తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శుక్రవారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు.
ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వహించిన ఊంజల్‌సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.
అనంతరం ఉడిపిలోని పలిమారు మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆశ్రయించడమే కలియుగంలో మోక్షసాధనకు మార్గమన్నారు. పురందరదాస కీర్తనలు భక్తిని విశేషంగా వ్యాప్తి చేస్తున్నాయని తెలిపారు. భగవంతుని నామసంకీర్తన కలియుగంలో అత్యంత ఉత్కృష్టమైన భక్తి మార్గమని చాటి చెప్పారు.
స్వామివారిని శరణాగత భక్తితో కొలిస్తే తప్పక కరుణిస్తాడని చెప్పారు. పురందరదాసులవారు అమితమైన భక్తితో స్వామివారిపై అనేక కీర్తనలు రచించారని తెలియజేశారు. అంతకు ముందు ఉదయం ఆస్థాన మండపంలో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తనం, ఆ తరువాత పురందర సాహిత్యగోష్ఠి కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం బెంగుళూరుకు చెందిన వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ పురందర దాసుల సందేశాల మార్గదర్శనంతో సులభంగా శ్రీవారి అనుగ్రహం పొందవచ్చన్నారు. ధనవంతుడైన పురందర దాసు తన వద్ద ఉన్న ధనాన్నంత పేదలకు దానం చేసి కట్టు బట్టలతో భగవన్నామస్మరణతో బయటకు వచ్చారన్నారు. కావున కలియుగంలో శ్రీవారిని ఆరాధించిన వారే గొప్ప ధనవంతులని వివరించారు.
ఇందులో ఉడిపిలోని పలిమారు మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామీజీ, చిన్నపలిమారు మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారాజేశ్వరతీర్థ స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాససాహిత్యాన్ని విస్తృ తంగా ప్రచారం చేస్తున్న 7 మందికి ”శ్రీ పురందర ప్రశస్తి” అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. వీరిలో టిటిడి వైఖానస ఆగమ పండితులు విష్ణుభట్టాచార్యులు, బెంగళూరుకు చెందిన శేషగిరి దాస్, విద్యాభూషన్, తిరుపతికి చెందిన ఆచార్య దేవనాథన్, ఆచార్య నారాయణ, ఆధోనికి చెందిన పరిమల వ్యాసరావు, ఉడిపికి చెందిన గోపాలాచార్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, శ్రీవారి ఆలయ ఒఎస్‌డి పాల శేషాద్రి, పేష్కార్ లోకనాథం, ఇతర అధికారులు, 2500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.