రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాల పునర్ వైభవానికి సమగ్రప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కర్మాగారాలు, తిరిగి తెరవాల్సిన కర్మాగారాల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పుడున్న పోటీని తట్టుకోవడానికి, లాభదాయకంగా నడపడానికి అవసరమైన చర్యలను అందులో పొందుపరచాలన్నారు. కర్మాగారాలను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడంతోపాటు ఉప ఉత్పత్తులు ద్వారా అవి సొంతకాళ్లమీద నిలబడ్డానికి అవసరమైన అన్ని ఆలోచనలు చేయాలని నిర్దేశించారు.
చక్కెర సరఫరా చేసినందుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వీలైనంత త్వరలో చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో నిర్దేశించిన విధంగా సహకార డెయిరీలకు పాలుపోస్తున్నందుకు ప్రతి లీటరుకూ రూ.4ల బోనస్ అమలుపైనా ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. సహకార డెయిరీల బలోపేతం, రైతులకు మరింత లబ్ధి చేకూర్చే అన్నిరకాల చర్యలపైనా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు.
సహకార చక్కెర కర్మాగారాలు, సహకార డెయిరీలపై సీఎం వైయస్.జగన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, పశుసంవర్థకం, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో 29 చక్కెర కర్మాగారాలు ఉంటే అందులో 18 మాత్రమే పనిచేస్తున్నాయి. మహారాష్ట్రలో 264 ఉంటే 195 పనిచేస్తున్నాయి, యూపీలో 158 ఉంటే 119 మాత్రమే పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం సహకార చక్కెర కర్మాగారాలు 10 ఉండగా అందులో 6 మూతబడ్డాయి.
విజయనగరం జిల్లా భీమసింగిలో ఉన్న విజయరామగజపతి, విశాఖపట్నం జిల్లా చోడవరం , ఏటికొప్పాక, తాండవ సహకార చక్కెర కర్మాగారాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. మూతపడ్డవాటిలో అనకాపల్లి, గుంటూరు జిల్లా జంపని, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర, చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ, కడప సమీపంలోని చెన్నూరు సగర్ ఫ్యాక్టరీ ఉన్నాయి.
ఎన్నికలకు ముందు అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం అయినా ఆ తర్వాత కొద్దికాలానికే నిలిచిపోయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. పేరుకుపోయిన పంచదార నిల్వలతో కలుపుకుని ఇప్పటివరకూ 10 సహకార సుగర్ ఫ్యాక్టరీలపై భారం రూ. 891.13 కోట్ల రూపాయలు ఉందని అధికారులకు నివేదించారు. సహకార ఫ్యాక్టరీల నుంచి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పారు. వీలైనంత త్వరలో వీటిని విడుదల చేయలాని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో సహకార డెయిరీల స్థితిగతులపైనా సీఎం సమీక్ష చేశారు. సహకార రంగంలోని డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకూ లీటరుకు రూ.4లు బోనస్ కింద ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డెయిరీ కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయాలు పెంచే ఆలోచనలు కూడా చేస్తున్నామని సీఎం చెప్పారు. రానున్న రోజుల్లో సహకార డెయిరీల బలోపేతం, డెయిరీ రంగంలో మహిళల భాగస్వామ్యం, పాడి పశువులను గణనీయంగా పెంచడమనే మూడే కోణాల్లో కార్యక్రమాలు విస్తృతం చేస్తామని సీఎం చెప్పారు.