34.2 C
Hyderabad
May 14, 2024 22: 04 PM
Slider సంపాదకీయం

బీజేపీ…. బీఆర్ఎస్ మధ్యలో అన్నాచెల్లీ గేమ్

#YCPleaders

వైసీపీ నాయకులు ఆంధ్రా తెలంగాణ మళ్లీ కలవాలని ఆకాంక్ష వ్యక్తం చేయడం వెనుక ఆసక్తికరమైన వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఒక పథకం ప్రకారం చెప్పించుకుని దానికి ప్రతిస్పందనగా ఈ విషయం చెప్పడం వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. విడిపోయిన రెండు రాష్ట్రాలు కలవడం అనేది అసాధ్యం. అయినా ఈ విషయాన్ని ఏపిలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రస్తావించడం ఒక మైండ్ గేమ్ అని కూడా అంటున్నారు. అయితే ఈ మైండ్ గేమ్ ఎవరిపై ఆడుతున్నారనే అంశంపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను కాదని వెళ్లి తెలంగాణ లో పార్టీ పెట్టిన చెల్లెలు షర్మిల రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దుమ్మెత్తి పోస్తూ అనునిత్యం వార్తల్లో ఉంటున్నారు. పాదయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం కలియదిరుగుతూ సీఎం కేసీఆర్ కే కాకుండా టీఆర్ఎస్ (నేటి నుంచి బీఆర్ఎస్) మంత్రులకు, ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ షర్మిల ఉనికినే గుర్తించని వారు ఇప్పుడు షర్మిల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ పై పోరాటం చేస్తున్న కేసీఆర్ తో, కేసీఆర్ తో పోరాటం చేస్తున్న బీజేపీతో ఏకకాలంలో మంచిగా ఉంటూ కాలం గడుపుతున్న వైసీపీ నాయకులకు ఇప్పుడు షర్మిల తెలంగాణ లో చేస్తున్న రాజకీయం కొంత మేరకు నష్టం కలిగించేదిగా ఉంది.

బీఆర్ఎస్ పార్టీతో ఇంత కాలం గుంభనంగా సాగిన రాజకీయం షర్మిల కారణంగా చెడిపోయే పరిస్థితి వచ్చింది. తనకు తీవ్ర స్థాయిలో నష్టం జరిగే పరిస్థితి రావడంతో కేసీఆర్ కూడా షర్మిల పట్ల కఠిన వైఖరి అవలంబించేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అక్కడ ప్రధాని నరేంద్రమోదీ షర్మిల గురించి ప్రస్తావించడం జరిగిపోయాయి. దాంతో తమ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను సీఎం జగన్ ప్రధానికి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాని మోదీ అంతటితో ఆగకుండా అన్నా చెల్లెలి మద్య రాజీ చేయాలని చేసే ప్రయత్నంలో భాగంగా షర్మిలను పరామర్శించారు.

ప్రధాని పరామర్శతో బీఆర్ఎస్ మరింత భగ్గుమన్నది. అన్నాచెల్లెలు కలిసి బీజేపీతో అంటకాగుతూ తమకు చీకాకులు కల్పిస్తున్నారనే భావనలోకి బీఆర్ఎస్ నాయకులు వచ్చారు. బీఆర్ఎస్ నాయకులను చల్లార్చేందుకు ఎత్తుగడ వేయకపోతే ప్రమాదమని భావించిన వైసీపీ నేతలు షర్మిలకు చెక్ పెట్టేందుకు ఈ అస్త్రాన్ని ప్రయోగించారని అంటున్నారు.

రెండు రాష్ట్రాలూ కలపాలని స్వయంగా అన్నే అడుగుతుంటే నువ్వేంటి తెలంగాణలో తిరుగుతున్నావ్ అని తెలంగాణ ప్రజలు షర్మిలను ప్రశ్నించేందుకు ఇప్పుడు వీలుకలిగింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇటు చెల్లి షర్మిలను తెలంగాణలో రాజకీయంగా ఎదగకుండా చేసినట్లు అవుతుందని, అటు బీఆర్ఎస్ కు మళ్లీ సెంటిమెంటు అస్త్రాన్ని చేతికి ఇచ్చినందున వారితో సంబంధాలు సజావుగా సాగుతాయని వైసీపీ నేతలు భావించినట్లు చెబుతున్నారు.

అందుకే రెండు రాష్ట్రాలూ కలిపేయాలనే నినాదాన్ని ఎత్తుకున్నట్లు చెబుతున్నారు. తాము చేస్తున్న ఈ వాదనతో ఏపిలో తమకు ఎలాంటి నష్టం కలగదని, పైగా ఎక్కువ మంది ఏపి ప్రజలు ఇప్పటికీ హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తూనే ఉన్నందున తమకు లాభం చేకూరుస్తుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అందువల్ల రాష్ట్రంలో నష్టం లేని పరిస్థితి తో బాటు, చెల్లిని పూర్తిగా డిఫెన్సులోకి నెట్టేస్తే బీఆర్ఎస్ నాయకులు మళ్లీ తమకు మానసికంగా దగ్గరవుతారనే భావనలో వైసీపీ నేతలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఈ విధంగా తనను కాదని బయటకు వచ్చిన చెల్లెలిని కట్టడి చేయడం ద్వారా పంతం నెగ్గించుకున్నట్లు అవుతుందని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారని తెలిసింది.

ఈ గేమ్ ను పసిగట్టిన షర్మిల ఏపి ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ కీలకనేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ మేరకు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సజ్టల వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ నేతలు కూడా స్పందించనంత ఘాటుగా షర్మిల స్పందించారు. ‘‘సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి. నేడు తెలంగాణ ఒక వాస్తవం. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు? మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి, మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు’’ అంటూ అత్యంత ఘాటైన సమాధానం ఇచ్చారు.

Related posts

ల‌బ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

Satyam NEWS

యువతి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రికి కరోనా

Satyam NEWS

Leave a Comment