షెడ్యూల్ కుల వివాదంలో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా చిక్కుకున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎస్సి రిజర్వుడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుచరిత గత ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి తరపున గెలిచారు. అనంతరం ఆమె రాష్ట్రానికి హోం మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. మేకతోటి సుచరిత క్రైస్తవ మతస్థురాలు అయినందున ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అనర్హురాలని ఫోరం ఫర్ ఇండిజినస్ రైట్స్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
అసోం లో కేంద్ర కార్యాలయం ఉన్న ఈ ఫోరం సాధారణంగా ఈశాన్య దేశంలోని రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇది ఎంతో ప్రాధాన్యత గల కేసు కాబట్టి ఈ ఫోరం దీన్ని స్వీకరించింది. ఎస్సీ స్టేటస్ ను దుర్వినియోగం చేస్తూ సుచరిత పోటీ చేసి గెలిచి ఉన్నత పదవిని చేపట్టారని ఇది చట్ట విరుద్ధమని ఫోరం తన ఫిర్యాదులో పేర్కొన్నది. సుచరిత క్రైస్తవురాలు అనడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ ఫోరం తన ఫిర్యాదులో పేర్కొన్నది.
ఈ ఫోరం తరపున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ధనుంజయ్ డి మాట్లాడుతూ ఒక తెలుగు యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రైస్తవరాలినని సుచరిత పేర్కొన్నారని అందువల్ల ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు అనర్హురాలని అన్నారు. ఈ మేరకు తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే తాడికొండ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వై ఎస్ ఆర్ సి పి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి షెడ్యూల్డ్ కులధృవీకరణ పై వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.