సీనియర్ పాత్రికేయుడు, మార్క్సిస్టు మేధావి, భారత కమ్యూనిస్టు నాయకుడు, విశాలాంధ్ర పూర్వ సంపాదకుడు కామ్రేడ్ చక్రవర్తుల రాఘవాచారి ఈరోజు తెల్లవారుఝామున తుది శ్వాశ విడిచారు. హైద్రాబాదు లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. రాఘవాచారి గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైద్రాబాదులో చికిత్స పొందుతూ ఉన్నారు. విశాలాంధ్ర విజయవాడ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుండి నివాళులు నిమిత్తం వారి భౌతిక కాయాన్ని ఉంచుతారు. వారి దేహాన్ని సాయంత్రం 7 గంటలకు పిన్నమనేని సిద్దార్ధ ఆసుపత్రిలో ఇస్తారు. సి.రాఘవాచారి మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని, 30 ఏళ్ల పాటు విశాలాంధ్ర సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తించిన రాఘవాచారి, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా, సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారని రామకృష్ణ తెలిపారు. రాఘవాచారి మరణం పట్ల సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. విశాలాంధ్ర పూర్వ సంపాదకుడిగా, ప్రముఖ సాహితీవేత్తగా అన్నింటికీ మించి ఉత్తమ కమ్యూనిస్టు రాఘవాచారి ఉన్నారని ఆయన మరణం తీరని లోటని విశాలాంధ్ర విజ్ఞాన సమితి చైర్మన్ ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. నిబద్దత కలిగి, విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టుగా విజ్ఞానఖనిగా ఆయన పేరు గాంచారని నాగేశ్వరరావు అన్నారు. రాఘవాచారి మృతి పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. తుదిశ్వాస వరకూ సిద్ధాంతాలు, విలువలే శ్వాసగా బ్రతికిన వ్యక్తి రాఘవాచారి అని, పత్రికా విలువలుకు కట్టుబడి ప్రజా శ్రేయస్సు కోసం సుదీర్ఘ కాలం కష్టపడిన వ్యక్తి అని ఎంతో మంది జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచిన రాఘవాచారి మరణం తీరని లోటు అని లోకేష్ అన్నారు.
previous post