28.7 C
Hyderabad
April 26, 2024 09: 08 AM
Slider ప్రత్యేకం

గ్రామీణ పేదలకు మొండిచెయ్యి చూపిస్తున్న జగన్

#raghuramakrishnamraju

గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ (MNERGA)  అమలు చేస్తుంటే ఏపి ముఖ్యమంత్రి కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు. తక్షణమే వడ్డీతో సహా కూలీల బకాయిలు చెల్లించాలని లేకపోతే గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేదల కూలీలు ఆందోళనలు మొదలు పెడతారని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇది:

ముఖ్యమంత్రి గారూ,

సత్యమేవ జయతే అని చెప్పింది ముండోపనిషత్తు. దీన్నించి పొందిన స్ఫూర్తి తో మన జాతి పిత మహాత్మా గాంధీ దేశంలో గ్రామ స్వరాజ్యం ఉండాలని నొక్కి చెప్పారు. గ్రామీణ ప్రాంతాలే ఆయువుపట్టుగా ఉన్న దేశంలో ఇది అత్యంత కీలకమైనదని కూడా ఆయన భావించారు. మాజీ ఎమ్మెల్సీ, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి ఆయన బతికి ఉన్నప్పుడు మిమ్మల్ని మళ్లీ పుట్టిన మహాత్మా గాంధీ (అభినవ గాంధీ) అని స్తుతించారు. అయితే నా ఉద్దేశ్యంలో ప్రజలు మిమ్మల్ని ఆ విధంగా అనుకోవడం లేదు.

మీలో అలాంటి ఛాయలు ఏమీ ప్రజలకు కనిపించడం లేదు. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు మీరు ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదు. పైగా గ్రామీణ ప్రాంతాలలో పనికి ఆహార పథకం (NRGS)  కింద చేపట్టిన పనులకు మీరు ఇప్పటి వరకూ కూలి బకాయిలు కూడా చెల్లించలేదు. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించే పవిత్ర ఆశయంతో పనికి ఆహార పథకం ప్రవేశ పెట్టారు.

మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ (MNERGA)  పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఏడాదిలో కనీసం వంద రోజుల పాటు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో గ్యారెంటీగా లభించే ఉపాధి ద్వారా వారికి లభించే కూలి డబ్బుతో వారు క్లిష్ట సమయాలలో సజావుగా జీవనాన్ని గడిపేందుకు వీలుకలుగుతుంది. గ్రామాలలో ఎలాంటి నైపుణ్యం లేని పేద కూలీలు ఎందరు ముందుకు వచ్చినా కూడా వారికి ఈ స్కీమ్ కింద ఉపాధి కల్పించాలని నిర్దేశించుకున్నారు. ఇదంతా కేవలం గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని చేసినదే.

ఇంతటి మహత్తర పథకంలో పని చేసిన గ్రామీణ నిరుపేద కూలీలకు చెల్లించాల్సిన కూలి డబ్బు బకాయిలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని మీరు చెప్పినప్పుడు రాష్ట్ర హైకోర్టు మండిపడ్డ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా చెప్పిన న్యాయస్థానాలను అభినందించక తప్పదు.

ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద నిధులు లేవని చెప్పడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆక్షేపణ కూడా వ్యక్తం చేసింది. 2018-19 సంవత్సరానికి కేంద్రం నుంచి ఎంత మేరకు నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు చేశారు అనే ప్రశ్నలను కూడా రాష్ట్ర హైకోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై సంధించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదని చెబుతూ మీరు చేసిన ఈ పని జాతి పిత మహాత్మా గాంధీ ఆలోచనలకు పూర్తిగా భిన్నమైనది. విరుద్ధమైనది.

2018-19 ఆర్ధిక సంవత్సరం నుంచి 2020- 21 ఆర్ధిక సంవత్సరం మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకం కింద మొత్తం రూ.1,12,443.9 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు 2021 మార్చి 31 వరకూ ఉన్న సమాచారం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.10,365.5 కోట్లు (9.21%)ను కేంద్ర ప్రభుత్వం నుంచి పొందింది. 2018-19 సంవత్సరానికి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం రూ.1500 కోట్ల కన్నా తక్కువే. గత రెండు సంవత్సరాలుగా వస్తున్న ఈ నిధులన్నీ ఏమైనాయని అడుగుతున్న ప్రజానీకానికి దయచేసి మీరు సమాధానం చెప్పాలి.

నా ఉద్దేశ్యం ప్రకారం ఈ నిధులన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఎకౌంట్ లో వేసుకున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశంపై తదుపరి వాయిదాకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరింత కూలంకషంగా పరిశీలన చేయాలని సూచిస్తున్నాను.

అలా కాకుండా ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవు అనే పాత అభిప్రాయాన్నే మళ్లీ న్యాయస్థానంలో చెబితే మీరు తీవ్రాతి తీవ్రమైన పరిణామాలను, న్యాయపరమైన చిక్కులను కూడా ఎదుర్కొనాల్సి రావచ్చునని నేను ముందుగానే మిమ్మలను అప్రమత్తం చేస్తున్నాను. మా దగ్గర నిధులు లేవు అని చెప్పడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయి అనే ప్రశ్న తలెత్తి, నిధుల దుర్వినియోగం కిందికి కూడా వస్తుందని కూడా నా అభిప్రాయం.

అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే ఈ కూలీల బకాయిలను తక్షణమే అంటే రాబోయే మూడు వారాలలో విడుదల చేయండి. అలా చేసి న్యాయ స్థానం నుంచి వచ్చే ఆక్షేపణలను తప్పించుకోమని సలహా ఇస్తున్నాను. లేకపోతే నిధుల దుర్వినియోగం అనే అభియోగం రావడం ద్వారా మన ప్రభుత్వం అన్ని రకాల చిక్కులలో పడవచ్చు.

కేంద్రం నుంచి నిధులు వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా ఇలాగే కాలయాపన చేస్తే ‘‘ సొమ్ము కేంద్రానికి సోకు రాష్ట్రానికి’’ అని రాష్ట్రంలోని ప్రజలు అందరూ అనుకునే వీలుకలుగుతుంది.

రూ.5 లక్షల కన్నా తక్కువ మొత్తంలో ఉన్న పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. మన ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.60,000 కోట్లు ఖర్చు చేస్తున్నదని మీరే చెబుతున్నారు. డబ్బులు లేని ఏ రాష్ట్రమైనా ఇంత పెద్ద ఎత్తున పథకాలకు డబ్బులు ఖర్చు చేయగలుగుతుందా? చేయలేదు. అందువల్ల కూలీలకు బిల్లులు చెల్లించే అంశం వచ్చినప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వ వద్ద డబ్బులు లేవు అని చెప్పడం కుదరదు.

చెప్పినా లాజిక్ కు అందదు. నేను ఇటీవల భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని,  సంబంధిత శాఖ మంత్రిని కూడా కలిశాను. ఈ పెండింగ్ బిల్లుల గురించి నేను ప్రస్తావించినప్పుడు వారి నుంచి ఒక్కటే సమాధానం వచ్చింది. తమ వైపు నుంచి అన్ని రకాల బకాయిలు చెల్లించేశామని వారు చెప్పడం ఒక్క సారిగా నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

రాష్ట్ర ప్రభుత్వం మరేదైనా అవసరాల కోసం ఆ నిధులను వాడుకుని ఉన్నదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇదే నిజమైతే భవిష్యత్తులో జరిగే ఆడిట్ లో ఈ విషయం బయటపడితే కేంద్రం చేపట్టే న్యాయప్రక్రియకు, విధించే జరిమానాలకు రాష్ట్ర ప్రభుత్వం గురి అవుతుంది.

మూడు సంవత్సరాలుగా బకాయిలు చెల్లించలేదంటే అది తీవ్రమైన విషయం. సమగ్ర ఆర్ధిక యాజమాన్య వ్యవస్థ (కాంప్రహెన్సీవ్ ఫైనాన్స్ మేనేజిమెంట్ సిస్టం) అమలు చేసిన కారణంగా బకాయిలు చెల్లించేందుకు వీలుకలగడం లేదని మీరు ఎన్ని కారణాలు చెప్పినా కూడా ఎంతో మంది తమ దగ్గర ఉన్న డబ్బును, బంగారం, ఆస్తులు కుదువపెట్టి తీసుకువచ్చిన డబ్బులను ఈ పనులకు వినియోగించారనేది మరచిపోలేని నిజం.

సిఎఫ్ఎంఎస్ ఏడాది చేసిన చెల్లింపులను న్యాయస్థానం అడిగి తీసుకుంటే చాలా విషయాలు మనకు ప్రతికూలంగానే ఉంటాయి. ఎందుకంటే సిఎఫ్ఎంఎస్ ద్వారా మనం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద ఎమౌంట్లను అవలీలగా చెల్లించేస్తూనే ఉన్నాం. చిన్న మొత్తాలు మాత్రమే చెల్లించలేకపోతున్నామనే విషయం బయటకు వెల్లడి అయితే దాన్ని మనం సమర్ధించుకోవడానికి  వీలుఉండదు.

పెద్ద పెద్ద పనులు చేసే పిఎల్ఆర్, మెఘా లాంటి సంస్థలకు ప్రభుత్వం ఆగమేఘాల మీద బిల్లులు క్లియర్ చేస్తున్న విషయం కూడా అందరూ అంగీకరించే విషయమే. అయితే పనికి ఆహార పథకం లాంటి చిన్న చిన్న బిల్లులు మాత్రమే మనం చెల్లించడం లేదనేది వాస్తవం. కొద్ది నెలల కిందట విడుదల అయిన ‘‘మిడిల్ క్లాస్ మెలోడీస్’’ అనే సినిమాలోని సన్నివేశాలు నాకు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయి. ఆ చిత్రంలో సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్న ఒక పాత్ర అప్పులు తీసుకువచ్చి ప్రజాపనులను చేస్తుంది. ప్రభుత్వం నుంచి బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఆ పాత్ర ఆత్మహత్యాయత్నం చేస్తుంది. MNERGA బిల్లుల చెల్లింపులో మరింత జాప్యం జరిగితే ఈ చిత్రంలో చూసిన సన్నివేశాలు మనకు నిజజీవితంలో కూడా ఎదురుపడే ప్రమాదం ఉందని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

ఇలా బకాయిలు రావాల్సిన వారిలో మన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కొందరు సర్పంచ్ లు గా గెలిచి ఉన్నారు. అందువల్ల తిరిగి ఏమీ ఆశించకుండా మీరు తక్షణమే ఈ పెండింగ్ బిల్లులను చెల్లించాల్సిందిగా నేను కోరుతున్నాను. మీరు తక్షణమే బిల్లులు చెల్లించకపోతే సమీప భవిష్యత్తులోనే వారంతా ఆందోళన బాట పట్టే అవకాశం ఉందని మీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను. అందుకే మీరు ఈ పెండింగ్ బిల్లులకు వడ్డీ కూడా చెల్లించాలని నేను సూచిస్తున్నాను. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చే చెల్లింపులు గమనించుకుంటూ చిన్న మొత్తంలో పనులు చేసిన వారిని కూడా కలుపుకుని వెళుతూ సరైన పంథాలో చెల్లింపులు జరపాలని నేను కోరుతున్నారు. కేంద్రం నుంచి మనం తెచ్చుకున్న నిధుల సరైన లెక్కలు చెప్పే విధంగా కూడా మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.

భవదీయుడు,

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

క్రీడారంగంలో ప్రభుత్వ సదుపాయాలు ఉపయోగించుకోవాలి

Satyam NEWS

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

Satyam NEWS

స్థిరాస్తి వ్యాపారుల కోసమే వరద కాలువ అలైన్మెంట్ మార్పు

Satyam NEWS

Leave a Comment