29.7 C
Hyderabad
May 3, 2024 04: 26 AM
Slider ప్రత్యేకం

పంచాయితీ ఎన్నికలకు మరో మొలిక పెట్టిన ఏపి ప్రభుత్వం

#AdityanathDas

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై మరో మెలిక పెడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ కేంద్రానికి లేఖ రాశారు. కరోనా వ్యాక్సినేషన్, పంచాయితీ ఎన్నికల పోలింగ్ ఒకే సారి జరపాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తిన దృష్ట్యా తమకు సలహా ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ కు రాసిన ఈ లేఖలో కోరారు.

పోలింగ్ లో పాల్గొన బోతున్న సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు తమ సొంత ప్రాంతాలకు దూరంగా పోస్టింగ్ చేయబోతున్నామని ఈ దశలో వారు కరోనా వ్యాక్సినేషన్ కు లేదా ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారు రెండో డోసుకు రావడానికి తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుందని ఆదిత్యానాథ్ దాస్ తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకున్నవారిని పరిశీలనలో ఉంచాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఇప్పుడు అవన్నీ కష్టసాధ్యం అవుతున్నాయని ఆదిత్యానాథ్ దాస్ తన లేఖలో పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి తీవ్రమైన మానసిక వత్తిడి తలెత్తే అవకాశం కూడా ఉందని ఆయన అంటున్నారు.

జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3.8 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉండగా ఇప్పటి వరకూ 1.49 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకా వేశామని ఆయన తెలిపారు.

ఇప్పుడు 73,188 మంది పోలీసులతో బాటు మొత్తం 7 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు తక్షణమే వ్యాక్సిన్ వేయాల్సి ఉందని ఆయన తెలిపారు. పోలీసు, రెవెన్యూ మునిసిపల్ శాఖల అధికారులు 2,041 చోట్ల వ్యాక్సిన్ వేసేందుకు గుర్తించారని ఆయన తెలిపారు.

అయితే ఇప్పుడు గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తున్నందున 1,35,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. మొత్తం 5 లక్షల మందిని ఎన్నికల విధులకు కేటాయించాల్సి ఉందని వీరిలో పోలీసులు, పంచాయితీరాజ్ సిబ్బంది, రెవెన్యూ, విద్యా శాఖల వారు ఉన్నారని ఆయన తెలిపారు.

 వీరిలో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లు కూడా ఉన్నారని ఆదిత్యానాధ్ దాస్ తన లేఖలో తెలిపారు. వీరిని ఎన్నికల కోసం వివిధ ప్రాంతాలకు పంపాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా 73,188 పోలీసులను 1,35,000 పోలింగ్ స్టేషన్లకు పంపాల్సి ఉంటుందని అందువల్ల వారిని మూడు చోట్లకు మార్చాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇంతటి సంక్లిష్టమైన పరిస్థితి ఉన్నందున ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వాన్ని సలహా అడుగుతున్నారు.

Related posts

చలికాలంలో హాట్ గా పంజాబ్‌ పాలిటిక్స్

Sub Editor

కోడెల చర్యలపై మండిపడుతున్న కమ్మకులస్తులు

Satyam NEWS

కడప జిల్లా మునక ప్రాంతాల్లో భత్యాల పర్యటన

Satyam NEWS

Leave a Comment