27.7 C
Hyderabad
April 30, 2024 08: 10 AM
Slider నిజామాబాద్

మేడిగడ్డ పర్యటనలు కాదు.. పరిష్కార మార్గాలు చూపాలి

#katipalli

కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజి పర్యటనలతో ఎలాంటి లాభం లేదని, జరిగిన నష్టాన్ని నివారించేలా పరిష్కార మార్గాలు చూపాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర శుక్రవారం రాత్రి కామారెడ్డి నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామం నుంచి యాత్రకు బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత కామారెడ్డికి వచ్చిన ఎమ్మెల్యే కెవిఆర్ కు క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సత్కరించారు. జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ్ కూడలి వద్ద నిర్వహించిన సభలో వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ భూములను అమ్మేస్తామంటే ఇప్పటి సీఎం నానా యాగీ చేశారని, ఇప్పుడేమో ఫ్రీ బస్ పథకం పెట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ స్థలాలు అమ్మితే డబ్బులైన వస్తాయని, లీజులకు ఇస్తే కబ్జాలకు గురవుతాయని, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీ మాల్ మాదిరిగా పరిస్థితి తయారవుతుందని విమర్శించారు.

ఫ్రీ విద్యుత్ అని చెప్పి 200 యూనిట్లు దాటితే మొత్తం చెల్లించాలనడం సరికాదన్నారు. గృహజ్యోతి పథకానికి రేషన్ కార్డు లింక్ ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం ఉన్న రేషన్ కార్డులు తప్ప కొత్త రేషన్ కార్డులకు ఇప్పటికి అతిగతి లేదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతిలో పెట్టారని సీఎం చెప్పారని, ఆరు గ్యారెంటీల అమలుకు అమలుకు 2 లక్షల కోట్లు అవసరం అవుతాయని గుర్తు చేశారు. ఎలాంటి కొర్రీలు లేకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఇచ్చే హామీలు అమలుకు నోచుకున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకంలో కేంద్రం నిధులున్నాయన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు నెలాఖరు వరకు జీతభత్యాలు ఇచ్చిందని, రిటైర్ మెంట్ ఉద్యోగులను పట్టించుకోలేదన్నారు. పాత, కొత్త ప్రభుత్వం తప్ప ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదని ఎద్దేవా చేశారు. ఎమర్జెన్సీ సర్వీసులో పనిచేసే పోలీసులకు, ఇతర ఉద్యోగులకు ముందు జితాలివ్వాలని, ఆ తర్వాత ఆరు గ్యారెంటీల అమలు గురించి మాట్లాడాలని సూచించారు. దుబాయిలో అక్కడి ప్రభుత్వం  హిందు దేవాలయాన్ని కట్టి ప్రధాని మోదీని పిలిచారని గుర్తి చేశారు. రాబోయే ఐదేళ్లలో విదేశాల్లో పనిచేసే భారతీయ ఉద్యోగులు తిరిగి రావడంతో పాటు విదేశాల నుంచి ఇక్కడికి ఉద్యోగాలు చేసేందుకు వచ్చేలా చేయడమే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచేలా ప్రజలు ప్రధాని మోదికి మద్దతివ్వాలని కోరారు

కామారెడ్డి తీర్పు.. దేశవ్యాప్త గుర్తింపు

కామారెడ్డి ప్రజలు, బీజేపీ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని కెవిఆర్ అన్నారు. కామారెడ్డి తీర్పుతో దేశవ్యాప్తంగా తనకు గుర్తింపునిచ్చారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు నెలలుగా పార్టీ బాధ్యతల రీత్యా ప్రజలకు అందుబాటులో ఉండలేనందుకు బాధగా ఉందని, మరొక 45 రోజుల పాటు ఈ దూరం కొనసాగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కామారెడ్డిలోనే అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఫిర్యాదుల పెట్టె ద్వారా వచ్చిన ఫిర్యాదులు తాను లేకున్నా పరిష్కారం అవుతున్నాయన్నారు.

ఇద్దరు సీఎంలను ఓడించి కామారెడ్డి ప్రజలు నన్ను శిఖరాగ్రాన ఉంచారన్నారు. ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణంలో ఎయిర్ పోర్టుకు వెళ్ళాక ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారైందని ఫోన్ వచ్చినా కలవలేని పరిస్థితి అని తెలిపారు. అమిత్ షా లాంటి నాయకులు గంటలో అపాయింట్మెంట్ ఇవ్వడానికి కామారెడ్డి ప్రజల అచంచల తీర్పే కారణమన్నారు. ఈసారి ఇద్దరు ఉద్దండులు బరిలో ఉండటం వల్ల వచ్చిన గెలుపు కాకుండా వచ్చే ఎన్నికల్లో ప్రచారం లేకున్నా ప్రజలు స్వచ్ఛందంగా గెలిపించేలా పని చేసి చూపిస్తానన్నారు.

అన్నా మస్తు రోజులయిందే

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే కెవిఆర్ కొద్దిరోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉన్నారు. చాలా రోజుల తర్వాత కామారెడ్డికి రావడంతో ‘అన్నా మస్తు రోజులయిందే.. పార్టీ ప్రోగ్రాం వల్ల రావడమే మానేశారు. జెర మాకు కూడా టైం ఇవ్వండి అన్నా’ అంటూ ఎమ్మెల్యే కెవిఆర్ ను కలవడానికి ప్రజలు పెద్దఎత్తున ప్రయత్నించారు. పార్టీ ముఖ్య నాయకులు కూడా తనవెంట ఉండటంతో ప్రజలతో కాసేపు మాట్లాడే పరిస్థితి లేకుండా పోవడంతో ఎన్నికల తర్వాత అందరితో మాట్లాడతానని చెప్పారు. ఓ మహిళ ఎమ్మెల్యే కారు వెంటే పరుగెత్తుకుంటూ రావడాన్ని చూసి కారు ఆపి ఆమె సమస్యను విన్నారు. తన భూమి సమస్యల్లో ఉందని పరిష్కారం చూపాలని సదరు మహిళ ఎమ్మెల్యేను కోరడంతో తాను లేకున్నా సమస్య పరిష్కారాన్ని తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ప్రజా రాజధాని అమరావతిని కేంద్రం కాపాడాలి

Satyam NEWS

అన్నదాత స్ఫూర్తి ప్రదాత

Satyam NEWS

రామమందిర నిర్మాణం లో మనందరం భాగస్వామ్యులవుదాం

Satyam NEWS

Leave a Comment