రాజధాని అమరావతి ప్రాంతంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. ఉద్దండ రాయుని పాలెం చేరుకున్న చంద్రబాబు నాయుడు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రదేశానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు అక్కడ మట్టి వున్న ప్రదేశంలో సాష్టాంగ నమస్కారం చేసి, మట్టిని ముద్దాడారు.
చంద్రబాబు నాయుడు పర్యటన లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నా ఆగకుండా పర్యటన కొనసాగించడంతో ఉద్దండ రాయుని పాలెంలో ఆయనకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అంతే కాకుండా మహిళలు పూల వర్షం కురిపించారు. వైసీపీ కార్యకర్తలు సీడ్ యాక్సిస్ రహదారి పై వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు విసిరారు. దాంతో తెలుగుదేశం శ్రేణులు ప్రతి దాడికి దిగాయి.
ఒక వైపు రైతులు చంద్రబాబు కు స్వాగతం పలుకగా పలువురు ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఆందోళనకారులను అడ్డుకుని పోలీసులు చంద్రబాబు పర్యటనకు మార్గం సుగమం చేశారు. ఆందోళనకారులు ముందుగా చేరుకున్నా పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.