క్రీస్తు కాలంలో సముద్రంలో ప్రమాదానికి గురై నిక్షిప్తమైపోయిన ఒక నౌకను పురావస్తు పరిశోధనకారులు కనుగొన్నారు. ఈ విధమైన పరిశోధనలు జరిగి ఇంత పురాతనమైన శిథిల నౌకను సముద్రంలో కనుక్కోవడం ఇదే ప్రథమం. గ్రీక్ ఐలాండ్ వద్ద సముద్ర తీరంలో ఈ శిథిల నౌక కనిపించింది.
ఈ నౌకలో ఆ కాలంనాటి వస్తువులు కూడా లభ్యం కావడం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ నాటి కాలంలో ఆహార పదార్ధాలు, సారా దాచుకోవడానికి వినియోగించిన పాత్రలు ఓడలో లభ్యం అయ్యాయి. గ్రీకులు, రోమన్లు వాడే పాత్రలను పోలి ఉండటంతో పురావస్తు శాస్త్రవేత్తలు మరింత ఆసక్తిగా పరిశోధనలు జరిపారు. క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో ఈ నౌకను వినియోగించి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సముద్రపు ఒడ్డున ఈ నౌక లభ్యం కావడం వల్ల ఇది సముద్రంలో అప్పుడు మునిగిపోయి ఉంటుందా లేక సముద్రపు ఒడ్డున శిథిలమై పోయిందా అనే విషయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పుడు సముద్ర గర్భంలో మునిగిపోయి పరిణామ క్రమంలో అది భూమిలో కూరుకుపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సోనార్ ఇమేజింగ్ ద్వారా ఈ శిథిల నౌకను కనుగొన్నట్లు పట్రాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ జార్జి ఫెరెంటినస్ జర్నల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సైన్స్ లో వివరించారు.