తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో తిరిగి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులతో విడతల వారీగా చర్చలు జరుపుతున్నారు.
లీడర్లు పార్టీలు మారినా కేడర్ మాత్రం టీడీపీతోనే ఉందని నేతలకు మరోసారి గుర్తు చేస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే త్వరలో రానున్న జీహెచ్ ఎంసీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గ్రేటర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా టీఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు ప్రసాద్ చంద్రబాబు నాయుడును కలిశారు. రానున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలని బాబును కోరారు.
తన్నీరు ప్రసాద్ విజ్ఞప్తిపై బాబు సానుకూలంగా స్పందించారు. యువతనే టీడీపీకి బలమని, యువతకు పార్టీలో మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఎన్ ఎస్ ఎఫ్ నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.