ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మత సంబంధమైన మరో వివాదం చుట్టుముట్టబోతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీ నుంచి 5 కిలోల బరువు గల వెండి కిరీటం, రెండు ఉంగరాలు మాయం కావడం పై బిజెపి ఆందోళనకు సిద్ధం అవుతున్నది. ఈ నగలు మాయమైనట్లు 2018 మే 5న దేవస్థానం అధికారుల దృష్టికి వచ్చిందని, అసలు ఏం జరిగిందో ఇన్ని రోజులు భక్తులకు ఎందుకు చెప్పలేదని బిజెపి నాయకుడు భానుప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి బాధ్యుడిని చేస్తూ ఏఈవో శ్రీనివాసులుపై రూ.7,76 లక్షల రికవరీపెట్టారని ఆయన తెలిపారు. అసలు ఒక్క వ్యక్తే.. ట్రెజరీ నుంచి ఈ నగలను ఎలా మాయం చేస్తాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎవరిని కాపాడేందుకు ఇన్ని రోజులు ఈ వ్యవహారాన్ని దాచిపెట్టారని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసుల నెల జీతం రూ.28 వేలు అని, అతడి జీతం నుంచి ఎలా మినహాయించుకుంటారని ప్రశ్నించారు. ఈ ఘటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఈవో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు ఉదయం టిటిడి ఎడ్మినిస్ట్రేటీవ్ భవనాన్ని మట్టడిస్తామని హెచ్చరించారు.
previous post