30.7 C
Hyderabad
April 29, 2024 03: 59 AM
Slider ప్రత్యేకం

కేటీఆర్ పర్యటనకు ముందు అనూహ్య పరిణామం

#brsleader

రేపు మంత్రి కేటీఆర్ వస్తున్న వేళ కామారెడ్డి బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కామారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో ఉన్న వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి.

కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న కార్యకర్తల సమావేశం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. దాంతో సమావేశ వేదిక పైనుంచే నాయకులకు కేటీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. చిల్లర పంచాయతీలు అన్ని పక్కన పెట్టి అధినేత కేసీఆర్ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రగతి భవన్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో సైతం నాయకులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది. దాంతో ఎడమోహం, పెడమోహంగా ఉన్న నాయకులు కలిసికట్టుగా పని చేస్తున్నారు.

వైస్ చైర్మన్ భర్త వీరంగం

రెండు రోజుల క్రితం కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాలులో జరిగిన జరిగిన సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త బీఆర్ఎస్ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హంగామా సృష్టించాడు. ఉద్యమ కాలం నాటి నుంచి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డి చొక్కా పట్టుకుని తనపై పార్టీ అధినాయకత్వానికి నెగెటివ్ రిపోర్ట్ ఇస్తున్నారని, దాంతో తనకు పార్టీలో ప్రయారిటీ ఇవ్వడం లేదని, ఎన్నికలకు సబంద్ ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదని బూతు పురాణం అందుకున్నారు. ఈ విషయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వారించకుండా ఉన్నారన్న ప్రచారం సాగింది. దాంతో జరిగిన విషయాన్ని నేరుగా కేటీఆర్ కు తిర్మల్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో ఎక్కడ కనిపించకూడదని కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.

సస్పెండ్ చేస్తూ ప్రకటన

గతంలో చంద్రశేఖర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నా పార్టీ అధిష్టానం చూసిచూడనట్టుగా వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. సరైన సందర్భం కోసం పార్టీ వేచి చూసిందని, తిర్మల్ రెడ్డిపై దాడికి ప్రయత్నించిన అంశంలో పార్టీ అధినాయకత్వం చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించింది. కామారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తక్షణ చర్యలు ప్రారంభించారు. ‘పార్టీ నియమావలికి విరుద్ధంగా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని క్రమశిక్షణ చర్యలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నాము’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

గీత దాటితే వేటు అని హెచ్చరిక

గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సస్పెండ్ తో పార్టీలో అలజడి మొదలైందన్న చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తరుణంలో పార్టీని ఇరకాటంలో పెట్టేలా, పార్టీ గీత దాటేలా ఎవరు వ్యవహరించినా వేటు తప్పదనే హెచ్చరికలు పార్టీ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కామారెడ్డిలో ఉన్న గ్రూపు రాజకీయాలకు ఈ సస్పెన్షన్ హెచ్చరికగా భావిస్తున్నారు. ఇకపై ఎవ్వరైనా పార్టీ తీరుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇలాంటి చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు పార్టీ జారీ చేసింది. ఇకపై పార్టీలో ఎవరు ఇలాంటి సాహసం చేయరన్న చర్చ సాగుతోంది.

రేపు, ఎల్లుండి కేటీఆర్ పర్యటన

కామారెడ్డి నియోజక వర్గంలో రేపు, ఎల్లుండి మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న క్రమంలో కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అందులో భాగంగా రేపు ఉమ్మడి మాచారెడ్డి, కామారెడ్డి రూరల్, పట్టణ కార్యకర్తలతో మంత్రి సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మాచారెడ్డి మండల కేంద్రంలో మాచారెడ్డి, రామారెడ్డి, పాల్వంచ మండల బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం కామారెడ్డి రూరల్, కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఎల్లుండి రాజంపేట, బిక్కనూర్ మండల కార్యకర్తలతో బిక్కనూర్ మండల కేంద్రంలో, దోమకొండ, బిబిపేట మండల కార్యకర్తలతో దోమకొండ మండల కేంద్రంలో సమావేశం కానున్నారు. కార్యకర్తలతో కేటీఆర్ నిర్వహించే సమావేశ ఏర్పాట్లను నాయకులు పర్యవేక్షిస్తున్నారు. రేపు, ఎల్లుండి జరిగే ఈ సమావేశాల్లో కార్యకర్తలు, నాయకులకు కేటీఆర్ కీలక సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

కన్నా చేరికతో కొత్త ఉత్సాహంతో తెలుగుదేశం

Satyam NEWS

నేరేడుచర్ల దర్గాకు అధికారికంగా పట్టా మంజూరు

Satyam NEWS

అదనపు ఎస్పీల బదిలీలు

Bhavani

Leave a Comment