26.7 C
Hyderabad
May 3, 2024 10: 41 AM
Slider సంపాదకీయం

అమరావతి రైతుల డిమాండ్ ను అపహాస్యం చేసిన సీఎం జగన్

#jagan

రాష్ట్ర హైకోర్టు కాదు కదా ఎవరు చెప్పినా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించే ప్రశ్నేలేదని అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగం వింటే అర్ధం అయిపోతున్నది. అమరావతి నుంచి రాజధానిని విడదీసి విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాలలో కూడా పెట్టాలని ఆయన కృతనిశ్చయంతోనే ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు విస్పష్ట తీర్పు, సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లని నేపథ్యంలో ఆయన తన లక్ష్యాన్ని ఎలా సాధించగలుగుతారనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే అయినా ఆయన మాత్రం అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు సిద్ధంగా లేరు.

అమరావతి ఒక్కటే రాజధానిగా ఎందుకు ఉండకూడదు? మూడు చోట్ల రాజధానిని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? అనే ఈ రెండు ప్రశ్నలకు జగన్ మోహన్ రెడ్డి లాజికల్ గా సమాధానం చెప్పలేదు. కేవలం రాజకీయ కారణాలతో మాత్రమే ఆయన మూడు రాజధానుల విషయాన్ని తీసుకువచ్చినట్లు ఆయన ప్రసంగంలోనే స్పష్టం చేశారు. కులం పేరు ప్రస్తావించకపోయినా కమ్మ కులానికి వ్యతిరేకంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా అర్ధం అవుతున్నది.

‘‘చంద్రబాబునాయుడికి సంబంధించిన వ్యక్తులు’’ అంటూ పదే పదే తన ప్రసంగంలో ప్రస్తావించడం కమ్మ కులం వారిని ఉద్దేశించే అని చెప్పక తప్పదు. ఒక్క చంద్రబాబునాయుడినే కాకుండా ఈనాడు రామోజీరావును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను, టీవీ 5 బీఆర్ నాయుడి పేర్లు పదే పదే ప్రస్తావించడం ద్వారా ఆయన పరోక్షంగా కమ్మ కులానికి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేశారు. ‘‘అన్ని చోట్లా మనవాళ్లే ఉండాలి’’ అనే సిద్ధాంతాన్ని మాత్రమే చంద్రబాబునాయుడు అమలు చేశారని చెప్పడం అంటే అది పరోక్షంగా కమ్మ కులం గురించి మాత్రమే చెప్పడం.

అందులో ఎలాంటి సందేహం లేదు. అమరావతి రైతులపై మంత్రులు పదే పదే విషం చల్లుతుంటే అది జగన్ అనుమతి లేకుండా జరిగేదా అని ఇంత వరకూ ఎవరైనా అనుమాన పడతారేమోననే ఉద్దేశ్యంతో అలా చెప్పమన్నది తానే అన్నట్లుగా నేడు అసెంబ్లీలో జగన్ ప్రసంగం సాగింది. భూ సేకరణ చట్టానికి అతీతంగా ‘‘భూ సమీకరణ’’ అనే కొత్త ప్రయోగాన్ని తీసుకువచ్చి 30 వేల ఎకరాలను చంద్రబాబు సేకరించడం అనే ప్రయోగాన్ని చాలా మంది గొప్ప విషయం అన్నారు కానీ అది ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో మాత్రం ‘‘భూ కామందుల స్వార్ధ ప్రయోజనం’’.

అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిలో కమ్మ కులం వారు తక్కువ మంది ఉన్నారని, ఎస్ సి ఎస్ టి బీసీలు, రెడ్డి కులస్తులు ఎక్కువ మంది ఉన్నారని లెక్కలతో సహా ఇప్పటికే అమరావతి ఉద్యమకారులు చెప్పినా కూడా ఆ వాదనను జగన్ అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపెంచడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా అది మాత్రం ‘‘కమ్మరావతి’’ అనే నేడు జగన్ మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేశారు.

చంద్రబాబునాయుడు ఎంతో మేధోమథనం చేసి అమరావతిని ‘‘సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్’’ అని ఎంతో గొప్పగా చెప్పారు. కానీ సెల్ఫ్ పైనాన్స్ మోడల్ అనే కాన్సెప్టును కూడా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించే స్థితిలో లేరు. అసలు అలాంటి మోడల్ పని చేయదు అనే వాదననే ఆయన మరో సారి వినిపించారు. సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ను అపహాస్యం చేస్తూ ఆయన చెప్పిన విధానం చూస్తే జగన్ మోహన్ రెడ్డి అమరావతిని ఏకైక రాజధానిగా ఒప్పుకునే ప్రశ్నేలేదనే విషయం అర్ధం అయిపోతుంది.

అమరావతి రైతులు వెయ్యి రోజులకు పైగా చేసిన ఉద్యమం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో చంద్రబాబునాయుడు ఆడిస్తున్న డ్రామాగానే ఉందనే విషయం ఆయన ప్రసంగంలో వెల్లడి అయింది. అమరావతి రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు తలపెట్టిన మహా పాదయాత్రను కూడా జగన్ మోహన్ రెడ్డి అపహాస్యం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి రైతులను అడ్డుకోవచ్చునని కూడా ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి మాటలు విన్న తర్వాత ఇప్పుడు అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రమాదంలో పడ్డట్టే చెప్పుకోవచ్చు. ఆ ప్రాంత ప్రజలు అమరావతి రైతులపై ఎక్కడైనా దాడులు చేయడానికి ముఖ్యమంత్రి ప్రసంగంతో ఆస్కారం ఏర్పడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టినా ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నంత కాలం అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగడం అసాధ్యమని ఆయన ప్రసంగంతో వెల్లడి అయింది.  

Related posts

ప్రకాష్ రాజ్ ట్వీట్‌:చీపురుతో కొట్టారు షాక్‌ తగిలిందా?

Satyam NEWS

కట్టలు తెంచుకున్న అవినీతితో భూ యజమానులకు ఇబ్బంది

Satyam NEWS

ఆసరా పెన్షన్ల ధరఖాస్తుల గడువును పెంచాలి

Satyam NEWS

Leave a Comment