హెడ్డింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందా? కరెక్టే. అందులో ఏం తప్పులేదు. సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉన్నట్లు ఏసీలు, లైట్లు ఇప్పుడు కూడా బ్యాంకుల్లో ఉన్నాయి. దాదాపుగా అన్ని బ్యాంకు బ్రాంచ్ లు కూడా కార్పొరేట్ కంపెనీలు ఉన్నట్లే చూడ్డానికి అందంగా తయారయ్యాయి. బ్యాంకుల విలీనం ప్రక్రియ ప్రారంభించిన నరేంద్రమోడీ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని ఎటు తీసుకువెళుతున్నదో అర్ధం కావడం లేదని బ్యాంకు ఉద్యోగులే వ్యాఖ్యానించుకునే స్థాయిలో సంస్కరణలు జరుగుతున్నాయి. దేశంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉన్న ఈ స్థితిలో బ్యాంకుల పాత్రే కీలకం. వాటికే గ్రహణం పడితే ఎలా అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు కూడా అంటున్నారు.అయితే ఇవేం పట్టించుకునే స్థితిలో మోడీ ప్రభుత్వం లేదు. మార్పులు, చేర్పులతో బ్యాంకింగ్ రంగాన్ని అటో ఇటో తేల్చేయాలనుకుంటున్నది. ఇప్పటి వరకూ బ్యాంకింగ్ రంగంలో జరిగిన మార్పులు, చేర్పులతో సాధారణ ప్రజలకు పెద్దగా ఉపయోగపడేవి కానీ, అపకారం చేసేవి కానీ లేవు. దాచుకున్న డబ్బులు తిరిగి వస్తాయా రావా అన్న బెంగ తప్ప. ఇప్పుడు తాజాగా బ్యాంకింగ్ రంగంలో తీసుకోబోతున్న చర్య సాధారణ ఖాతాదారులకు కూడా అసౌకర్యం కలిగించవచ్చు. అదే ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం. తాజాగా బ్యాంకులకు కూడా శని, ఆది రెండు రోజుల పాటు శలవులు ఇచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పడు మొదటి శనివారం, నాలుగో శనివారం బ్యాంకులు బంద్ ఉంటున్నాయి. మధ్యలో రెండు శనివారాలు ఏం పాపం చేశాయని అనుకుంటున్నారో ఏమో గానీ నాలుగు శనివారాలూ బ్యాంకులు మూసేయాలనే నిబంధన రాబోతున్నట్లు సత్యం న్యూస్ కు తెలిసింది. ఇప్పుడు చెప్పండి. ఈ నిబంధన వచ్చేస్తే వారానికి ఐదు రోజులు పని చేసే సాఫ్ట్ వేర్ కంపెనీలలాగా బ్యాంకులు తయారవుతాయా లేదా?
previous post
next post