కాకతీయుల కాలం నాటి పేరిణి నృత్య కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యుడు (Center for Cultural Research and Training) CCRT – స్పెషల్ ఆఫీసర్ డా. తాడేపల్లి ని కోరారు.
డా. తాడేపల్లి నేడు మంత్రిని కలిశారు. ఈ నెల 22 న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే ప్రముఖ యక్షగాన కళాకారులు, సినీ దర్శకులు శ్రీ వేదాంతం రాఘవయ్య గారి శతదినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు.
సిఎం కేసీఆర్ రాష్ట్రంలో కళలకు, కళాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. కళాకారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులను అందించామన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమీ, CCRT ల ద్వారా రాష్ట్రానికి చెందిన కళాకారులకు స్కాలర్ షిప్ లను, పెన్షన్లు, రీసెర్చ్ స్కాలర్స్ కు తగిన ప్రోత్సహం, అవకాశాలను అందించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీన కళలు ఉన్నాయని, వాటిని కేంద్ర సాంస్కృతిక శాఖ ద్వారా జాతీయ స్థాయిలో ప్రోత్సాహం అందించాలని మంత్రి కోరారు.