31.7 C
Hyderabad
May 2, 2024 10: 34 AM
Slider ప్రత్యేకం

సన్నిహితుల వ్యాఖ్యలే మరింత ఇరికిస్తున్నాయా?

#YS Jagan Mohan Reddy

వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విషయాలలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆప్తులైన వారు ఇస్తున్న వివరణలు ఈ కేసును మరింత జటిలం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. హత్య విషయం ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో రూపొందించే సమయంలో తెల్లవారు జామున జరిగిన సమావేశంలోనే జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వివేకానందరెడ్డి మరణం విషయం ఆ సమావేశంలో ఉన్నవారికి చెప్పారని గత కొద్ది రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.

మేనిఫెస్టో కమిటీ సమావేశం తెల్లవారు జామున 4.30 గంటలకే మొదలవుతుందని, ఆ సమయంలో అక్కడకు చేరిన మేనిఫెస్టో కమిటీ సభ్యులు నలుగురితో వివేకా మరణం విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి పంచుకున్నారనేది సర్క్యులేట్ అవుతున్న వార్త. గత రెండు రోజులుగా దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడి అవుతుండటంతో దీనిపై వివరణ ఇచ్చేందుకు అజయ్ కల్లాం నేడు సిద్ధపడ్డారు.

వివేకా హత్య కేసులో అంశాలను వక్రీకరించడం సరికాదని, సీబీఐ విచారణ పేరుతో తప్పుడు వార్తలు రాస్తున్నారని అజయ్‌ కల్లాం మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను సీబీఐకి గుండెపోటు అని చెప్పినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, జర్నలిజాన్ని దిగజార్చారనడానికి ఇది నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ‘‘నన్ను ఒక సీబీఐ ఎస్పీ కొన్నాళ్ల కిందట కలిశారు.

నన్ను ఓ సమావేశం కోసం వివరాలు అడిగారు. నన్ను సీబీఐ ఎస్పీ ఇది గుండెపోటునా.. లేక వేరేనా.. అని ఏమీ అడగలేదు. నా దగ్గర సమాచారం సేకరించినప్పుడు అలాంటి చర్చే లేదు. దీనిపై సీబీఐ స్పందించి ఖండించాలి’’ అని అజయ్‌ కల్లాం అన్నారు. ‘‘సీబీఐ పేరుతో తప్పుడు సమాచారం రాస్తుంటే సీబీఐ విశ్వసనీయత పోతుంది. సీబీఐ ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చేవారిని అరెస్ట్ చేయాలి. మేనిఫెస్టో కమిటీ సమావేశంలో నేను సభ్యుడిగా పాల్గొనలేదు.

నా గురువైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలిస్తే వెళ్లాను. దానికి వివేకా హత్యకి లింక్ పెట్టడం అనైతికం అని ఆయన అన్నారు. తన దగ్గర ఆ సీబీఐ అధికారి సమాచారం మాత్రమే తీసుకున్నారని, తన దగ్గర ఎలాంటి సంతకాలు కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దానిని పెద్ద అంశంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. నేను చెప్పనిది చెప్పినట్టు పూర్తి అబద్దాలు ను రాశారు. నేను నా భార్యకి కూడా ఎలాంటి సమాచారం చెప్పలేదు. లీక్ పేరుతో తప్పుడు సమాచారంతో డ్రామా ఆడుతున్నారు. దీని పై లీగల్‌గా వెళ్లే ఆలోచన చేస్తున్నాను’’ అని అజయ్‌ కల్లాం స్పష్టం చేశారు.

హత్య జరిగిన రోజు మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందని దానికి నలుగురు ప్రముఖులు హాజరయ్యారని, ఆ నలుగురిలో ఒకరిని సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది అని మాత్రమే మీడియాలో ప్రసారం అయింది. ఎల్లో మీడియా అలానే రాస్తుందిలే అని చాలా మంది అనుకున్నారు. అయితే అది వాస్తవమేనని తాజాగా అజయ్ కల్లాం స్వయంగా స్పష్టం చేయడంతో వెల్లడి అయింది. మేనిఫెస్టో కమిటీ సమావేశం ముందు జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్పారనేది ఇక్కడ ముఖ్య విషయం

కాదు. ఆ విషయాలను సీబీఐ చూసుకుంటుంది కానీ వార్తల్లో వచ్చిన విషయాలలో సగం ఖరారు చేస్తూ అజయ్ కల్లాం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సమావేశం ముందు ఏం జరిగింది, ఎవరు ఏం మాట్లాడారు అనేది కాన్ఫిడెన్షియల్ అది నేను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు అని అజయ్ కల్లాం స్పష్టం చేశారు. అయితే సీబీఐ తనను ప్రశ్నించడం వరకూ నిజమేనని ఆయన అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అతి జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమంత్రి సన్నిహితులే ముఖ్యమైన సమాచారాన్ని ధృవీకరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది.

Related posts

తుంగలో తొక్కిన మరో హామీపై జగన్ కు త్రిబుల్ ఆర్ ఘాటు లేఖ

Satyam NEWS

పానగల్ బ్రాంచి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి

Satyam NEWS

వనపర్తి జిల్లా కేంద్రంలో పోలీసుల రక్తదాన శిబిరం

Bhavani

Leave a Comment