27.7 C
Hyderabad
May 14, 2024 07: 25 AM
Slider ప్రత్యేకం

నరసరావుపేటలో నేడు కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ

#Kopparapu Kavulu

తెలుగు భాషకే చెందిన  విశిష్ట సాహిత్య ప్రక్రియ “అవధానం”. ఈ విద్యకు, ఈ కళకు ఆద్యులై, అవధాన కవులకు ఆరాధ్యులైన తొలి తరం కవులలో ప్రథమశ్రేణీయులు కొప్పరపు కవులు. ఆధునిక యుగంలో జంటగా కవిత్వం చెప్పాలనే మోజును రగిలించిన జంటకవులలో సుప్రసిద్ధులు, పద్యాన్ని మారుత వేగంతో పరిగెత్తించిన మహాకవులు కొప్పరపు సోదర కవులు.

ఈ జంటది పలనాటి సీమ, కొండవీటి క్షేత్రం. గుంటూరు జిల్లా నరసరావుపేటకు దగ్గరలో ఉన్న కొప్పరం వీరి స్వగ్రామం. వీరి విగ్రహాలను నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట లోని టౌన్ హల్ ప్రాంగణంలో ఆవిష్కరిస్తున్న శుభ సందర్భం ఇది. పద్య సరస్వతీ స్వరూపమైన కొప్పరపు కవుల కాంశ్యవిగ్రహాలు నరసరావుపేటలో ప్రతిష్ఠకు సిద్ధమయ్యాయి.

15 ఏళ్ల ప్రాయంలోనే శతావధానం

కొప్పరపు కవులకు నరసరావుపేటతో   అభేద్యమైన బంధం పెనవేసుకొనివుంది. అక్కడే రామడుగు రామకృష్ణశాస్త్రి దగ్గర సంస్కృత కావ్య, శాస్త్రాలు చదువుకున్నారు. పాతూరు ఆంజనేయస్వామి దేవాలయంలోనే ఎనిమిదేళ్ల వయస్సులో మొట్టమొదట అవధానం చేశారు, 15ఏళ్ళ ప్రాయంలో తొలి శతావధాన ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు.

 పలనాటి ముఖద్వారమైన నరసరావుపేటలో కవితాయాత్ర మొదలు పెట్టి, అప్రతిహతంగా జయకేతనం ఎగురవేశారు. యావదాంధ్ర దేశంతో పాటు, తమిళనాడు, మహారాష్ట్రలోనూ, ఎక్కడ తెలుగువారుంటే, అక్కడ పద్యాల వృష్టి కురిపించారు.

అనతి కాలంలోనే అగ్రగణ్యులుగా…

పలనాటికి చెందిన మహాపండితుడు, అపర ఆదిశంకరాచార్యుడు బెల్లంకొండ రామారాయ కవీంద్రుని హృదయాన్ని గెలుచుకున్న ఉత్సాహం ఇచ్చిన ఊతంతో సారస్వత సీమను పద్య ప్రవాహాలతో ఊపేశారు. నరసరావుపేటకు కాస్త దగ్గరగా ఉండే ఏల్చూరులో పోతరాజు రామకవి వద్ద పొందిన అవధాన విద్యా సాధన, ఈ జంటకవులను అగ్రగణ్యులుగా నిలిపింది.

నరసరావుపేట నగర నిర్మాతలైన మలరాజువారి సంస్థానానికి ఆస్థానకవులుగానూ విశిష్ట మర్యాదలు పొందారు. సుప్రసిధ్ధ శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాల వ్యవస్థాపకులు నాగసరపు సుబ్బరాయశ్రేష్ఠికి వీరు బాల్యమిత్రులు.

“సుగుణ సముదాయ పున్నయ సుబ్బరాయ” అంటూ వీరి స్నేహచిహ్నంగా శతకం అందించారు. కొప్పరపు కవుల జన్మస్థలంలో విగ్రహ ప్రతిష్ఠ జరగడం, అవధాన, ఆశుకవితా చరిత్రలో సువర్ణ అధ్యాయం. పద్య ప్రియులకు పండుగరోజు. తెలుగు సాహిత్య చరిత్రలో, కొప్పరపు కవులంతటి వేగంగా, అశువుగా పద్యాలు చెప్పినవారు ఇంత వరకూ లేరు.

 రోజుకొక శతావధానం చేసి , గంటకొక ప్రబంధం చెప్పి, మహాకవి పండితులందరినీ ఆశ్చర్య జలధిలో మునకలెత్తించారు. నాటి సమకాలిక మహాకవి పండితులందరూ వీరి సభల్లో పాల్గొని, ప్రత్యక్షంగా వీరి ప్రతిభా సరస్వతిని దర్శించి, పరవశించి, ప్రశంసలు పద్యరూపంలో అందించారు.

పుంఖాను పుంఖాలుగా పద్యాలు

కొప్పరపు కవులు లక్షల పద్యాలు వచించారు,వేల పద్యాలు రచించారు. అందులో ప్రబంధాలు, కావ్యాలు, శతకాలు, నాటకాలు ఉన్నాయి. అనేక లౌకిక, అలౌకిక కారణాల వల్ల చాలా సాహిత్య సంపద మృగ్యమైనా, నేటికీ కొన్ని వందల పద్యాలు అందుబాటులో ఉండి, కవితా ప్రియులకు విందులు అందిస్తున్నాయి, సందడి చేస్తున్నాయి.

కొప్పరపు సోదర కవులుగా సుప్రసిద్ధులైన వీరి పూర్తి పేర్లు కొప్పరపు వేంకట సుబ్బరాయకవి (1885-1932), వేంకటరమణకవి(1887-1942). వీరిలో అన్నింటా అగ్రజులు వేంకటసుబ్బరాయకవి 1932లో నలభైఆరవఏటనే, ఈ లోకం వీడి వెళ్ళిపోయాడు.

తమ్ముడు మరో పదేళ్లు (1942) జీవించినా, అన్నయ్య మరణంతో అస్త్రసన్యాసం చేశారు. తెలుగు భాషకు, తెలుగు పద్యానికి, అవధానానికి, ఆశుకవిత్వానికి అనితర సాధ్యమైన రీతిలో అంకితమైన పుణ్య గాత్రులు కొప్పరపు సోదర కవులు. ఈ జంట కవులు తెలుగు పద్యాల పంటసిరులు.

తెలుగు భాష ఉన్నంతకాలం వీరి పద్యనాదం వినిపిస్తూనే ఉంటుంది. ఎందరో మహాకవులు వసించి, భాసించిన కొండవీటి సీమలో కొప్పరపు కవుల ప్రతిమలు ప్రదర్శనకు సిద్ధమైన పుణ్యతిధినేడు. వారు పుట్టిన కార్తీకమాసంలోనే, వారి సీమలోనే  వారి విగ్రహ ప్రతిష్ఠ జరగడం సుందరం, శుభసూచకం.

సత్యం న్యూస్

Related posts

రోడ్డు ప్రమాద మృతులకు ఆర్థిక సహాయం

Bhavani

ఖాకీ రంగు యూనిఫామ్ కాసేపు పక్కన పెట్టిన పోలీసులు…

Satyam NEWS

‘‘రేవంత్ రెడ్డిని నేను బహిరంగంగానే సపోర్టు చేశాను’’

Satyam NEWS

Leave a Comment