28.7 C
Hyderabad
April 28, 2024 08: 35 AM
Slider ముఖ్యంశాలు

ఎన్డీయే సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాణం

#BRS vote

తొమ్మిదేళ్ల పాలనలో అన్నింటా విఫలమై దేశాన్ని భ్రష్టు పట్టించిన కేంద్ర సర్కార్ ను వదిలే ప్రసక్తే లేదు.. వెంటాడి,వేటాడుతామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎంపీ నామ కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.

అవిశ్వాస తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ నామ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ పై ఎఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. ఎంపీ నామ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అంశంతో సహా అనేక కీలక అంశాల్లో పార్లమెంట్లో చర్చ జరపకుండా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిందని నామ చెప్పారు.

పార్లమెంట్లో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక కీలక అంశాలపై చర్చించాలని పార్లమెంట్ ప్రారంభమైన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుఫున వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉన్నా కేంద్ర ప్రభుత్వం చర్చ జరపకుండా మొండిగా వెనక్కిపోతుందని మండి పడ్డారు. బీఆర్ఎస్ అంటేనే భారత రాష్ట్ర సమితి… దేశంలోని అన్ని సమస్యలపైనా పార్లమెంట్లో లేవనెత్తు తామన్నారు. 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో ఫెయిలైందని ధ్వజమెత్తారు.

కేంద్రం తీరు తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో హింసాత్మక ఘటనలతో ఆ రాష్ట్రం అట్టుడుకుతుందని, అక్కడి ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని, బతుకుతున్నారని, ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అక్కడ చెలరేగిన హింస వల్ల అక్కడ పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించి, నరమేధం జరుగుతున్నా కేంద్రానికి పట్టకపోవడం దారుణ మన్నారు.

మణిపూర్ ఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని పదే పదే బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చినా చర్చకు అనుమతిమించకుండా ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యంగా, మొండిగా వ్యవహరిస్తూ తప్పించుకుంటోందని అన్నారు. దేశంలో పరిస్థితులు క్షీణించి ,శాంతి భద్రతల సమస్య ఏర్పడినా కేంద్రానికి పట్టకపోవడం అప్రజాస్వామికం అన్నారు.

పార్లమెంట్ సమావేశాలకు ముందు 19న జరిగిన పార్లమెంటరీ పార్టీ లీడర్స్ తో జరిగిన సమావేశంలో కూడా మణిపూర్ అంశంతో సహా అనేక కీలక అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కోరామని, అయినా కేంద్రం అవేవి పట్టించు కోకుండామొండిగా వ్యవహరిస్తుందని నామ దుయ్యబట్టారు.

మణిపూర్ ఘటనలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలదించుకునేలా చేశాయని అన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించి, చర్చకు అనుమతించాలని కోరామని, కానీ కేంద్రం అందుకు సిద్ధంగా లేదన్నారు. మణిపూర్ అంశంపై చర్చ జరిపేందుకు ఎన్ని విధాలా ప్రయత్నించినా కేంద్రం ఒప్పుకోకపోవడం వల్లనే చివరికి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చామని చెప్పారు.

మణిపూర్ అంశంతో పాటు చైనా, పాకిస్తాన్ సరిహద్దు సమస్యలు, రైతులు, పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, నిరుద్యోగం, రైల్వే ప్రమాదాలు తదితర అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చిస్తామని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంలో ఇంకా దేశంలోని అన్ని ప్రధాన సమస్యలపైనా చర్చిస్తామని చెప్పారు. సమస్య ప్రాతిపదికగా కూలంకషంగా చర్చ జరుపుతామని వెల్లడించారు.

బీఆర్ఎస్ కు దేశ ప్రజల బాగోగులు ముఖ్యమని, వారు బాగుంటేనే మనమంతా బాగుంటామని, వారు పడుతున్న ఇబ్బందులు, సమస్యలన్నింటిని ఇష్యూ ప్రాతిపదికగా పార్లమెంట్లో చర్చకు చేపడతామని స్పష్టం చేశారు. ఏ అంశంలోను కేంద్రానికి ఒక విధానం అంటూ లేకుండాపోవడం వల్ల దేశంలో అనేక సమస్యలు తిష్ట వేశాయని అన్నారు. వాటిపై చర్చకు ప్రయత్నిస్తే దొరక్కుండా పారిపోతుందని అన్నారు.

మా నాయకుడు కేసీఆర్.. ఆయన నిర్దేశకత్వంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్ సాక్షిగా చర్చించి, ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలిపారు. . 9 ఏళ్ల పాలనలో దేశాన్నే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టపర్చారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా తెలంగాణాపై కుట్రలు చేస్తూ వస్తున్నారని అన్నారు. రైతులకు, బడుగు, బలహీన వర్గాల వారికి కొండంత అండగా ఉంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెళుతుందని నామ పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం విలయతాండం చేస్తుందని, ఫలితంగా గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి, సామన్య ప్రజలు బతకలేని దుస్ధితి ఏర్పడిందని అన్నారు. ఉద్యోగాలు లేక యువత నీరుగారిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అన్ని కుట్రలను పార్లమెంట్ సాక్షిగా ఎండగడతామని స్పష్టం చేశారు.

ఎంపీ నామ నాగేశ్వరరావు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణానికి ఎఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాసరెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీస్ పై సంతకం చేశారు.ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం నోటీస్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు పార్టీ ఎంపీలతో కలసి లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ను కలసి, లేఖ అందజేశారు.

Related posts

ప్లాస్టిక్ ను విచ్చలవిడిగా వాడటం పర్యావరణానికి హానికరం

Satyam NEWS

కెమికల్ పాలు తయారు చేస్తున్న పవిత్ర డైరీ

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరైన ప్రముఖులు

Satyam NEWS

Leave a Comment