ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమరావతి రైతులు నేడు బంద్ కు పిలుపునిచ్చారు. దాంతో రాజధాని గ్రామాలలో బంద్ జరుగుతున్నది. రాజధాని కోసం తమ విలువైన భూములు పణంగాపెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తే ఇప్పుడు తమను మోసం చేశారంటూ వారు మండిపడుతున్నారు.
రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో సీఎం జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమా బైటాయించారు. రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ‘మాపై ఎందుకు ఈ పగ.. అమరావతి రాజధానిగా ఉంచాలి’ అంటూ ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు.
ఈ ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పోలీసులు దేవినేని ఉమాను అదుపులోకి తీసుకుని భవనిపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసు జీపుకు అడ్డంగా రైతులు బైఠాయించి నిరసన తెలుపగా రైతులను చెదరగొట్టి ఉమను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. పోలీస్ స్టేషన్లో నిరసన కొనసాగిస్తున్న రైతులతో కలసి దేవినేని ఉమా తన నిరసనను కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ రాజధాని నిర్మాణం జరగకుండా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఎన్నో కుట్రలు పన్నారని అన్ని అడ్డంకులను తట్టుకుని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. 7 నెలలుగా పైసా కూడా అమరావతి కి ఖర్చుపెట్టలేదని ప్రజాగ్రహం ముందే ఊహించారు కాబట్టి అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ముఖ్యమంత్రి రాజధాని పై ప్రకటన చేశారని దేవినేని వైసీపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. సీబిఐ విచారణ చేస్తే అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏమిటో బట్టబయలౌతుందని పిచ్చిపనులు ఇకనైనా మాని తక్షణమే రాజధాని అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేశారు.