జమ్మూ నుంచి అండమాన్ ఎక్సప్రెస్ లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్, అధికారులు, సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. ప్రయాణంలో వారికి అవసరమైన సదుపాయాలను సమకూర్చారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిట్ విద్యాలయ అధికారులు విద్యార్థిని, విద్యార్థులను ముందస్తుగా వారివారి స్వస్థలాలకు పంపిస్తున్న నేపథ్యంలో జమ్మూ నుంచి శనివారం రాత్రి అండమాన్ ఎక్సప్రెస్ లో 31 మంది తెలుగు విద్యార్ధినీ విద్యార్ధులు బయలు దేరారు. ఆదివారం మధ్యాహ్నం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్న అండమాన్ ఎక్సప్రెస్ లోని వీరికి ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్, అధికారులు, సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. స్వస్థలాలకు క్షేమంగా చేరాలని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రసాదం అందచేసి, అన్నవరం దేవస్థానం కండువాలతో సత్కరించారు. విద్యార్థిని, విద్యార్థుల తల్లితండ్రులు ఏవిధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. రెండవ విడతగా మరో 92మంది విద్యార్థిని విద్యార్థులు ఆదివారం రాత్రి న్యూ ఢిల్లీ కి చేరుకోనున్నారని, వీరికి ఆంధ్ర ప్రదేశ్ భవన్ అతిధి గృహంలో వసతి, భోజన సౌకార్యాలను ఏర్పాటు చేసి సోమవారం ఉదయం రైలు మార్గం ద్వారా వారి స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమములో ఏపీభవన్ ఓఎస్డీ పి.రవిశంకర్, ఎ.పి.ఐ.సి. ప్రత్యేక అధికారి కె. జయరావు, ఎపి భవన్ రెసిడెంట్ డాక్టర్ డా. రమాదేవి, ఎపి భవన్ అసిస్టెంట్ కమిషనర్లు డా. కె. లింగరాజు, ఏ.ఎస్.ఆర్.ఎన్. సాయిబాబు, ఎం.వి.ఎస్. రామారావు, పి.ఏ.ఓ. ఐ.వి. కృష్ణా రావు, ఏ.ఏ.ఓ. భూషణం రెడ్డి, ఆదినారాయణ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
previous post