37.2 C
Hyderabad
May 2, 2024 13: 44 PM
Slider ఆదిలాబాద్

రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి

#asifabad dist

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో వర్షానికి దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం వరదలు వర్షాలు చేపట్టాల్సిన చర్యల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రాంతాల్లో రహదారులు చెడిపోయాయని వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో లో లెవెల్ కాజ్వేలపై ఇంకా నీరు ప్రవహిస్తుందని అక్కడ 24 గంటలు ప్రత్యేక టీమ్ లను ఉంచి ఎవరు కూడా 

కాజ్ వేలు దాటకుండా చూడాలన్నారు. గురువారం జిల్లాలో జరిగిన  రెండు సంఘటనల్లో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కష్టంగా మారిందని, వీటి ద్వారా గుణపాఠం నేర్చుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లా కి రావడానికి సమయం పడుతుందని, సింగరేణి ఆధ్వర్యంలో ఉన్న రెస్క్యూ టీం గోలేటి లో అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.

గురువారం పెద్ద వాగులో చిక్కుకున్న వారిని రక్షించిన సింగరేణి రెస్క్యూ టీం వారికి సహకరించిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వరదలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయాలని తెలిపారు.

రెండు మూడు రోజుల్లో డెలివరీ అయ్యే గర్భిణీ స్త్రీలను గుర్తించి ప్రమాదం లేని ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. దీని కోసం కాగజ్ నగర్ ఆసిఫాబాద్ లలో క్వారంటైన్ మాదిరిగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జిల్లావ్యాప్తంగా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న వారికి రానున్న మూడు రోజులు ఎట్టి పరిస్థితుల్లో సెలవు మంజూరు చేయకూడదన్నారు. ఎక్కడైతే బ్రిడ్జిల పై నుండి నీటి ప్రవాహం ఉందో అక్కడ వెంటనే టీమ్లను ఏర్పాటు చేసి ఫోటోలు దించి తనకు పంపించాలని తెలిపారు. వారం రోజుల పాటు పాఠశాలలు కళాశాలలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని తెలిపారు.

ఒకవేళ అవసరం పడితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి హాస్టల్స్ సిద్ధం చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో అనేక చోట్ల నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, దీనిద్వారా గురువారం అనేక చోట్ల నీరు నిలిచి పోయిందన్నారు.

వర్షం తగ్గిన తర్వాత వచ్చే వారంలో పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో నాలాలపై అక్రమ కట్టడాలు తొలగిస్తామని తెలిపారు. వీటి తొలగింపుకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు వచ్చిన ఆగేది లేదని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు తెలిపారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. అలాగే మండలాల్లో మండల స్థాయి అధికారులతో ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన వస్తువులు అనగా ట్యూబులు, తాళ్లు, లైఫ్ జాకెట్స్, లైట్స్ లాంటివి కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాలన్నారు. అలాగే కౌటాల, బెజ్జూర్, పెంచికలపేట, చింతలమనపెళ్లి మండలాలకు విద్యుత్ సరఫరా వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్ రెడ్డి, ఎస్పి వైవిఎస్ సుధీంద్ర, డి ఆర్ వో సురేష్, డిఎస్పి అచ్చేశ్వరరావు, జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Related posts

నేపాల్ లో భవనాలు నిర్మించిన చైనా.. స్థానికుల ఆందోళనలు

Sub Editor

వైసీపీ నేతల ఉపాధి హామీ పథకంలా కరోనా మహమ్మారి

Satyam NEWS

అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment