39.2 C
Hyderabad
May 3, 2024 14: 43 PM
Slider ప్రత్యేకం

ఇదేం న్యాయం: తప్పు ప్రభుత్వాలది శిక్ష టీచర్లకు

pvt and got school

ప్రైవేటు విద్యా వ్యవస్థ ప్రభుత్వ స్కూళ్ల మధ్య పోటీలో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలి పశువులు అవుతున్నారో వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం ఇది. 30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు.

డాక్టర్, లాయర్, ఇంజనీర్, రైతు కూలీ, పేదవాడితో సహా ఎవరి పిల్లలైనా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాల్సిందే. అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి. దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి.  అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు. ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు ఉండేది కాదు. 

కానీ విద్యార్థులు వారి సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు. తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది  ఉన్నత తరగతుల చదువుతూ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ  ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్య తో ముగించేవారు. అలాగే హైస్కూల్ స్థాయిలో, కాలేజీ స్థాయిలో డ్రాప్ అవుట్లు ఉండేవారు.

అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వల్లే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు. మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు. వారి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుడిని కూడా నిందించే వారు కాదు. కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతుంది. గ్రామాల్లోని విద్యార్థులు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది.

కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో  జాయిన్ చేయడానికి అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు  కొందరు. దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా? ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు. మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ?

ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది. అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా అని పర్మిషన్ లు ఇచ్చేసేది.  ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాళ్లు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు. ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోతుంది, కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు.

వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు. ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం  వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది. అపార్ట్ మెంట్ లో నడుస్తున్నా, విద్యా ప్రమాణాలు పాటించకున్నా ప్రభుత్వం తన మీద భారం లేదు కదా అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది. ప్రాధమిక స్థాయిలోనూ ఇదే తంతు. ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఉన్నత తరగతి కుటుంబాలు అటు వెళ్లాయి.

ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని  రూల్ ఏమి పెట్టలేదు. అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది. కానీ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు. ప్రభుత్వం మీద భారం లేదు ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు. 

అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు. అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ‌ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది. కష్టం చేసుకునే ప్రజల పిల్లలు ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు ఏ మాత్రం చదువు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు.

వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి  తీసుకెళ్లిపోయారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీ వల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది.  ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి చెట్టు మొదలు కి నీరు పోసినట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి.

అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది. ‌ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది. సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం, విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా  లేకపోవడం, ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి  సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం, ప్రైవేటు స్కూళ్లు సొంతంగా సిలబస్ రూపొందించుకున్నా అదుపు చేయలేక పోవడం.

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం ఇలా ప్రభుత్వం ప్రభుత్వ విద్యను చిదిమేసింది. గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సరిపోని రీతిలో ప్రభుత్వమే చేసింది. అయితే ఆ తప్పిదాన్ని పాలకులు ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటారు.‌ నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్య తగ్గట్టు స్కూళ్లను, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా?

ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూల్లో ఎందుకు బలోపేతం కావు? ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు. వాటిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు. అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు.

తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు. ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం  కేటాయించగల గలవారై ఉంటారు. ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. మరి ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు.. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీలు పిల్లలు… అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి.. ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి… పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి.. ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి.. 

పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు.. ప్రయివేటు వాడు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోడు. ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడు చేర్చుకుంటాడు. ప్రయివేటువాడు పుస్తకం లేకపోతే బడికి రానివ్వడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రానిస్తాడు.

పాఠశాలకు ఆలస్యమైతే ప్రయివేటు వాడు ఒప్పుకోడు. ప్రభుత్వ స్కూళ్లు ఒప్పుకుంటాయి. విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు 90 శాతం మంది నిరక్షరాస్యులు. వాళ్లకు పాఠశాల ను శుభ్రం చేసే మనుషులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులే ఆ పని చేసుకోవాలి.

చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు. ఎందుకంటే వాడు ఉంటే ఆ పాఠశాల పరువు తక్కువ కాబట్టి. ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటారు. ప్రయివేటు పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు. ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి… అవన్నీ మీకు కూడా తెలుసు… 

వ్యవస్థలో లోపాలు సరి చేయి కుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని  మాట్లాడుతున్న అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి. దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి. ఉపాధ్యాయులను ఆడిపోసుకోవడం కాదు. సరిగా చదువు రానివాడు కూడా మంత్రి కావచ్చు. ఉపాధ్యాయుడు కాలేడు.

-గుండ బాల మోహన్,

-శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉపాధ్యాయుల సంఘ ప్రధాన కార్యదర్శి.

Related posts

విఫలమైన గడప గడపకూ వైస్సార్సీపీ కార్యక్రమం

Satyam NEWS

జాతర మూడ్ : రాజన్న సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Satyam NEWS

డిగ్రీ చదివే అనూషను దారుణంగా హతమార్చారు

Satyam NEWS

Leave a Comment