39.2 C
Hyderabad
May 3, 2024 14: 37 PM
Slider ముఖ్యంశాలు

జాతీయ అవార్డు పొందిన సర్పంచ్ లకు సీఎం అభినందన

#KCR

రాష్ట్రంలోని పెంబర్తి,  చంద్లాపూర్ గ్రామాలకు ‘జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలు’గా అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. హస్తకళలకు ప్రపంచ  ప్రసిద్ధిగాంచిన జనగామ జిల్లా ‘పెంబర్తి’ కాగా ప్రతిష్టాత్మక గొల్లభామ చీరల తయారీ తో ప్రత్యేకతను సంతరించుకొని, రంగనాయక కొండల నడుమ ప్రకృతి రమణీయతతో  వెలుగొందుతున్న సిద్దిపేట జిల్లా ‘చంద్లాపూర్’, ఈ రెండు గ్రామాలు దేశవ్యాప్తంగా వందలాది గ్రామాలతో పోటీపడి  జాతీయ అవార్డులు దక్కించుకోవడం, తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి చేసిన కృషికి నిదర్శనమని సిఎం అన్నారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లో  బుధవారం కేంద్ర పర్యాటక శాఖ  చేతుల మీదుగా  జాతీయ అవార్డులు అందుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ను, పెంబర్తి’ గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులును,  చంద్రాపూర్’ గ్రామ సర్పంచ్ సూరగోని చంద్రకళ ను  సిఎం కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను, పర్యాటక శాఖ సంచాలకులు, తదితర  ఉన్నతాధికారులను, సిబ్బందిని ఈ సందర్బంగా సిఎం కేసీఆర్ అభినందించారు.

స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ పర్యాటక రంగం సాధించిన పురోగతిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే రామప్ప దేవాలయానికి ‘ వరల్డ్ హెరిటేజ్ సైట్’ గా యునెస్కో విశ్వవ్యాప్త గుర్తింపునిచ్చిందని, పోచంపల్లి’ గ్రామాన్ని యు.ఎన్.డబ్లు.టీ.వో బెస్ట్ రూరల్ విలేజ్’ గా గుర్తించడం ద్వారా దక్కన్ పీఠభూమిగా వెలుగొందుతున్న  తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని సిఎం గుర్తుచేశారు.

ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో నాడు తెలంగాణ ప్రాంతంలో నైరాశ్యం అలుముకుంటే,  నేడు జల కళను సంతరించుకుంటూ అభివృద్ధి చెందిన ప్రాజెక్టులు రిజర్వాయర్లు చెరువులు తదితర జల వనరులు, పచ్చదనాన్ని సంతరించుకున్న అడవులు, కొండలు, కోనలు,  అలరారుతున్న చారిత్రక కట్టడాలు, హూందాతనాన్ని ప్రకటిస్తున్న వినూత్న కట్టడాలు, ఆధ్యాత్మికతను ప్రభోధిస్తున్న పుణ్యక్షేత్రాల అభివృద్ధితో తెలంగాణ దేదీప్యమానంగా వెలుగొందుతున్నదని, తెలంగాణలో  నేడు అణువణువునా ప్రకృతి రమణీయత, పర్యాటక శోభ ఫరిడవిల్లుతున్నదని సీఎం తెలిపారు.

చారిత్రక సంపదతో ఇప్పటికే దేశంలో ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ పర్యాటక రంగ గరిమ, సాగునీటి రంగం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలతో, పచ్చదనం పర్యావరణ ఆధ్యాత్మిక కార్యాచరణతో, ప్రతిష్టాత్మక నిర్మాణాలు తదితర పటిష్టమైన చర్యలతో మరింతగా విస్తృతి ని సాధించిందని సిఎం వివరించారు. 

పర్యాటక రంగాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్ర ఏర్పాటు నుంచి నేటి వరకు కోట్లాది మంది దేశ, విదేశీ పర్యాటకులు తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించారని సీఎం తెలిపారు. తద్వారా పర్యాటకులకు విజ్ఞాన, వినోదాలను పంచడమే కాకుండా, వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అందిస్తున్నదని అన్నారు.

స్వయంపాలనలో రాష్ట్ర ప్రభుత్వ పటిష్ట చర్యలతో  దేశంలోనే ప్రత్యేక మైన టూరిస్ట్ డెస్టినేషన్ గా  తెలంగాణ రూపుదిద్దుకుంటున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. భవిష్యత్తులో పర్యాటక రంగం మరింత అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తూ  యువతకు ఉపాధి అవకాశాలను పటిష్టం చేస్తుందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Related posts

జగన్ సలహాదారు ఇప్పుడు ఇక ఎన్నికల కమిషనర్

Satyam NEWS

తెలంగాణ ప్రభుత్వమా? కల్తీ కల్లును అరిక‌ట్ట‌లేవా?

Satyam NEWS

కలుషిత గణేష్ ప్రసాదం తిని పిల్లల అస్వస్థత

Satyam NEWS

Leave a Comment