజడులు పెంచాలని శతృదేశాలు వ్యూహరచన చేసుకున్నాయి. అమలుచేయడం ప్రారంభించాయి.

లష్కరే తోయిబా కుట్రపూరిత దాడి

డ్రోన్ల దాడి పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చేసిన పని అంటూ జమ్మూ కాశ్మీర్ డిజి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ కేసును విచారించే పనిలో నిమగ్నమైంది.ఆ విచారణలో, దాడి వెనకాల ఎవరున్నారన్న అసలు నిజాలు ఆటోఇటోగా ఏదో ఒకరోజు ప్రకటిస్తారు. అది వేరే సంగతి.విధ్వంసం,నష్టం జరిగిన తర్వాత పోస్ట్ మార్టమ్ ఎట్లాగూ చేసుకుంటాం.

మనం సర్వ సమర్ధంగా ఉంటే? సరియైన సమయంలో బలమైన అడుగులు వేసివుండి వుంటే,ఇటువంటి పరిస్థితులు వచ్చిఉండేవికావు.370 ఆర్టికల్ రద్దు తరిమిలా,మనపై పాకిస్తాన్ శత్రుత్వం మరింత పెరిగింది.గోతి కాడ గుంటనక్కలాగా,మనపైన ఎప్పుడు దుమకాలా అని చూస్తోంది.

పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి

కాల్పుల విరమణ ఒప్పందానికి,శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నామని పైకి నంగనాచి మాటలు చెబుతూ, అంతర్గతంగా తాను చేయాలనుకున్న దుశ్చర్యలు చేసుకుంటూనే వెళ్తోంది. వాటిని మరోమారు మరింత బలంగా గుర్తెరగాలి. జమ్మూ వైమానిక స్థావరంపై,మరో సైనిక స్థావరంపై గంటల వ్యవధిలోనే దాడులు జరిగాయి.

డ్రోన్లను పసిగట్టలేని మన డొల్లతనం, కనిపెట్టే సమర్ధవంతమైన డిటెక్టర్లను సమృద్ధిగా అమర్చుకోని,అమర్చుకోలేని మన వెనుకుబాటుతనాన్ని మన శతృదేశాలతో పాటు ప్రపంచంలోని మిగిలిన దేశాలు కూడా కనిపెట్టాయి. మనం ఎంత వెనకబడి ఉన్నామో? లోకానికి తెలియజేయడం కూడా మన శతృదేశాల పన్నాగాలలో భాగమే.

కొండకు వెంట్రుక వేసిన చందంగా డ్రోన్లు మనపైకి వదిలారు. పాకిస్తాన్ కు తోడు చైనా కూడా మనపై పగబట్టే ఉంది. అమెరికా తన సైన్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ లో ఉపసంహరణ చేపట్టింది. అది కూడా మనకు నష్టాన్ని కలిగించే అంశమే.ప్రస్తుతానికి ఇంకా ఆ దుష్ప్రభావం మనపైన పడకపోయినా, భవిష్యత్తులో తప్పకుండా ఇబ్బందులు ఉంటాయనే భావించాలి.

అక్కడ రేపోమాపో తాలిబన్ల రాజ్యం ఊపందుకుంటుందని అంతర్జాతీయ సమాజాలు కోడై కూస్తున్నాయి.ఈ క్రమంలో, తాలిబాన్ల తాకిడి మనకు తప్పేట్టులేదు. పాకిస్తాన్, చైనా,ఆఫ్ఘనిస్థాన్ మన శతృదేశాల జాబితాలా ఉన్నాయి.రష్యాను కూడా దానికి జత చేయాలని చైనా, పాకిస్తాన్ కలిసి దుష్టపన్నాగం పన్నుతున్నాయి.

ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ఇప్పటికే భారీగా మూల్యం చెల్లించుకున్నాం. భవిష్యత్తులో వీరందరి మూకుమ్మడి దాడి మరింతగా ముసురుకుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. సంబంధిత నిపుణులు జోస్యం చెబుతూనే ఉన్నారు.కశ్మీర్ సమస్యను సత్వరమే పరిష్కారం చేసుకోవాలి. అదే శిరోధార్యం. ఆ దిశగా పీవీ నరసింహారావు,వాజ్ పెయి సమయంలో మంచి అడుగులు ఆరంభమైనాయి. ఆ కాలంలో ఉగ్రవాదుల దాడులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాశ్మీర్ లో,ఆకాశమే హద్దుగా ( స్కై ఈజ్ ది లిమిట్ ) అభివృద్ధి జరగాలి అనే నినాదాన్ని పీవీ నరసింహారావు ఎత్తుకున్నారు. దాన్నే మంత్రంగా భావించారు. ఆయన కనీసం మరో ఐదేళ్లు పరిపాలించి వుంటే, కాశ్మీర్ లో అభివృద్ధి జరిగి,కొంత సుహృద్భావ వాతావరణం ఏర్పడి ఉండేది.

వాజ్ పెయి విధానాలు కూడా మంచివే

వాజ్ పెయి ఎంచుకున్న విధానాలు కూడా మంచివే. మూడు నినాదాలను ఆయన ప్రకటించారు. (1) కాశ్మీరియత్ (2) జమ్ హూరియత్ (3) ఇన్ సానియత్. కాశ్మీర్ ప్రజల హృదయాలను గెలుచుకోవడం మొదటిది,ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయడం రెండవది, మానవత్వాన్ని మేలుకొల్పడం- మానవీయంగా వ్యవహరించడం  మూడవది.

ఇవన్నీ  అభివృద్ధి,చర్చలు,శాంతిస్థాపన,స్వేచ్చాయుత వాతావరణం, సాంస్కృతిక వికాసం, సమభావనా సంస్కారం చుట్టూనే అల్లుకునే ఉంటాయి. ఇద్దరు ప్రధానులు సహజంగా కవులు,శాంతి కాముకులు. రాజకీయాలకు,పాలనకు, దౌత్యనీతికి సంస్కారమనే శోభను అద్దినవారు కాబట్టి, కాశ్మీర్ విషయంలో,వారి పాలనా కాలంలో సుముహూర్తాలు నిర్ణయించారు.

శుభకార్యాలకు సంకల్పం చెప్పుకున్నారు. వీరి అనంతరం,కాశ్మీర్ సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది.370 ఆర్టికల్ రద్దు,స్వయంప్రతిపత్తి, ప్రత్యేక హోదాలను వెనక్కు తీసుకోవడం,రాజకీయనేతల దిగ్బంధం,ప్రజలపై ఆంక్షలు, ఆశించిన,ప్రకటించిన అభివృద్ధి జరగకపోవడం మొదలైన కారణాల వల్ల కశ్మీర్ లో ఆశించిన శాంతి ఇంకా వేళ్లూనుకోలేదు.

లడాఖ్ విషయంలో చైనాకు,కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు భారత్ పై ఆగ్రహావేశాలు మరింత పెరిగాయి.ఈ రెండు దేశాలకు అక్కడ పెత్తనం కావాలి. అందుకే, మనపై పోరుకు ఏకమవుతున్నాయి.ఇవ్వన్నీ ఎరిగిన ప్రధాని నరేంద్రమోదీ దిద్దుబాటు చర్యలకు దిగారు. రష్యాతో సంబంధాలు దెబ్బతినకుండా ఉండడానికి గట్టి ప్రయత్నాలు మొదలెట్టారు.

సమాంతరంగా, రక్షణ రంగాన్ని ఇంకా పటిష్ఠం చేసుకోవాలి,నిఘాశక్తిని మరింతగా పెంచుకోవాలి. చైనా,పాకిస్తాన్ తో ఎప్పుడు యుద్ధాలు వస్తాయో చెప్పలేం. ఏ సమయంలో వచ్చినా, ఢీకొనడానికి మరింత బలోపేతం అవ్వాలి. కాశ్మీర్ లో అభివృద్ధి చేపట్టి, ప్రజాస్వామ్యాన్ని సుస్థాపించడం, దౌత్యపరంగా వేయాల్సిన అడుగులు మరింత వేగంగా, సమర్ధవంతంగా వేయడం కీలకం. కాశ్మీర్,లడాఖ్ ప్రజల హృదయాలను గెలవడం, జమ్మూ వాసులకు మరింత ధైర్యాన్ని కల్పించడం చాలా ముఖ్యం. పొంచివున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని చాకచక్యంగా ఎదుర్కోవడం అత్యంత కీలకం.

– మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు రోజంతా అనుమ‌తి

Satyam NEWS

నరసరావుపేటలో నేడు కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో వినాయక చవితి

Satyam NEWS

Leave a Comment