వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఫిరాయిద్దామనుకున్న ఎంఎల్ఏ వంశికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. తెలుగుదేశం పార్టీ పునాదులు బలంగా ఉన్న ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున యార్లగడ్డ వెంకటరావు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అలాంటిది ఆయన పై గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని తీసుకువచ్చి తమపై కూర్చోబెడతామంటే ఊరుకునేది లేదని గన్నవరం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకటరావు ఎమ్మెల్యేతో ఎవరు రాజీ కుదిర్చినా సఖ్యతతో కొనసాగడం కుదిరేపని కాదు. వంశి చేరిక వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో నియోజకవర్గంపై మరింత పట్టును బిగించేందుకు యార్లగడ్డ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వంశీకి వ్యతిరేకులైన నాయకులను తెరవెనుక నుండి ప్రోత్సహిస్తున్నారు.
ఐదేళ్లు ప్రతిపక్షంలోఉన్నప్పడు వంశీ వైసిపి కార్యకర్తలను, యార్లగడ్డ వెంకటరావు అనుచరులను తీవ్రంగా ఇబ్బంది పెట్టినందున రాజీ సమస్యేలేదని అంటున్నారు. గతంలో అధికారం లేనప్పుడు భయపడలేదు, అధికారుల వేధింపులకు తలొగ్గలేదు, వ్యాపారాలను పరోక్షంగా దెబ్బ కొట్టినా తట్టుకున్నాను అంటున్నారు వెంకటరావు. కానీ ఎమ్మెల్యే వంశీ అందుకు విరుద్దంగా అధికారం కోసం, గతంలో చేసిన తప్పిదాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతోనో పార్టీలో చేరుతున్నారే తప్ప జగన్‌కు విధేయుడు కాదని యార్లగడ్డ తమ సన్నిహితులతో చెబుతున్నారట.